
ఇది టూరిజం గవర్నమెంట్
ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర రాజధాని కోసం నాలుగు నుంచి ఐదువేల ఎకరాలుంటే సరిపోతుంది. అందుకు విరుద్ధంగా లక్ష ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం వివిధ దేశాల్లో చక్కర్లు కొడుతోంది. చివరకు ఇది టూరిజం గవర్నమెంట్‌గా మారిందని’ సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కే నారాయణ వ్యాఖ్యానించారు. మొదట్లో స్విట్జర్లాండ్ చుట్టూ తిరిగిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సింగపూర్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. సింగపూర్‌లో బహుళ అంతస్తులు ఉన్నాయని, వాటిలాగా నిర్మాణాలు చేపట్టాలంటే లక్ష ఎకరాలు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన ఫైర్ అయ్యారు. సీపీఐ జిల్లా శాఖ నూతన భవనాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర రాజధాని కోసం విదేశాలకు వెళుతున్నారంటే పాలకుల దృష్టిలో భారతదేశం అంత పనికిమాలినదా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి ఒంగోలులో నిర్మించిన సీపీఐ భవనాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబుకు నారాయణ హితవు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరైనా హామీలిస్తారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు ప్రయత్నిస్తారని, చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో హామీల వర్షం కురిపిస్తున్నారని, ప్రకాశం జిల్లాను మాత్రం మొదటి నుండి చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చే హామీల్లో సగం నెరవేర్చినా ఇక సమస్యలు ఉండవని ఉప ముఖ్యమంత్రి నారాయణ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతు రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఉపన్యాసాల గారడీలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నా వాటి గురించి ప్రస్తావించడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు మూడులక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టినా, పదిలక్షల కోట్లు బొగ్గు కుంభకోణం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వామపక్షపార్టీలు మినహా మిగిలినవన్నీ బూర్జువా విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. ఎర్ర జెండాలు ఏకమై పోరాడితే తప్ప సమాజానికి విముక్తి ఉండదన్నారు.
సీఎం బ్లాక్‌కు రూ.25 కోట్లు అవసరమా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
లోటు బడ్జెట్‌తో రాష్ట్రం దివాళా తీసిందని శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాత్కాలిక బ్లాక్‌కు రూ.25 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం రూ.52 వేల కోట్లు, ఖర్చులు రూ.62 వేల కోట్ల కింద చూపించి, రూ.10 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షా 11 వేల 824 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
రాష్ట్రంలో 13 జిల్లాలుంటే 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే 8 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. చంద్రబాబు మార్కెట్‌లో పూలుకొని ప్రజల చెవుల్లో పెడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల చేతనే పూలుకొనిచ్చి వారి చెవుల్లోనే పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ పండుగ కవితమ్మ పండుగగా మారిందన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందన్నారు.
రాష్ట్రంలోని 10 వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గసభ్యులు పీజే చంద్రశేఖరరావు, రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రవీంద్రనాధ్, సినీనటుడు మాదాల రవి, సినీ సంగీత దర్శకుల సంఘం కార్యదర్శి మద్దినేని రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్యతోపాటు వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు.
అలరించిన వందేమాతరం పాటలు:
సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో అంటూ ఆలపించిన గీతాలు హోరెత్తించాయి. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు, సభకు ముందు నిర్వహించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకు చెందిన కడియాల రంగయ్య లెనిన్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జెండాను సీపీఐ రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నూతన భవనాన్ని నారాయణ, ప్రజాసంఘాల సముదాయాన్ని మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి అంజయ్య హాలును రామకృష్ణ ప్రారంభించారు.