వ్యవసాయానికి రూ.35,984 కోట్లు
న్యూఢిల్లీ: అన్నదాతలకు ఆదాయ భద్రత కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీయిచ్చారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.35,984 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
ఆహారభద్రతకు వెన్నుముక రైతులే. వాళ్లకు ఆదాయ భద్రత కల్పిస్తాం. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది మా లక్ష్యం. 35,984 కోట్లు కేటాయిస్తున్నాం. ఉత్పాదకత పెంచడానికి నీటిపారుదల చాలా ముఖ్యం. 28.5 లక్షల హెక్టార్లకు అదనంగా నీటిపారుదల కల్పిస్తాం. వచ్చే ఏడాది దీనికి 17వేల కోట్లు కేటాయిస్తాం. ప్రత్యేకంగా నాబార్డులో రూ.20 వేల కోట్లతో నీటిపారుదల కోసం ఓ నిధి ఏర్పాటుచేస్తాం. గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా 5 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటుచేయిస్తాం. సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కోసం రూ.368 కోట్లు కేటాయిస్తున్నాం.
ఆర్గానిక్ ఉత్పత్తులు పెంచి వాటి ద్వారా ఎగుమతులు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలపై మరింత దృష్టి ఉంటుంది. ఈ-మార్కెట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయిస్తాం, అన్ని రాష్ట్రాలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. రైతు రుణాల మీద వడ్డీ చెల్లింపు కోసం రూ.15వేల కోట్లు కేటాయిస్తున్నాం. గ్రామీణ రహదారుల కోసం రూ. 19వేల కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రాల వాటాతో కలిపి రూ. 27 వేల కోట్లు అవుతుంది. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌ను త్వరలోనే కల్పిస్తాం. పశుగణాభివృద్ధి కోసం 4 కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తాం.