Sri Bharat
-
'విద్యావంతుడినంటావ్'..! ఇదేనా తెలివి.. శ్రీభరత్!!
సాక్షి, విశాఖపట్నం: విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏయూపై ఈసీకి లేఖతో కలకలం!తాజాగా రిటర్నింగ్ అధికారికి రాసిన ఒక లేఖ భరత్ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్‌కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్ చేస్తారని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసా? అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్‌కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్ బాక్సు కానీ ట్యాంపరింగ్ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈసీపై విశ్వాసం లేదా..?ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు.వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.టీచర్లనీ మార్చేయ్యాలంట.?ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది -
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
-
భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బాబూ.. శ్రీభరత్...! సూటిగా సుత్తిలేకుండా మాట్లాడుకుందాం... 👉విద్యా సంస్థల పేరుతో రూ.500 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని తాత కబ్జా చేసి.. నగర ప్రతిష్టను దిగజార్చినప్పుడు విశాఖపట్నం గుర్తుకు రాలేదు. 👉దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంపగా అభివర్ణిస్తూ.. విద్యల నగరం పరువును బంగాళాఖాతంలో కలిపేసినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు. 👉రాజధానిగా విశాఖ నగరం బెస్ట్ అని శివరామకృష్ణన్ కమిటీ ప్రకటించినా.. చంద్రబాబు వైజాగ్ ఎదగకూడదని భావించి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు... 👉 వీఎంఆర్డీఏకు చెందిన భూముల్ని దఫదఫాలుగా విక్రయించి.. రూ.1,600 కోట్ల వైజాగ్ సంపదని చంద్రబాబు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు.. 👉 నిన్నటికి మొన్న.. నీ సొంత వర్సిటీలో ఫీజుల్ని అమాంతం 40 శాతం పెంచేందుకు ప్రయత్నించినప్పుడూ విశాఖలో ఉన్న విద్యార్థులు గుర్తుకు రాలేదు.. 👉 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో అదీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో మాత్రం.. వైజాగ్ ఓ గ్రోత్ సిటీ అనీ.. రాజధానిగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని మాత్రం హఠాత్తుగా గుర్తొచ్చేసింది. 👉 దేశ, విదేశాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు వాహ్.. విశాఖ అని కొనియాడుతున్నప్పుడు గుర్తుకు రాని.. విశాఖపట్నం.. ఓటమి భయం ముంచుకొచ్చినప్పుడు మాత్రం తెగ గుర్తొచ్చేసింది.. ఏం భరత్.. ఇదేనా నీ విజ్ఞత.? ఇదేనా విశ్వసనీయత.? ఇదేనా విశాఖకు నీవిచ్చే విలువ.? 👉 2019 డిసెంబర్లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినప్పుడు.. శభాష్.. మంచి నిర్ణయమని మెచ్చుకోవడానికి కూడా ఇష్టపడని తమరికి.. ఇప్పుడు మాత్రం అమాంతంగా ప్రేమ ఉప్పొంగిపోతోందంటే ఆశ్చర్యమేస్తోందయ్యా.. 👉 చంద్రబాబులా ఏ ఎండకాగొడుగు పడుతూ.. పూటకో అబద్ధం.. మాట మాటకో మాయా మోసం అలవాటైనట్లుగా ఉన్నాయి. నిజమే మరి.. తమరూ ఆ తాను ముక్కే కదా.. ఆ అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి.? 👉 ఏమన్నావ్.. ఏమన్నావ్.?? ‘ఇవాళ అమరావతి అభివృద్ధి చేసేందుకు మన దగ్గర అంత డబ్బుల్లేవు. విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుంది. అమరావతి డెవలప్ చేయడానికి పెట్టుబడి చాలా అవసరం. అంత పెట్టుబడి పెట్టే స్థాయిలో ఏపీ ప్రభుత్వం లేదు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో మొత్తం అప్పులు మూడున్నర లక్షల కోట్లు. మనకి ఇవాళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితిలో లేము. మనం చూసేది ఏంటంటే.. మనకి గ్రోత్ ఇంజిన్ ఏంటి.? విశాఖపట్నం మన గ్రోత్ ఇంజిన్. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.’’ 👉 నిజంగానే ఈ మాటలు నీ గుండెల్లోంచే వచ్చాయా భరత్.? ఇన్నాళ్లూ అమరావతి అందమైన రాజధాని.. అంటూ బాబుతో కలిసి భజన బృందంలో తానా అంటే తందానా అంటూ పల్లవి కలిపిన తమరు.. ఎన్నికలు రాగానే ప్లేటు ఫిరాయించడం భావ్యమేనా భరత్.? ఈ మాటలు కూడా కేవలం ఓట్లు రాల్చుకునేందుకు పలికిన చిలక పలుకులే తప్ప.. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కావన్నది మీ మాటలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. తమరి విశ్వసనీయత ఏపాటిదో.. 2019 ఎన్నికల్లోనే పసిగట్టేశాం. అందుకే ఇంటికి పరిమితం చేశాం. 👉 ఒక్క విషయం గుర్తుంచుకో భరత్... వేల కేసులు వేసి.. విశాఖ రాజధానిని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నా బెదరలేదు.. అదరలేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తాననీ.. 2024లో ఘన విజయం సాధించి.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి.. ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ఢంకాపథంగా చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు కదా.. అదీ మాటంటే.. మాట మనసు లోతుల్లోంచి రావాలి. లక్షల మంది ఉన్న సమూహంలో మాట్లాడుతున్నా.. ఒక్కొక్కరినీ పలకరించినట్లు మాట్లాడుతున్నట్లుండాలి. అలా మాట్లాడాలంటే.. ప్రతి ఒక్కరి మనసు తెలిసుండాలి. వారి కష్టసుఖాలు ఎరిగి ఉండాలి. ఆ ప్రాంతంపై ఆదరాభిమానాలుండాలి. అది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం. అందుకే.. ఆయన విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పగానే.. కేవలం ఇక్కడికే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం చెప్పినట్లుగా.. గుండె లోతుల్లోకి వెళ్లిపోయింది. ఇది ఫిక్స్. ఇప్పుడు నువ్వొచ్చి.. కల్ల»ొల్లి కబుర్లు చెబితే.. నమ్మేవారెవ్వరూ లేరు భరత్.. నీ మాటలు ఒక నాటకం.. నీ విజ్ఞత ఒక బూటకం. నీవు నడుస్తున్న నీ పార్టీ ఒక మాయా ప్రపంచం. ముందు అందులోంచి బయటపడు. అప్పుడే విశాఖ అంటే ఏమిటో అర్థమవుతోంది. ఇట్లు, విశాఖ ప్రజలు -
బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రభుత్వం అతి పెద్ద గూండా! అది వైఎస్సార్ సీపీ అయినా.. టీడీపీ ప్రభుత్వమైనా అంతే..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విశాఖ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్. ఈయన నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు కూడా. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రభుత్వంతో పని చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ పోట్లాడలేరు. చేసిన పనులకు బిల్లు పెండింగులో ఉంటే కోర్టు కెళ్తే వస్తుందనుకుంటున్నారా? రాదు.. వెయ్యి కండిషన్లు పెడతారు. ఏదో లోపం వెతుక్కుంటూ పోతారు. అందుకే ప్రభుత్వాలపై నాకు నమ్మకం కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టే వారి దగ్గరకే ఎక్కువ మంది జనం చేరతారన్నారు.‘ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలన్నా.. వారికి చేరువకావాలన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కార్యకర్తలు రాజకీయ నాయకుడి దగ్గరకు విద్య, వైద్య, ఆరోగ్య అవసరాల కోసం వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అంటూ వస్తారు. నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను’ అని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా పోటీ చేయాలని ఎంచుకున్నట్లు చెప్పారు. ఎంపీ అయితే డబ్బుల విషయంలో నేరుగా జోక్యం(డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్) ఉండదన్నారు. ఎంపీ అభ్యర్థయితే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదని, తన లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థులే అవన్నీ భరిస్తారని కుండబద్దలు కొట్టారు.ఇప్పటికే శ్రీభరత్ ఎన్నికల ఖర్చుల విషయంలో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులపైనే భారాన్ని మోపారన్న విషయం తేటతెల్లమవుతోందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కోట్లకు అధిపతి అయిన శ్రీభరత్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యతను తమపైకి నెట్టేయడమేమిటని అసెంబ్లీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. మొత్తం మీద శ్రీభరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. -
నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు
-
నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు
సాక్షి, విజయవాడ: రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్‌సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్ 22న సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. తన బంధువులు, బినామీలతో భూములు కొనిపించి వాటిని రాజధాని పరిధిలోకి వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. రాజధాని భూముల్లో వందశాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆధారాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేరుతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసిన విషయం విదితమే. (చదవండి: సుజనా.. భూ ఖజానా) -
బాలయ్య చిన్నల్లుడిపై బాబు మార్కు పాలి‘ట్రిక్స్’
వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ.. ఇది ఏ తాను ముక్కో అందరికీ తెలుసు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాలకోసం పనిచేశారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని తేటతెల్లమవుతోంది. అదే సమయంలో ఆయన ఉన్నట్టుండీ జనసేన తరఫున విశాఖ ఎంపీ బరిలోకి దిగడం వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేమిటో తెలియాలంటే బాలకృష్ణ అల్లుళ్ల పోరు వద్దకు వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం లోక్‌సభ సీటును బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భరత్ మొదట్నుంచీ ఆశిస్తూ వచ్చారు. ఆర్నెల్లక్రితం మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దరిమిలా భరత్.. గీతం చైర్మన్ బాధ్యతలతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఆశించారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు నుంచి ఎంపీ టికెట్ హామీ కూడా తీసుకుని కొన్నాళ్లుగా ప్రచారం సైతం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని భావించడంతో.. తన కుమారుడికి ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు.. భరత్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. ఇందుకు భరత్ అంగీకరించలేదు. తన మామ బాలకృష్ణ వైపు నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో నారా లోకేష్ మంగళగిరికి తరలిపోగా.. భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేశారు. ఇవన్నీ పక్షం రోజులుగా అందరికీ తెలిసిన పరిణామాలే. విశాఖ నుంచి భరత్.. మంగళగిరి నుంచి లోకేష్.. మొత్తంగా బాలకృష్ణ అల్లుళ్ల టికెట్ కథ సుఖాంతమైనట్టేనని అందరూ భావించారు. కానీ సరిగ్గా అక్కడే చంద్రబాబు తన మాస్టర్ బ్రెయిన్‌కు పదునుపెట్టారు. తన మాట కాదని, తన కుమారుడిని జిల్లాలు దాటించి టికెట్ దక్కించుకున్న భరత్‌కు తన ’రాజకీయం’ ఎలా ఉంటుందో చవిచూపించాలనుకున్నారు. అంతే.. అప్పటివరకు భీమిలి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దించాలని భావించిన జేడీ లక్ష్మీనారాయణను రాత్రికి రాత్రే జనసేనలోకి పంపారు. ఇటు టీడీపీ టికెట్‌ను భరత్‌కు ఖరారు చేసిన వెంటనే.. జనసేన నుంచి లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేయించారు. జనసేన తరఫున అన్నిచోట్లా డమ్మీ అభ్యర్థులే.. భరత్‌పై మాత్రం లక్ష్మీనారాయణ వాస్తవానికి విశాఖ జిల్లాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన.. టీడీపీ అభ్యర్థులపై నామమాత్రపు అభ్యర్థులను పోటీకి దించింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులపై ఏమాత్రం పోటీకి నిలవని అభ్యర్థులను దించుతోంది. అనకాపల్లి ఎంపీగా ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని, అరకు లోక్‌సభ సీటుకు కూడా పోటీ చేయనని మొత్తుకుంటున్న అభ్యర్థిని బరిలోకి దిగాలని కోరుతోంది. కానీ విశాఖ లోక్‌సభకు వచ్చేసరికి ఏరికోరి లక్ష్మీనారాయణను బరిలోకి దించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో భరత్ కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులను విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా టీడీపీ పరిశీలించిన సందర్భంలో మాత్రం పెద్దగా ఎవరికీ పరిచయం లేనివారి పేర్లను పరిశీలించిన జనసేన.. ఎప్పుడైతే టీడీపీ టికెట్ భరత్‌కు ఖరారైందో ఆ వెంటనే జేడీ లక్ష్మీనారాయణను అర్ధరాత్రి హడావుడిగా తీసుకొచ్చి ప్రకటించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగి ఉందని అంటున్నారు. కనీస పోటీలోలేకుండాచేసేందుకే.. విశాఖ లోక్‌సభ చరిత్ర తీస్తే టీడీపీ ముప్పై ఆరేళ్ల ప్రస్థానంలో కేవలం మూడుసార్లు మాత్రమే గెలుపొందింది. అప్పుడూ వివిధ రాజకీయ పార్టీల పొత్తుల నేపథ్యంతోనే తక్కువ ఓట్లతో బయటపడింది. విశాఖ లోక్‌సభ సీటు టీడీపీకి ఎప్పుడూ అనుకూల సీటు కాదని స్వయంగా ఆ పార్టీ నేతలే అంగీకరిస్తారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రమంతటా అనుకూల ప్రభావం ఉండడం, ఎంపీ సీట్లన్నింటినీ గెలుస్తుందని జాతీయ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ దశలో విశాఖ సీటు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపనుందని తెలిసి కూడా భరత్‌ను కనీసంగా పోటీకి లేకుండా చేయాలనేది చంద్రబాబు తంత్రమని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మరోసారి సీటు అడకుండా, లోకేష్‌తో ఏ విషయంలోనూ పోటీ లేకుండా చేయాలన్న ముందస్తు వ్యూహంతోనే భరత్‌కు వచ్చే టీడీపీ ఓట్లను గండి కొట్టడానికే టీడీపీ మనిషిగా ముద్రపడ్డ జేడీని జనసేన తరఫున రంగంలోకి దించారన్న అభిప్రాయాలు స్వయంగా ‘దేశం’ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. -
చిన్నల్లుడిదే పైచేయి
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో టికెట్ల యుద్ధం మొదలైంది. ఈ జాబితాలో బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్ కూడా చేరిపోయారు. ఈ హైడ్రామాలో చిన్నల్లుడిదే పైచేయి అయింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్, చిన్నల్లుడు, గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీభరత్ పోటీ పడుతూ వచ్చారు. లోకేష్‌ను తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు టికెట్ ఆశిస్తున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నేత, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతతో చంద్రబాబు.. మీరెవరూ ఆశలు పెట్టుకోకండి. లోకేష్‌ను పంపిస్తున్నాను.. గెలిపించి పంపండి అని సూచించారు. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో విశాఖ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న లోకేష్ తోడల్లుడు ఎం.శ్రీభరత్ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజులుగా అమరావతిలో మకాం వేశారు. రెండురోజుల కిందట చంద్రబాబును కలిసి తన టికెట్ గురించి ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు... లోకేష్ వస్తున్నప్పుడు నువ్వు ఎలా పోటీలో ఉంటావు? ఈసారికి వద్దు.. గంటా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయిస్తానని స్పష్టం చేశారు. దీనిపై భరత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నా వద్దని నిరాకరించి ఎంపీగా పోటీ చేసేందుకే తాను సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ కోసం తనను పక్కనపెట్టడాన్ని భరత్ జీర్ణించుకోలేక పోయారు. దీంతో బాలకృష్ణ రంగంలోకి దిగి బావ చంద్రబాబుతో చర్చలు జరిపారు. తొలుత చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. అవసరమైతే భరత్‌ను రాజమండ్రి ఎంపీగా పంపిస్తానని చెప్పగా ఈ ప్రతిపాదనను భరత్ వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. ఎలాగైనా తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, అవసరమైతే లోకేష్‌ను కూడా భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించుకోవచ్చని సూచించారు. అయితే ఇందుకు బాబు అంగీకరించలేదు. విశాఖ లోక్‌సభ, నార్త్, ఈస్ట్ (సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు) ఈ మూడూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించలేమని బాబు వాదించినప్పటికీ భరత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలిసింది. దీంతో బాలకృష్ణ మరోసారి చంద్రబాబుతో మాట్లాడి లోకేష్‌ను ఎక్కడికైనా పంపించొచ్చు.. భరత్‌కు విశాఖనే ఇవ్వాలని పట్టుబడినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు చివరికి లోకేష్‌ను మంగళగిరికి పంపడంతోపాటు శ్రీభరత్‌కే విశాఖ లోక్‌సభ టికెట్ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఎంపీ టికెట్ నాదే : భరత్ ‘‘లోకేష్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేసినా నేను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నా. ఇద్దరమూ అక్కడి నుంచి పోటీ చేసినా తప్పు లేదు. టికెట్ నాకే వస్తుందని అనుకుంటున్నా’’ అని భరత్ సాక్షి ప్రతినిధితో స్పష్టం చేశారు. -
మూలపొలంలో బాలకృష్ణ చిన్న కుమార్తె
సంక్రాంతి వేడుకలు జరుపుకొనేందుకు సినీహీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన భర్త శ్రీభరత్‌తో కలిసి ఎస్.మూలపొలంలోని అత్తవారింటికి మంగళవారం వ చ్చారు. శ్రీభరత్ మాజీ ఎంపీ గీతమ్స్ విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి (గోల్డ్‌స్పాట్ మూర్తి) ( కొడుకు కొడుకు), కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు (కూతురి కొడుకు)ల మనుమడు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో బాలకృష్ణ రాలేకపోయినట్టు మూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా మనుమడు శ్రీభరత్ దంపతులతో గడిపేందుకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఎస్. మూలపొలంలోని గోల్డ్‌స్పాట్ మూర్తి ఇంటికి మంగళవారం వచ్చారు. సాంబశివరావు స్థానికులతో కలసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. మూర్తి ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. తనకు ఏ విధమైన అధికారిక లాంఛనాలు వద్దని పోలీసు, రెవెన్యూ అధికారులను సాంబశివరావు పంపించి వేశారు.