సర్కారీ భూములమ్మి రుణాల మాఫీ?
-
రుణాల రీ షెడ్యూల్‌కు మరోసారి ఆర్‌బీఐ వద్దకు
-
నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలపై కసరత్తు
-
రుణమాఫీ ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి కావలసిన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రూ.15 వేల కోట్లకుపైగా సేకరించాల్సి రావడంతో అధికార యంత్రాంగం భూములు విక్రయించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న, కబ్జాఅయిన భూములను విక్రయించడం వల్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడంతోపాటు, బాండ్లు, సెక్యూరిటీల విక్రయం ద్వారా నిధులు తెచ్చుకోవడంపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రణాళిక నిధులను అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది. అలాగే, రిజర్వ్‌బ్యాంకు ప్రస్తుతం అంగీకరించిన వంద మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను, అన్ని మండలాలకు వర్తింప చేయడంతోపాటు, ఖరీఫ్ రుణాలకే కాకుండా ఇతర రుణాలకు వర్తింప చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయనుంది. సోమవారం జరిగిన మంత్రి మండలి అత్యవసర భేటీలోనూ...రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీని అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు అభిప్రాయపడ్డారు. అవసరమైతే రుణాలు తెచ్చుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ను మరోసారి కలవాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని మంత్రిమండలి ఆదేశించిన సంగతి విదితమే.
రుణమాఫీపై సంతకం చేసిన ముఖ్యమంత్రి
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రుణ మాఫీ ఫైలుపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ నేడోరేపో రుణమాఫీతోపాటు, మార్గదర్శకాలు జారీ చేయనుంది. రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.