వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్తు
తెలంగాణలో విద్యుత్తు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. ఇందుకోసం ముందుగా దాదాపు రెండున్నర లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్తు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ సంస్థతో సంప్రదింపులు జరపగా, వాళ్లు కూడా అంగీకరించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం పలు విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ విధానం, భవిష్యత్తు వ్యూహాలపై చర్చ జరిగింది.
నవంబర్ 1 నుంచి జనవరి 25 వరకు ఓటరు జాబితా సవరణ ఉంటుందని అంటున్నారు. మార్చి నుంచి ఎమ్మెల్యేలకు కోటిన్నర చొప్పున నిధులు కేటాయిస్తారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోరిక మేరకు అధికారుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిపై చాలా కాలంగా డిమాండు ఉంది. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక పార్టీ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త వ్యూహంతో పార్టీ ముందుకెళ్లాలని కేసీఆర్ చెప్పారు. విద్యుత్తు విషయమై ప్రతిపక్షాలు గట్టిగా నిలదీసే అవకాశం ఉందని, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.