br meena
-
అమ్మో.. 74 వేల ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది ఎకరాల ‘భూదాన్’ భూములు అదృశ్యం కావడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా లెక్కాపత్రం లేని భూదాన భూముల గురించి జిల్లాల వారీగా గణాంకాలతో ‘భూదాన్ దొంగలు దొరికేనా?’ శీర్షికన మంగళవారం సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అందులోని వివరాలు చూసి ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి సర్వే నంబర్లోని భూముల రికార్డులు పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భూదాన్ భూముల లెక్క కూడా తేలితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయిలో చర్చ భూరికార్డుల ప్రక్షాళనపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాల నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో భూదాన భూముల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఒక కీలక సూచన చేసినట్లు తెలిసింది. ఎవరైనా భూస్వామి భూదానపత్రంలో సర్వే నంబర్లు, విస్తీర్ణం చెప్పకపోయినా... 1975 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం భూముల వివరాలు వెల్లడించినప్పుడు ఫలానా సర్వే నంబర్లోని, ఫలానా విస్తీర్ణం గల భూమిని భూదానం కింద ఇచ్చినట్లుగా పేర్కొని ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. అలా పేర్కొన్న భూములను భూదాన్ కిందకు చేర్చాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక భూదాన్ యజ్ఞబోర్డు నుంచి తెప్పించుకున్న వివరాల ఆధారంగా.. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైనా వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రికార్డులు పరిశీలించి ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఏ మేరకు భూదాన్ భూములున్నాయనే దానిపై స్పష్టత రావచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే నంబర్లు లేని భూములు, సాగుకు యోగ్యం కావని నిర్ధారించిన భూముల నిగ్గు తేల్చేందుకు మరో మార్గం లేదని.. ఉన్నంతలోనే లెక్కల్లో స్పష్టత వస్తుందని ఓ సీనియర్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూదాన్ భూములు అక్రమార్కుల పాలైన మాట వాస్తవమేనని.. కానీ ఇంత భారీగా భూములకు లెక్కలు లేకుండా పోయాయనే విషయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే భూదానోద్యమ స్ఫూర్తికి సార్థకత చేకూరుతుందని, భూమి లేని పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే నంబర్లు లేనివి పట్టుకునేదెలా? ఎప్పుడో 1950–65 సంవత్సరాల మధ్యలో దానంగా వచ్చిన భూముల వివరాలను పదిలపర్చడం, వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వాటి వ్యవహారం తేలడం అంత సులభమేమీ కాదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1.69 లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో కనీసం 60 వేల ఎకరాలకు సర్వే నంబర్లు లేవని చెబుతున్నాయి. అలా సర్వే నంబర్లు లేని భూముల లెక్క ఎలా తేల్చాలన్నది కూడా సమస్యగా మారనుంది. అంతేగాకుండా కొందరు దాతలు భూములిస్తూ సమర్పించిన దానపత్రంలో సర్వే నంబర్లు పేర్కొనలేదని, మరికొందరు సర్వే నంబర్లు ఇచ్చినా భూమి విస్తీర్ణం చెప్పలేదని, ఇంకొందరు వివాదాస్పద భూములను కూడా దానం చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్ని ఎకరాల భూములను అప్పట్లో రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం కల్పించిన భూముల క్రమబద్ధీకరణ సదుపాయాన్ని వినియోగించుకోని వారిని కబ్జాదారులుగానే పరిగణిస్తాం. వారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించి ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’’ అని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా స్పష్టం చేశా రు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కు సంబంధించిన పలు అంశాలను వివరిం చారు. జీవో 58 కింద ఉచిత కేటగిరీలో జనవరి 31తో, జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో ఫిబ్రవరి 28తో దరఖాస్తు ప్రక్రియ ముగిసిందన్నారు. వివిధ జిల్లాల నుంచి ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తు దారులు రిజిస్ట్రేషన్(12.5శాతం) ధర కింద రూ.133.58కోట్లు చెల్లించారని చెప్పారు. ఇకపై దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. కబ్జాలను ఉపేక్షించం.. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. వీరిపై కఠినమైన రెవె న్యూ చ ట్టాలను(ల్యాండ్ ఆక్రమణల చట్టం 1905, ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ 1982, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986)లను ప్రయోగిస్తామన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, అది పూర్తి కాగానే దరఖాస్తు చేసుకోని వారినుంచి భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. సొమ్ము చెల్లించిన భూమికే.. క్రమబద్ధీకరణకు సంబంధించి పేద వర్గాల కు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఉచిత కేటగిరీలో 125గజాల వరకు అసైన్మెంట్ పట్టాను ఇస్తామని బీఆర్ మీనా చెప్పారు. ఒకవేళ ద రఖాస్తులో పేర్కొన్న స్థలం 125గజాలకు పైగా 150గజాల్లోపు ఉన్నట్లైతే నిబంధనల ప్రకారం మిగిలిన భూమికి రిజిస్ట్రేషన్ ధరలో 10శాతం చెల్లించాలన్నారు. ఇటువంటి ప్రత్యేక కేసుల్లో.. ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలానికి అసైన్మెంట్ పట్టా ఇస్తామని, సొమ్ము చెల్లించిన మేర స్థలానికే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హక్కు బదిలీ చేస్తామన్నారు. -
కబ్జాదారులపై పీడీ యాక్ట్
* క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్న సీఎం కేసీఆర్ * సర్కారు భూముల్లోని నివాసాలు, నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోండి * 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి, ఆ తర్వాత మిగిలిన భూములను స్వాధీనం చేసుకుంటాం * ఇకపై ఆక్రమణలను సహించం, కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై ముందస్తు నిర్బంధ(పీడీ యాక్టు) చట్టాన్ని ప్రయోగించేందుకూ వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జూన్ 2కు ముందు ప్రభుత్వ భూముల్లో నివాసాలు, నిర్మాణాలు ఏర్పరచుకున్న వారు, వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్కారు భూముల్లోని పేదల నివాసాలతో పాటు ఇతర నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించే అంశంపై సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇకపై ఆక్రమణలకు తావులే కుండా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడానికే ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు. పేదలు నివాసమున్న 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని, అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. మిగతా వారి విషయంలో ఎంత విస్తీర్ణానికి ఎంత ధర చెల్లించాలో ఇప్పటికే నిర్ణయించినందున అలాంటి వాళ్లూ క్రమబద్ధీకరణ కు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్లన్నీ సక్రమంగా ఉండాలని, దీన్ని మొత్తంగా ప్రక్షాళన చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం వెల్లడించారు. గత నెల 31న క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాల తో ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జీవో వచ్చిన 20 రోజుల్లోగా అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు స్వీకరించాక 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను సీఎం ఆదేశించారు. ఇకపై రాష్ర్టంలో భూముల దురాక్రమణకు వీల్లేకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని కబ్జాదారులుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ వెసులుబాటును వినియోగించుకోకుండా ఆక్రమణలను కొనసాగిస్తే రాజీపడేది లేదన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రక్రియ ముగిశాక, మళ్లీ అవకాశం ఇవ్వబోమన్నారు. దరఖాస్తు చేసుకోని వారి స్థలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. రాష్ట్రం లోని ప్రతి అంగుళం భూమికీ ధ్రువపత్రాలు (క్లియర్ టైటిల్) ఉండాలని స్పష్టం చేశారు. -
మళ్లీతప్పించారు
సాక్షి, సంగారెడ్డి: ఆంధ్రప్రవేశ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్(డీఎం) పోస్టు వ్యవహారం కుర్చీలాటను తలపిస్తోంది. డీఎంగా ఓ అధికారిని నియమించి నెల రోజులూ గడవక ముందే ఆ అధికారిని తప్పించడానికి మరో అధికారిని నియమించడం అధికారవర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఏఎంగా పనిచేసిన జె. జయరాం పదోన్నతిపై మెదక్ డీఎంగా ఈ నెల 5న బాధ్యతలు స్వీకరించారు. ఆయన విధుల్లో చేరి 20 రోజులకే ఎస్. పద్మాకర్ అనే మరో అధికారిని డిప్యుటేషన్‌పై డీఎంగా నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కలెక్టర్‌కు రిపోర్టు చేయాలని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన పద్మాకర్‌ను ఆదేశించారు. నాటకీయ పరిణామాలు సంస్థ డీఎం కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్ ఎ. సత్యనారాయణ సహోద్యోగి నుంచే రూ. 1.25 లక్షల లంచం తీసుకుంటూ గత సెప్టెంబర్ 16న ఏసీబీకి దొరికిపోయారు. సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో అప్పటి డీఎం ప్రసాద్ ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బదిలీ చేయించుకుని వెళ్లిపోవడంతో పోస్టు ఖాళీ అయింది. పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) ఏసురత్నం కొంతకాలం, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి సాయిలు మరికొంత కాలం ఇన్చార్జి డీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఇ. రవికుమార్ అనే అధికారి గత నెల 4న డీఎంగా బాధ్యతలు స్వీకరించగా.. అదే రోజు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆయన్ని వెనక్కి పంపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. శ్రీనివాస్‌రెడ్డి అనే డిప్యూటీ కలెక్టర్‌కు సంస్థ డీఎంగా నియమించాలని ఆమె ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అధికారుల్లో చర్చ జరిగింది. అయితే, కలెక్టర్ సిఫారసులను బేఖాతర్ చేస్తూ.. పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర కార్యాలయం జె. జయరాంను డీఎంగా నియమించింది. ఇది జరిగిన 20 రోజులకే మరో ఎస్. పద్మాకర్‌ను నియమించడంతో అధికారుల్లో చర్చనీయాంశమైంది.