డబ్బు ఖర్చు చేస్తేనే జనం వస్తారు
గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అని అడుగుతారు
నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను ఎంపీ అభ్యర్థయితే
డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఆ బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులే చూసుకుంటారు
అందుకే పార్లమెంట్ సీటు ఎంచుకున్నాను
ఓ ఇంటర్వ్యూలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రభుత్వం అతి పెద్ద గూండా! అది వైఎస్సార్ సీపీ అయినా.. టీడీపీ ప్రభుత్వమైనా అంతే..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విశాఖ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్. ఈయన నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు కూడా. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రభుత్వంతో పని చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ పోట్లాడలేరు. చేసిన పనులకు బిల్లు పెండింగులో ఉంటే కోర్టు కెళ్తే వస్తుందనుకుంటున్నారా? రాదు.. వెయ్యి కండిషన్లు పెడతారు. ఏదో లోపం వెతుక్కుంటూ పోతారు. అందుకే ప్రభుత్వాలపై నాకు నమ్మకం కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టే వారి దగ్గరకే ఎక్కువ మంది జనం చేరతారన్నారు.
‘ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలన్నా.. వారికి చేరువకావాలన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కార్యకర్తలు రాజకీయ నాయకుడి దగ్గరకు విద్య, వైద్య, ఆరోగ్య అవసరాల కోసం వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అంటూ వస్తారు. నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను’ అని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా పోటీ చేయాలని ఎంచుకున్నట్లు చెప్పారు. ఎంపీ అయితే డబ్బుల విషయంలో నేరుగా జోక్యం(డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్) ఉండదన్నారు. ఎంపీ అభ్యర్థయితే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదని, తన లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థులే అవన్నీ భరిస్తారని కుండబద్దలు కొట్టారు.
ఇప్పటికే శ్రీభరత్ ఎన్నికల ఖర్చుల విషయంలో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులపైనే భారాన్ని మోపారన్న విషయం తేటతెల్లమవుతోందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కోట్లకు అధిపతి అయిన శ్రీభరత్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యతను తమపైకి నెట్టేయడమేమిటని అసెంబ్లీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. మొత్తం మీద శ్రీభరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment