ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడి పథకానికి అవసరమైన నిధుల సమీకరణకు కేంద్ర సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఏప్రిల్ తొలి వారంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకునేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు.
ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రతి సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. మేలోనే ఈ డబ్బులు పంపిణీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. లక్షలాది మంది రైతులకు సాయమందించే పథకం కావటంతో భారీగా నిధులు అవసరమని ప్రభుత్వం లెక్కలేసింది. సాగు భూముల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. ఇందుకు మేలోనే రూ.5,680 కోట్లు కావాలని తేల్చింది. ఇంత భారీగా నిధులు సమకూర్చటం కష్టతరమేనని ఆర్థిక శాఖ అప్రమత్తమైంది.
రూ.4 వేల కోట్లకు పైగా అప్పు తప్పదు!
రెవెన్యూ రాబడి ఆశించిన మేరకు ఉన్నప్పటికీ తొలి రెండు నెలల్లోనే ఇంత భారీ మొత్తం పోగయ్యే అవకాశం లేదు. దాంతో మేలో పెట్టుబడి సాయానికి సరిపడే నిధులు కూడబెట్టడం ప్రభుత్వానికి కత్తి మీద సామే. ఉద్యోగుల జీతభత్యాలు, ఆసరా పింఛన్లుఇతర నెలవారీ ఖర్చులన్నీ పోను రూ.1,000 కోట్లకు మించి మిగిలే అవకాశం లేదని అంచనా. పెట్టుబడి సాయానికి అవసరమైన మిగతా రూ.4 వేల కోట్లకు పైగా నిధుల కోసం అప్పు తప్పదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
ఆ దిశగా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది. పెట్టుబడి సాయానికి కావాల్సిన నిధులను ఏప్రిల్‌లోనే అప్పుగా తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి ఏటా ఆర్‌బీఐ అధ్వర్యంలో బాండ్లను వేలం వేసి రుణాలు తీసుకునే అవకాశముంటుంది. వచ్చే ఏడాది తెలంగాణ దాదాపు రూ.28 వేల కోట్లు అప్పుగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఏడాదిని నాలుగు త్రైమాసికాలుగా విభజించి, అవసరం మేరకే అప్పు తీసుకోవాలని నిర్దిష్టమైన నిబంధనలున్నాయి.
ఆ లెక్కన తొలి త్రైమాసికంలో దాదాపు రూ.7 వేల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటుంది. కానీ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం తొలి త్రైమాసికానికి సంబంధించిన అప్పును మే, జూన్ నెలల్లో తీసుకోవాలి. ప్రతిష్టాత్మకమైన పథకానికి నిధులు అత్యవసరమైనందున ఈ అప్పును ఒక నెల ముందే ఇప్పించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం అనుమతిస్తే ఆర్‌బీఐని ఆశ్రయించి సెక్యూరిటీల వేలం ద్వారా తగినంత అప్పు తీసుకునే వీలుంటుంది.
చెక్కులు, నగదు కొరత ఇబ్బందే?
పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి దాదాపు 78 లక్షల చెక్కులు అవసరమవుతాయని భావిస్తోంది. ఇన్ని చెక్కుల ముద్రణ, మేలో ఒక్కసారిగా రైతులకు పంపిణీ అయ్యే రూ.6 వేల కోట్ల నగదుకు బ్యాంకుల్లో ఇబ్బంది రాకుండా చూడాలని జైట్లీని సీఎం కోరనున్నట్లు తెలిసింది.
కాళేశ్వరానికి నాబార్డు రుణం
ఎన్నికల ఏడాదిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నాబార్డు రూ.10,000 కోట్ల దీర్ఘకాలిక రుణాలిచ్చేందుకు అంగీకరించింది. దీన్ని రుణ పరిమితి చట్టానికి లోబడి ఇస్తామని సూచించగా, దానికి సంబంధం లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణమివ్వాలని రాష్ట్రం కోరుతోంది. ఈ అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి సీఎం తీసుకెళ్లే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment