డీసీసీబీలో ఇష్టారాజ్యం
- వివాదాస్పదమైన రూ.కోటి విరాళం
- వినాయక ఆలయ నిర్మాణంపైన కోటి విమర్శలు
చిత్తూరు(అగ్రికల్చర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లోని అధికారు లు, పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వ డం, డీసీసీబీ ఆవరణలో వినాయకస్వామి ఆలయ నిర్మాణం తదితర కీలక నిర్ణయాలు ముందస్తు అనుమతి లేకుండానే జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో పాలకవర్గంలోని ప్రముఖ వ్యక్తి కీలకపాత్ర పోషించారు. సాధారణంగా సహకార శాఖలో ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా, ఇందుకు సంబంధించి పైసా నిధులు విడుదల చేయాలన్నా పాలకవర్గ సభ్యుల అనుమతి తప్పని సరి.
అయితే డీసీసీబీలో మాత్రం ఇలాంటివి ఏమీ అమలుకావడం లేదు. పాలకవర్గంలోని ఓ ప్ర ముఖ వ్యక్తి కనుసన్నల్లోనే అన్ని పనులు జరుగుతా యి. ఈ విషయంగా పాలకవర్గంలోని పలువురు స భ్యులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నా రు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ సహకారంతో డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వ్యక్తికి, ఆ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో చైర్మన్ వ్యవహారాన్ని ప్రశ్నించలేక సభ్యులు లోలోన కుమిలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వివాదాస్పదమైన రూ.కోటి విరాళం
పాలక వర్గ చైర్మన్ గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి రాజధాని నిర్మాణం కోసం రూ. కోటి చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇంత మొత్తం పాలకవర్గ తీర్మా నం ఆమోదించకనే విరాళంగా ఇవ్వడాన్ని సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కేవలం తాను చైర్మన్ అయ్యేందుకు గతంలో సహకరించారని, అందుకు ప్రతిఫలంగానే రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చారని పాలవవర్గంలోని ఓ సభ్యుడు ‘సాక్షి’తో వాపోయారు. రెండు రోజుల క్రితం డీసీసీబీ పాలకమండలి సమావేశంలో ఈ విషయమై పాలకమండలి ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆలయ నిర్మాణంలో...
డీసీసీబీ ఆవరణలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వినాయక స్వామి దేవాలయంపై కూడా విమర్శలు గుప్పుమంటున్నాయి. కార్యాలయానికి వాస్తు దోష నివారణకు వినాయకస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దీనిపై కూడా పాలకవర్గ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. వీధిపోటుకు చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సరిపోయేది కదా, ఏకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి గుడి నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలావుండగా ఆలయ నిర్మాణానికి సింగిల్‌విండోల నుంచి అనధికారికంగా పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించడంపై కూడా సభ్యులు నిలదీసినట్లు తెలిసింది.
నూతన భవన నిర్మాణంలోనూ...
ప్రస్తుతం డీసీసీబీ ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సరిపడా భవన సదుపాయం ఉన్నప్పటికీ, రూ.కోటి నిధులు వెచ్చించి నూతనంగా మరో భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి ఆప్కాబ్ నుంచి కొంత మేరకు సబ్సిడీ కింద నిధులు వచ్చాయని, అందుకు సంబంధించిన లెక్కలు తెలపడంలేదని సభ్యులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సివుంది.
చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే...
రాజధాని నిర్మాణానికి రూ.కోటి ఇవ్వడంపై పాలకమండలి సభ్యులతో ముందే సంప్రదించాను. అయితే విరాళం చెక్కు ఇచ్చిన తరువాత సభ్యుల నుంచి ఆమోదం తీసుకున్నాను. వినాయకస్వామి ఆలయం నిర్మాణానికి నా సొంత నిధులు, కొందరు ఉద్యోగుల విరాళాలతో నిర్మించాం. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి 8 నెలల క్రితమే సభ్యుల ఆమోదం పొంది టెండర్లు నిర్వహించాం.