తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి– రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుందని ప్రకటించారు. లాభాపేక్ష లేని సంస్థ (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్) లాగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుందని, ఈ సంస్థకు సమకూరిన నిధులను సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని స్పష్టం చేశారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని వెల్లడించారు. రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలను నిర్ణయించడంతోపాటు ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ సదస్సులపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ప్రతీ దశలోనూ చురుకైన పాత్ర..
విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతుధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషించేలా వారికి విధులు, బాధ్యతలుంటాయని సీఎం స్పష్టం చేశారు. సమితుల్లో కనీసం 51 శాతం మంది బలహీన వర్గాలు, మహిళల ప్రాతినిథ్యం ఉండేలా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే సదస్సుల్లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులతోపాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు హాజరు కావాలన్నారు. రైతులు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకోవడానికి, నిరంతర అవగాహనా సదస్సులు నిర్వహించడానికి ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,630 రైతు వేదికలు నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
మండల సమితులకు నిర్మహణ బాధ్యత..
రైతు వేదికల నిర్వహణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ భూముల నుంచిగానీ, దాతల నుంచిగానీ, కొనుగోలు ద్వారాగానీ స్థలం సేకరించాలని చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment