కేంద్రం నేరగాళ్ళను ఆదుకుంటోంది
కేంద్రం నేరగాళ్ళను ఆదుకుంటోంది
Published Fri, Jun 9 2017 2:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
రైతులను దేశద్రోహులుగా బావిస్తున్న మోదీ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మదనపల్లె : దేశంలో ఆర్థిక నేరగాళ్ళను ఆదుకొంటూ, దేశానికి వెన్నెముక లాంటి రైతన్నలను కేంద్రం దేశ ద్రోహులుగా చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సాంఘిక సంక్షోభాన్ని సృష్టిస్తూ ఆర్థిక నేరగాళ్ళకు ప్రోత్సాహానివ్వడం విడ్డూరంగా వుందన్నారు. రూ.9 వేల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను కేంద్రం పట్టించుకోకపోవడమే నిదర్శనమన్నారు.
కేవలం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ అమెరికన్ రంగ సంస్థలకు పెట్టుబడులు పెడుతూ సామాన్య ప్రజానీక సమస్యలను పట్టించుకోకపోవడం దారణమైన విషయమన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ సంస్థలను పూర్తిగా నీరుగారుస్తున్నాయన్నారు. ఆర్థిక నేరగాళ్ళను ముద్దుబిడ్డలుగా చూస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అంతేకాకుండా కొన్ని పార్టీలను రెచ్చగొడుతూ మోదీ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
ప్రపంచంలోనే భారతదేశం ఎగుమతులు అధికంగా వున్న భారతదేశాన్ని అభివృద్ది పర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ఇటీవల గోవధ నిషేధంపై కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నిజంగా దేశంలో గో నిషేధం అమలు చేస్తే పశువులకు కూడా ఓల్డేజ్ హోంలు ఏమైనా పెడతారా..? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. గోవధ నిషేధం పేరుతో హందూత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మోదీకి తగదన్నారు. ఈసమావేశంలో సీపీఐ ఏరియాకార్యదర్శి క్రిష్ణప్ప, పట్టణ కార్యదర్శి సాంబశివలు పాల్గొన్నారు.
Advertisement