పోరాడుదాం..సాధిద్దాం | CPI National Secretary K Narayana talk about Walter Balasala Bridge | Sakshi
Sakshi News home page

పోరాడుదాం..సాధిద్దాం

Published Mon, Jun 12 2017 8:20 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

పోరాడుదాం..సాధిద్దాం - Sakshi

పోరాడుదాం..సాధిద్దాం

► సీఎం గెడ్డం ఊడేలా దీక్షలు చేయాలి
► ముగ్గురు మూర్ఖులు వంతెనను అడ్డుకుంటున్నారు
► అవసరమైతే అమరావతికి పాదయాత్ర చేద్దాం
► దీక్షాధారులకు భరోసా ఇచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
► వాల్తేరు బలసలరేవు వంతెన దీక్షలకు మద్దతు  


రాజాం/సంతకవిటి: వాల్తేరు బలసలరేవు వంతెనను పోరాట మార్గం ద్వారానే సాధించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు సాధారణంగా ఏ ప్రజా పోరాటాన్నీ పట్టించుకోరని, ఆయన గెడ్డం ఊడేలా దీక్షలు, పోరాటాలు చేస్తే మేల్కొంటారని అ న్నారు. ఆయన ఆదివారం సంతకవిటి మండలంలోని వా ల్తేరు గ్రామంలో బలసలరేవు వంతెన నిర్మాణం కోసం స్థానికులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా శిబిరంలో కూర్చున్నారు.

ముందుగా బలసలరేవు వద్దకు చేరుకుని వంతెన నిర్మించాల్సిన నాగావళి నదీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ పోరాటాలకు పురిటి గడ్డ శ్రీకాకుళం అని అన్నారు. గత 113 రోజులుగా వంతెన నిర్మాణం కోసం దీక్ష చేయడం హర్షించదగిన విషయమని అన్నారు. ఇంత పోరాట దీక్ష ఉన్న ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టడం పెద్ద పని కాదని, ఈ ప్రాంత ప్రజలంతా ఐక్యంగా వ్యవహరించి వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్న ముగ్గురు మూర్ఖులకు బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు.

ఎందుకు అడ్డుకుంటున్నారు?
వంతెన నిర్మాణానికి ఆవలి వైపున ఉన్న ఓ శాసన సభ్యుడు, వంతెన నిర్మించాలి్సన ప్రాంతానికి కూతవేటులో ఈ గ్రామం పక్కనే ఉన్న అధికార పార్టీకి చెందిన మాజీ స్పీకర్‌తో పాటు మరో నేత వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముందుగా వీరు వంతెన నిర్మాణం ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న సమయంలో వంతెన నిర్మించకుంటే మరెప్పుడూ ఈ నిర్మాణాలు జరుగవని అన్నారు. వంతెన నిర్మాణాలను అడ్డుకుంటున్న ఈ ముగ్గురు నేతలను ఊళ్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలని, వీరు భయపడి చంద్రబాబునాయుడు వద్ద తమ గోడు వెళ్లబోసుకునేలా చేయాలని సూచించారు.

అపరాధ రుసుం చాలు..!
ప్రపంచం చెప్పుకునేలా అమరావతి నిర్మిస్తామని పేర్కొంటున్న చంద్రబాబు ఈ వంతెన నిర్మాణానికి ఎందుకు చొరవ చూపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒక ఇసుక మాఫియాను ఒక రోజు అడ్డుకుంటే ఆ వచ్చే అపరాధ రుసుంతో వంతెన కట్టేయవచ్చని అన్నారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తులో భూదందాలు జరుగుతున్నాయని,  ఆ భూదందాలను ఒక్క రోజు ఆపితే ఎన్నో వంతెనలు కట్టేయవచ్చునని అన్నారు. వంతెన దీక్షకు దిగిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెన రిలే దీక్షలు ఆపరాదని కోరారు. అవసరమైతే అమరావతి వరకూ పాదయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. వంతెన కోసం మనం చావడం కాదని, ‘అధికారులు, పాలకులు చస్తారా.. వంతెన నిర్మిస్తారా’ అన్న రీతిలో దీక్షలు ఉండాలని పేర్కొన్నారు. వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతంలో రహదారి సౌలభ్యం ఉంటుందని, రహదారి బాగుంటే సంస్కృతిలో మార్పు వస్తుందని అన్నారు.

అందరం ఒక్కటై..
ఈ సమావేశంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు విమలకుమారి మాట్లాడుతూ అరెస్టులకైనా సిద్ధంగా ఉండి వంతెన నిర్మాణాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. అమరావతిలో అందరం ఒక్కటిగా గొంతెత్తుదామని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ వంతెన నిర్మాణాన్ని పక్కనే ఉన్న అధికార పార్టీ నేత అడ్డుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ వంతెనకు మట్టి పనికిరాదని చెప్పుకొస్తున్నారని, 1999లో ఎలా జీఓ విడుదల చేసి, నిధులు కేటాయించారని ప్రశ్నించారు.

సీపీఐ జిల్లా నేత చాపర సుందరలాల్‌ మాట్లాడుతూ పలుమార్లు ర్యాలీలు, దీక్షలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అప్పలఅగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధికార ప్రతినిధి దవళ నర్సింహమూర్తి మాట్లాడుతూ గత 113 రోజులుగా వంతెన దీక్షలు చేపడుతుంటే అధికార పార్టీ నేతలకు పట్టకపోవడం శోచనీయమని అన్నారు. రాజాం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు నెలరోజుల కిందట అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తే ఆ కోణంలో కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సమస్యను విన్నవిస్తే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అధికార పార్టీ దిగొచ్చే వరకూ వాల్తేరు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ పోరాటంలో వెనక్కు తగ్గకుండా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వంతెన సాధన కమిటీ కన్వీనర్‌ గురుగుబెల్లి నారాయణస్వామి, కో కన్వీనర్‌ గుడ్ల అప్పారావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ గురుగుబెల్లి స్వామినాయుడు, వాల్తేరు, జీఎన్‌పురం, పనసపేట, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, కావలి తదితర గ్రామాలుకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement