కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి శుభవార్త
న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వం కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్ కు 8.33 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నెలవారీ జీతం రూ. 15 వేల లోపు ఉన్నవారి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆథార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు ఉంటాయని, ఈ ఏడాది ముద్ర కింద 1.8లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. బ్యాంకుల పునరుద్ధరణకు 25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8.33 శాతం ఉంటుందన్నారు. చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి 500 కోట్లు, ఉపాధి హామీ పథకానికి 38వేల 500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం 3వేల కోట్లు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి 150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ ఇస్తామన్నారు.
2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు.
మిగతా రంగాల గురించి ఆయన ఏమన్నారంటే...
ఉన్నత విద్య
ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలన్నది మా ఉద్దేశం. 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలను ఈ స్థాయికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటుచేస్తాం. అగ్రశ్రేణి సంస్థలలో సదుపాయాలకు ఇవి ఉపయోగపడతాయి. మార్కుల షీట్లు, టీసీలన్నింటినీ సులభంగా తీసుకోడానికి వీలుగా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటుచేస్తున్నాం.
చిన్నదుకాణాలకు ఊతం
రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. షాపింగ్ మాల్స్ వారంలో ఏడు రోజులూ తెరిచి ఉంటున్నాయి. అందుకే చిన్న దుకాణాలనూ అలా తెరిచేందుకు అనుమతిస్తున్నాం. వాటిలో పనిచేసేవాళ్లకు వారంలో ఒకరోజు ఆఫ్ ఇవ్వాలి, పని గంటలు నియంత్రించాలి.