రాష్ట్రానికి శూన్యహస్తం
కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
సాక్షి, విజయవాడ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి శూన్యహస్తం అందించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ తెలిపారు. బందరురోడ్డులోని పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్ధసారథి కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థత స్పష్టంగా కనపడిందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై బడ్జెట్‌లో ఒక్కముక్క చెప్పలేదని, ఎందుకు ఇవ్వరో వివరించలేదని పేర్కొన్నారు. అయితే కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం ప్రత్యేకహోదాపై కేంద్రం ఇంకా ఆలోచిస్తోందని చెబుతున్నారని ఎద్దేవాచేశారు.
ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజ్‌ను సాధించడంలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి అసమర్థులని తేలిపోయిందన్నారు. రూ.32 వేల కోట్ల ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.100 కోట్లు, ఈ బడ్జెట్‌లో మరో రూ.100 కోట్లు ముష్టివేస్తే ఆ ప్రాజెక్టును ఎన్ని ఏళ్లలో పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
మరొకపక్క 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని సిగ్గుఎగ్గూ లేకుండా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమరావతిని ప్రపంచంలో ఎనిమిదో వింతగా చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, ఒక్క రూపాయి కూడా రాకుండా ఏవిధంగా చేస్తారని రమేష్ ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు విగ్రహాన్ని పెట్టి చేతకాని అసమర్ధ ముఖ్యమంత్రే ప్రపంచంలో 8వ వింతగా చెప్పాలని ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నా బడ్జెట్‌లో ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. ఇప్పటికే మూడు బడ్జెట్‌లు అయిపోయాయని, ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే ఉన్నాయని ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీసి అడగాలని సూచించారు.
లేదంటే చంద్రబాబు అఖిలపక్షం వస్తే ఆయన వెంట ఢిల్లీ వచ్చి నిధులు అడగడానికి తామంతా సిద్ధమని చెప్పారు. చంద్రబాబుకు రాష్ట్రానికి నిధులు రాబట్టి అభివృద్ధి చేయడంపై శ్రద్ధ లేదని, ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు పెట్టి కోనేందుకు మాత్రమ శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గట్టిగా ఏదైనా ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తోందనని, తమ కేంద్ర మంత్రుల పదవులు ఎక్కడ పోగోట్టుకోవాల్సి వస్తుందోనని, ఎంపీల సమావేశంలోనూ సామరస్యంగానే మాట్లాడండి అంటూ ఎంపీలకు సర్దిచెప్పారని విమర్శించారు.