సాక్షి, హైదరాబాద్: వేలాది ఎకరాల ‘భూదాన్’ భూములు అదృశ్యం కావడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా లెక్కాపత్రం లేని భూదాన భూముల గురించి జిల్లాల వారీగా గణాంకాలతో ‘భూదాన్ దొంగలు దొరికేనా?’ శీర్షికన మంగళవారం సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అందులోని వివరాలు చూసి ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి సర్వే నంబర్‌లోని భూముల రికార్డులు పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భూదాన్ భూముల లెక్క కూడా తేలితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉన్నత స్థాయిలో చర్చ
భూరికార్డుల ప్రక్షాళనపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాల నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో భూదాన భూముల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఒక కీలక సూచన చేసినట్లు తెలిసింది. ఎవరైనా భూస్వామి భూదానపత్రంలో సర్వే నంబర్లు, విస్తీర్ణం చెప్పకపోయినా... 1975 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం భూముల వివరాలు వెల్లడించినప్పుడు ఫలానా సర్వే నంబర్‌లోని, ఫలానా విస్తీర్ణం గల భూమిని భూదానం కింద ఇచ్చినట్లుగా పేర్కొని ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది.
అలా పేర్కొన్న భూములను భూదాన్ కిందకు చేర్చాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక భూదాన్ యజ్ఞబోర్డు నుంచి తెప్పించుకున్న వివరాల ఆధారంగా.. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైనా వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రికార్డులు పరిశీలించి ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఏ మేరకు భూదాన్ భూములున్నాయనే దానిపై స్పష్టత రావచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
సర్వే నంబర్లు లేని భూములు, సాగుకు యోగ్యం కావని నిర్ధారించిన భూముల నిగ్గు తేల్చేందుకు మరో మార్గం లేదని.. ఉన్నంతలోనే లెక్కల్లో స్పష్టత వస్తుందని ఓ సీనియర్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూదాన్ భూములు అక్రమార్కుల పాలైన మాట వాస్తవమేనని.. కానీ ఇంత భారీగా భూములకు లెక్కలు లేకుండా పోయాయనే విషయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే భూదానోద్యమ స్ఫూర్తికి సార్థకత చేకూరుతుందని, భూమి లేని పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
సర్వే నంబర్లు లేనివి పట్టుకునేదెలా?
ఎప్పుడో 1950–65 సంవత్సరాల మధ్యలో దానంగా వచ్చిన భూముల వివరాలను పదిలపర్చడం, వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వాటి వ్యవహారం తేలడం అంత సులభమేమీ కాదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1.69 లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో కనీసం 60 వేల ఎకరాలకు సర్వే నంబర్లు లేవని చెబుతున్నాయి. అలా సర్వే నంబర్లు లేని భూముల లెక్క ఎలా తేల్చాలన్నది కూడా సమస్యగా మారనుంది. అంతేగాకుండా కొందరు దాతలు భూములిస్తూ సమర్పించిన దానపత్రంలో సర్వే నంబర్లు పేర్కొనలేదని, మరికొందరు సర్వే నంబర్లు ఇచ్చినా భూమి విస్తీర్ణం చెప్పలేదని, ఇంకొందరు వివాదాస్పద భూములను కూడా దానం చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్ని ఎకరాల భూములను అప్పట్లో రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment