పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పేరిట ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం
10 ఎకరాల నుంచి 1,000 ఎకరాల పైన ప్రైవేటు పార్కుల అభివృద్ధి
కారు చౌకగా ఏపీఐఐసీ భూములు అప్పగించడంతో పాటు భారీ రాయితీలు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మొండి చెయ్యి
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులతో కేవలం 5 లక్షల ఉద్యోగాలే
ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు నిర్మాణం
పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ పార్కుల పాలసీ 4.0 విడుదల
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చేతిలో ఉన్న సుమారు 40,000 ఎకరాల విలువైన భూమిని అభివృద్ధి పేరిట తమకు కావాల్సిన ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. ఇంతకాలం ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమలకు అందిస్తుండగా, ఇప్పుడు పాలసీ పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. కనీసం 10 ఎకరాల నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు, 100 నుంచి 1,000 ఎకరాలపైన భారీ పారిశ్రామిక పార్కులను ప్రైవేటు రంగంలో నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రపదేశ్ ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ విడుదల చేసింది.
పూర్తిగా ప్రైవేటు భూముల్లో లేదా ప్రైవేటు – ప్రభుత్వ భూముల్లో, పూర్తిగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థలు పార్కులను అభివృద్ధి చేస్తే వారికి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సీడీతోపాటు వ్యవసాయ భూ బదాలియింపు చార్జీలు, లేఔట్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల్లో 100 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో 35 శాతం వరకు, మెగా పార్కుల్లో అయితే భూమిలో గరిష్టంగా 10 శాతం వరకు ఇతర అవసరాలు అంటే హోటల్స్, నివాస గృహాలు, సర్వీస్ అపార్టమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ వంటి నిర్మాణాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.
పారిశ్రామిక పార్కు నిర్మాణం దశలను బట్టి మొత్తం అయిదు దశల్లో ఈ రాయితీలను విడుదల చేయనుంది. కాగా.. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం సబ్సిడీలను 45 శాతం వరకు ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 35 శాతానికి తగ్గించింది. దీంతో పార్కుల నిర్మాణం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడంతో తమకు భూ కేటాయింపులు ఉండవని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పాలసీలో ముఖ్యాంశాలు
» వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 2024–29 కాలానికి పారిశ్రామిక పాలసీ 4.0 విడుదల. ఇందులో వాస్తవ రూపంలోకి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు.
» ఈ ఐదేళ్లలో రూ.83,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి.
» తొలిసారిగా పీఎల్‌ఐ సబ్సిడీ, ఎంప్లాయిమెంట్ సబ్సిడీ, డీ–కార్బనైజేషన్ సబ్సిడీలు. మొత్తం పెట్టుబడిలో సబ్సీడీలు 75 శాతానికి పరిమితం.
» పాలసీ ఐదేళ్ల గడువును మరింత పెంచే అవకాశం. సవరణలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.
» కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో పాటు ఇప్పటికే పెట్టుబడులు పెట్టి.. కొత్తగా విస్తరణ చేపట్టే వారికి ఈ పాలసీ వర్తిస్తుంపు.
» 2023–27 పాలసీ కింద అనుమతులు పొందిన వారికి పాలసీ కాల పరిమితి తీరే వరకు రాయితీల వర్తింపు.
» రూ.50,000 కోట్ల పెట్టుబడి.. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పాలసీ 4.0.
వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలివి..
» గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సాధించిన విజయాలను పారిశ్రామిక పాలసీలో ప్రముఖంగా పేర్కొన్నారు.
» లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్) 2023లో కోస్తా తీర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎచీవర్స్ స్థానంలో నిలిచింది.
» నీతీ ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం ఎగుమతుల సన్నద్ధతలో రాష్ట్రం 8వ స్థానానికి ఎగబాకింది.
» దేశ వ్యాప్తంగా టాప్ 100 ఎగుమతి జిల్లాల్లో 8 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి.
» ఇందులో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.
» నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2023–24 నివేదిక ప్రకారం రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. అందుబాటు ధరలో విద్యుత్ సరఫరాలో మొదటి స్థానం, నీటి లభ్యతలో రెండవ స్థానంలో నిలిచింది.
» ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ 2023 ప్రకారం రాష్ట్రం ఏడవ స్థానంలో నిలిచింది.
రాష్ట్ర ఎగుమతులు రూ.16,600 కోట్లేనట!
» ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.16,600 కోట్లని, వీటిని 2028–29 ఆర్థిక సంవత్సరానికి రూ.33,200 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ పాలసీలో పేర్కొనడం పట్ల అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.66 లక్షల కోట్లుగా ఉంటే వాటని కేవలం 16,600 కోట్లుగా పేర్కొనడం గమనార్హం.
» భారీగా పెట్టుబడులను చూపించాలన్న తాపత్రయంలో వాస్తవాలను వదిలివేశారు. ఒకపక్క రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పుతున్నప్పుడు అంత తక్కువగా 5 లక్షల ఉద్యోగాలేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీ ప్రకారం రూ.7 కోట్ల పెట్టుబడికి ఒక్క ఉద్యోగం మాత్రమే వస్తుందా? అని అధికార వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment