సాగుకు నీరు.. రైతుకు బతుకు | Kcr meet on agriculture | Sakshi
Sakshi News home page

సాగుకు నీరు.. రైతుకు బతుకు

Published Sat, Jul 1 2017 2:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగుకు నీరు.. రైతుకు బతుకు - Sakshi

సాగుకు నీరు.. రైతుకు బతుకు

ఇదే ప్రభుత్వ ప్రాథమిక విధి
సీఎం కేసీఆర్‌ వెల్లడి
సాగునీటికి చేసే ఖర్చు నిరర్ధకం కాదు

- ఎస్సారెస్పీ కాల్వలకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే రూ.8 వేల కోట్ల పంట పండింది
- ప్రాజెక్టుల వ్యయం కన్నా రైతులకు సమకూరే ఆదాయం చాలా ఎక్కువ
- వచ్చే ఖరీఫ్‌కు పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలి
- కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ కాల్వలు సిద్ధం చేయాలి
- ఎమ్మెల్యేలు పనులను పర్యవేక్షించాలి సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులు సాగు చేసే పంటలకు నీరందించడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. సాగునీటి కోసం చేసే ఖర్చు ఎన్నటికీ నిరర్ధకం కాదని స్పష్టంచేశారు. ‘‘సాగునీటి కోసం పెట్టే ఖర్చు నిరర్ధకమైనదన్న తప్పుడు అవగాహన కొంత మంది ఆర్థికవేత్తలు, పరిపాలకుల్లో కూడా ఉంది. కానీ అది తప్పు. గతేడాది ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశాం. దానివల్ల 9 లక్షల ఎకరాల్లో పంట పండింది. దీని విలువ రూ.8,370 కోట్లు. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే రూ.8 వేల కోట్ల పంట పండింది. కాబట్టి నీటి పారుదల వసతుల కోసం పెట్టే ఖర్చు నిరర్ధకం కాదు. ప్రాజెక్టుల కోసం పెట్టే వ్యయం కన్నా.. రైతులకు సమకూరే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికి మించి రైతులకు సాగునీరు అందించడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి’’అని సీఎం పేర్కొన్నారు.

శుక్రవారం నీటి పారుదల శాఖపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌ రావు, రామకృష్ణా రావు, బీఆర్‌ మీనా, కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్‌ నాటికి 10 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గతేడాది పాలమూరు ప్రాజెక్టుల కింద సగం ఆయకట్టు వరకు నీరు ఇవ్వగలిగామని, వచ్చే ఖరీఫ్‌ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందించేలా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇందుకు ఎండాకాలమంతా రేయింబవళ్లు పనిచేయాలని, నీటి పారుదల శాఖకు ఇతర శాఖలు కూడా సహకారం అందించాలని విన్నవించారు.

కాళేశ్వరం నీటిని కాల్వలకు మళ్లించాల్సిందే..
దిగువ మానేరు డ్యామ్‌ కింద ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ‘‘గోదావరి నీటిని మన వాటా ప్రకారం వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మేడిగడ్డ నుంచి నీటిని తోడడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాల్వల నిర్మాణం కూడా పూర్తవుతుంది. పెద్దఎత్తున నీరు అందుబాటులోకి వస్తుంది. ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు తదితర రిజర్వాయర్లలో 140 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. వీటి ద్వారా పాత కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో రెండు పంటలు పండించాలి. అందుకు పంట పొలాలకు, చెరువులకు నీరందించేందుకు ఎస్సారెస్పీ కాల్వలను సిద్ధం చేసుకోవాలి.

ఎల్‌ఎండీ నుంచి అటు భూపాలపల్లి, ఇటు డోర్నకల్‌ నియోజకవర్గాల చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా కాల్వల వ్యవస్థను పునరుద్ధరించాలి. కొన్ని కాల్వలను మరమ్మతు చేయాలి. మరికొన్నింటిని కొత్తగా నిర్మించాలి. ఒక్క పాత వరంగల్‌ జిల్లాలోనే ఎస్సారెస్పీ ద్వారా పది లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరివ్వాలి. చెరువులు నింపాలి. ప్రధాన కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 7 వేల క్యూసెక్కులు ఉండేలా పటిష్టపరచుకోవాలి. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని పనులను పర్యవేక్షించాలి. రైతులకు సాగునీరు అందివ్వడాన్ని అత్యంత ముఖ్యమైన విధిగా భావించాలి. నీటిపారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పడు సమన్వయంతో పనిచేయాలి’’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నిధులు ఆగొద్దు..
సాగునీటి వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడ్జెట్లో ఇప్పటికే ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆర్థిక సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అటు నీటి లభ్యత, ఇటు నిధుల లభ్యత ఉందని, దీన్ని సదవకాశంగా తీసుకుని పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement