నాన్నకు ఫుల్ మార్క్స్ వేస్తా: జైట్లీ తనయ
న్యూఢిల్లీ: తన తండ్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కు పూర్తి మార్కులు వేస్తానని ఆయన తనయ సోనాలి అన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందని జైట్లీ అల్లుడు వ్యాఖ్యానించారు. కేటాయింపులు పెంపుపై ప్రధానంగా దృష్టి సారించారని చెప్పారు.
జైట్లీ బడ్జెట్ పై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు. జైట్లీ పరీక్ష పాసయ్యారని, ప్రతి ఒక్కరికి ఎంతోకొంత కేటాయించారని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలుపైగా కేటాయించడం బడ్జెట్ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది చరిత్రాత్మకమని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని, దేశాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పెదవి విరిచింది. బడ్జెట్ లో ఏం చేయాల్సిన అవసరముందో అది చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ విమర్శించారు. కుంగుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బడ్జెట్ లేదని, అలంకారప్రాయంగా ఉందని మనీష్ తివారి దుయ్యబట్టారు.