కంచే చేను మేసె!
* మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ఉన్నతాధికారుల భూ దందా
* వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల స్వాహా
* ఐఏఎస్ అధికారి పాత్రపైనే అనుమానాలు
* బినామీ పేర్లతో 30 ఎకరాలు స్వాధీనం
* తక్షణ నివేదికకు నెల కిందటే ఆదేశించిన సీఎం
* జిల్లా యంత్రాంగం బేఖాతర్.. సర్కారు ఆగ్రహం
* పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లోనూ స్కాం
* భూములను ఆక్రమించుకున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం
* రాష్ర్ట ప్రభుత్వం వద్ద ఆధారాలు, దృష్టి సారించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది! సర్కారు భూములను కాపాడాల్సిన అధికారులే వాటిని మింగేశారు. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని ఎకరాలకొద్దీ భూములు అన్యాక్రాంతమైనట్లు రాష్ర్ట ప్రభుత్వానికి ఇటీవలే నిర్దిష్ట సమాచారం అందినట్లు సమాచారం. అసైన్డ్ భూములతో పాటు ఇతర అవసరాల కోసం కేటాయించిన భూములను కూడా ఉన్నతాధికారులే స్వాహా చేసినట్టు సర్కారు ప్రాథమికంగా గుర్తించింది.
మెదక్ జిల్లా పరిధిలోని రామచంద్రాపురం, పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో జరిగిన ఈ కుంభకోణంలో జిల్లా స్థాయిలో భూముల వ్యవహారాలపై పూర్తి అధికారాలున్న ఓ ఐఏఎస్ అధికారి కీలకపాత్ర పోషించినట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై విచారణ జరిపి, తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ నెల రోజుల కిందటే మెదక్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు ఐదో తేదీనే తక్షణ నివేదిక కోరినప్పటికీ జిల్లా యంత్రాంగం ఇప్పటికీ పట్టించుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఉన్నతాధికారిదే కీలక పాత్ర!
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు పరిధిలోని 106, 191, 203, 297 సర్వే నంబర్లలోని భూములను వేర్వేరు అవసరాల కోసం ప్రభుత్వం గతంలో చాలా మందికి అసైన్డ్ చేసింది. ఇలా చేయగా కూడా మరికొన్ని ఎకరాల భూమి ఇక్కడ మిగిలే ఉంది. అయితే ఈ భూములను గతంలో పేర్కొన్న అవసరాలకు కాకుండా ఇతరత్రాలకు వినియోగించడం, అసైన్డ్ భూములపై క్రయవిక్రయాలు జరపడం, ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు తాజాగా రాష్ర్ట ప్రభుత్వం గుర్తించింది.
దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఆ జిల్లాలోని ఓ ఐఏఎస్ అధికారి ముఖ్య పాత్ర పోషించినట్లు భావిస్తోంది. ఇక్కడి భూముల్లో దాదాపు 30 ఎకరాలను ఆయన బినామీ పేర్లతో ఆక్రమించినట్టు అనుమానిస్తోంది. ఇక్కడ ఎకరానికి సుమారు రూ. 3 నుండి రూ. 6 కోట్లదాకా ధర ఉంది. దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపాలని... సూత్రధారులను, పాత్రధారులను గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి వెంటనే నివేదిక ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఆదేశాలు పంపారు.
ఈ మేరకు గత నెల ఐదో తేదీన 3062 మెమో ద్వారా ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఇప్పటికి నెల రోజులవుతున్నా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో ఇప్పటి దాకా జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారి పాత్రపై వచ్చిన అనుమానాలు మరింత బలపడ్డాయి. సీఎం కేసీఆర్ కూడా ఈ అంశాన్ని మరోసారి గుర్తుచేయడంతో రెవెన్యూ శాఖ తన ఉత్తర్వులను కలెక్టర్‌కు మరోసారి రిమైండర్‌గా పంపడానికి సిద్ధమైంది.
మరో 2 మండలాల్లోనూ
అదే జిల్లా పటాన్‌చెరు(అమీన్‌పూర్), జిన్నారం మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వం భూమి అన్యాక్రాంతమైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మండలాల్లో అసైన్డ్, శిఖం, లావణి పట్టాలు జారీ అయిన వందల ఎకరాల భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లడంలో జిల్లాకు చెందిన వివిధ స్థాయిల్లోని రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 22(ఎ) కింద ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్, నోటిఫై, డీనోటిఫై చేయడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ భూ దందాకు దిగినట్టు అనుమానిస్తున్నారు.
మండల, డివిజన్ స్థాయి ఉన్నతాధికారులను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ భూముల బదలాయింపును రద్దుచేస్తున్నట్టుగా జిల్లా అధికారులు నోటిఫై చేస్తారు. దీంతో ఆ భూములను కొనడానికి ఎవరూ ముందుకురాక ధర తగ్గిపోతుంది. వాటిని తక్కువ ధరకు రెవెన్యూ అధికారులే బినామీ పేరిట కొంటారు. ఆ తర్వాత డీనోటిఫై చేసుకుని, అవే భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని వ్యాపారం చేసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు.