కబ్జాదారులపై పీడీ యాక్ట్
* క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్న సీఎం కేసీఆర్
* సర్కారు భూముల్లోని నివాసాలు, నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోండి
* 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి, ఆ తర్వాత మిగిలిన భూములను స్వాధీనం చేసుకుంటాం
* ఇకపై ఆక్రమణలను సహించం, కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై ముందస్తు నిర్బంధ(పీడీ యాక్టు) చట్టాన్ని ప్రయోగించేందుకూ వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జూన్ 2కు ముందు ప్రభుత్వ భూముల్లో నివాసాలు, నిర్మాణాలు ఏర్పరచుకున్న వారు, వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్కారు భూముల్లోని పేదల నివాసాలతో పాటు ఇతర నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించే అంశంపై సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇకపై ఆక్రమణలకు తావులే కుండా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడానికే ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు. పేదలు నివాసమున్న 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని, అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. మిగతా వారి విషయంలో ఎంత విస్తీర్ణానికి ఎంత ధర చెల్లించాలో ఇప్పటికే నిర్ణయించినందున అలాంటి వాళ్లూ క్రమబద్ధీకరణ కు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఇకపై భూముల రిజిస్ట్రేషన్లన్నీ సక్రమంగా ఉండాలని, దీన్ని మొత్తంగా ప్రక్షాళన చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం వెల్లడించారు. గత నెల 31న క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాల తో ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జీవో వచ్చిన 20 రోజుల్లోగా అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు స్వీకరించాక 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను సీఎం ఆదేశించారు. ఇకపై రాష్ర్టంలో భూముల దురాక్రమణకు వీల్లేకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని కబ్జాదారులుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ వెసులుబాటును వినియోగించుకోకుండా ఆక్రమణలను కొనసాగిస్తే రాజీపడేది లేదన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రక్రియ ముగిశాక, మళ్లీ అవకాశం ఇవ్వబోమన్నారు. దరఖాస్తు చేసుకోని వారి స్థలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. రాష్ట్రం లోని ప్రతి అంగుళం భూమికీ ధ్రువపత్రాలు (క్లియర్ టైటిల్) ఉండాలని స్పష్టం చేశారు.