bhoodan lands
-
భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం
-
భూదాన్ స్కామ్.. ఈడీ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. జనార్థన్ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీవో, ఎమ్మార్వోను విచారించి ఈడీ కీలక వివరాలను సేకరించింది.ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించారు. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. -
ఖమ్మం లింగయ్యనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మంలోని లింగయ్య నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీబీలతో గుడిసెలను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులు యత్నించారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ భూదాన్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామంటున్న భూదాన్ భూ నిర్వాసితులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది.అడ్డుకున్న భూదాన్ నిర్వాసితులపై దాడి జరిగింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ వ్యక్తులను భూదాన్ భూ నిర్వాసితులు తరిమికొట్టారు.ప్రైవేట్ రౌడీలు వచ్చి పోలీసుల సమక్షంలో తమపై దాడికి పాల్పడుతున్న కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే పోలీసుల సమక్షంలో రౌడీలు వచ్చి తమపై దాడి చేయడమా అంటూ నిర్వాసితులు మండిపడ్డారు. -
Ranga Reddy District: భూదాన్ భూముల్లో వాలిన గద్దలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు అన్యాక్రాంతమవగా తాజాగా మరికొంత భూమిని మాయం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో భూదాన్ బోర్డు సభ్యులుగా చెలామణి అయిన కొందరు పెద్ద మనుషులు ఈ భూములను కొల్లగొట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో సొంత గూడు సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్న పేదల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. వీకర్ సెక్షన్ కింద పేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములకు రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాల బారి నుంచి కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఖాళీ భూములపై ‘పెద్ద’ల కన్ను.. భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మిగులు భూములు ఉన్న రైతుల నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించి భూదాన్ బోర్డుకు అప్పగించారు. దీనిలో కొంత భూమి పేదలకు పంచారు. మరికొంత భూమిని రైతులు, రియల్టర్లు పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోర్డు పరిధిలో 7000 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నట్లు అంచనా. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 215 నుంచి 227 వరకు ఉన్న సర్వే నంబర్లతోపాటు జాఫర్‌గూడ సర్వే నంబర్ 317, 319లలో 20 ఎకరాలకుపైగా, బాటసింగారం రెవెన్యూ పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో 75 ఎకరాలకుపైగా, కుంట్లూరులో 216 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాలకుపైగా భూదాన్ భూమి ఉంది. అదేవిధంగా తారామతిపేట్ సర్వే నంబర్ 235, 236లలో 48 ఎకరాలు ఉండగా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189లలో పెద్ద సంఖ్యలోనే భూదాన్ భూములున్నాయి. బాలాపూర్‌లోని సర్వే నంబర్ 88లో 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇక యాచారం, ఇబ్రహీపట్నం, మంఖాల్, మహేశ్వరంలోనూ ఈ బోర్డుకు భూములు ఉన్నాయి. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమైనప్పటికీ జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు, అమ్మకాలు కొనసాగు తున్నాయి. లీజు పేరుతో గలీజు వ్యవహారాలు... ఇప్పటికే మెజారిటీ భూములను రియల్టర్లు కొల్లగొట్టగా మరికొంత భూమిని గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు మాయం చేస్తున్నారు. వీకర్ సెక్షన్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద మొత్తంలో భూములు కొల్లగొట్టారు. ఒకే ప్లాటుకు 2, 3 నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఒక్కో ప్లాటును రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది విద్యాసంస్థలు, గోశాలలు, అనాథాశ్రమాలు, ఇతర సామాజిక సేవల పేరుతో ఈ భూములను వందేళ్లకు లీజుకు తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. (క్లిక్ చేయండి: డీజీపీ రేసులో పోటాపోటీ!) బోర్డును పునరుద్ధరించాలి... నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా సుమారు రూ. 19 కోట్లు అక్రమంగా వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. భూదాన్ భూములను కాపాడాలంటే బోర్డును పునరుద్ధరించడం ఒక్కటే పరిష్కారం. – వెదిర అరవింద్‌రెడ్డి, అధ్యక్షుడు, సర్వసేవాసంఘ్ (అఖిల భారత సర్వోదయ మండల్) మేమే పంచుతాం.. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భూములు మాయమయ్యాయి. కబ్జాదారుల చెరలోని భూములను విడిపించాలి. కనీసం మిగిలిన భూములైనా ప్రభుత్వం పేదలకు పంచాలి. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలోనే భూపంపిణీ చేపడతాం. – రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
భూదాన్ భూములను పంచకుంటే ఆక్రమిస్తాం
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మౌనం వీడి భూదాన్ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ భూములను ప్రభుత్వం పంపిణీ చేయకపోతే తామే వాటిని ఆక్రమించి నిరుపేదలకు పంచుతామని ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మార్చి 17 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. సోమవారం అఖిల భారత సర్వసేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భూదాన్ భూములను భూములు లేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద నిరుపేదలతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న చాడ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ఆచార్య వినోబాభావే భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాలను విరాళంగా సేకరించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూదాన్ భూములను పరిరక్షించకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఎన్ని భూదాన్ భూములు కబ్జాకు గురయ్యాయో పూర్తి ఆధారాలతో ఇస్తామన్నారు. అనంతరం అఖిల భారత సర్వసేవా సంఘం జాతీయ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ పేద ప్రజలు భూమి విముక్తి కోసం పోరాడుతుంటే వారికి అండగా ఉండకుండా సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వినోబా భావే, మొద టి భూదాత రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అ«ధ్యక్షుడు శంకర్‌నాయక్, ట్రస్టీ షేక్‌హుస్సేన్, సంఘ సేవకులు కృష్ణప్రసాద్, సీపీఐ నగర కార్యదర్శి నర్సింహ తదితరులతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
భూదాన్ భూముల కబ్జాపై గురి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో.. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. ఆక్రమణలు.. రియల్ దందాలు పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. మియాపూర్ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. రికార్డులు సేకరించే పనిలో... డిజిటల్ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. -
అమ్మో.. 74 వేల ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది ఎకరాల ‘భూదాన్’ భూములు అదృశ్యం కావడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా లెక్కాపత్రం లేని భూదాన భూముల గురించి జిల్లాల వారీగా గణాంకాలతో ‘భూదాన్ దొంగలు దొరికేనా?’ శీర్షికన మంగళవారం సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అందులోని వివరాలు చూసి ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి సర్వే నంబర్లోని భూముల రికార్డులు పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భూదాన్ భూముల లెక్క కూడా తేలితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయిలో చర్చ భూరికార్డుల ప్రక్షాళనపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాల నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో భూదాన భూముల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఒక కీలక సూచన చేసినట్లు తెలిసింది. ఎవరైనా భూస్వామి భూదానపత్రంలో సర్వే నంబర్లు, విస్తీర్ణం చెప్పకపోయినా... 1975 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం భూముల వివరాలు వెల్లడించినప్పుడు ఫలానా సర్వే నంబర్లోని, ఫలానా విస్తీర్ణం గల భూమిని భూదానం కింద ఇచ్చినట్లుగా పేర్కొని ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. అలా పేర్కొన్న భూములను భూదాన్ కిందకు చేర్చాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక భూదాన్ యజ్ఞబోర్డు నుంచి తెప్పించుకున్న వివరాల ఆధారంగా.. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైనా వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రికార్డులు పరిశీలించి ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఏ మేరకు భూదాన్ భూములున్నాయనే దానిపై స్పష్టత రావచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే నంబర్లు లేని భూములు, సాగుకు యోగ్యం కావని నిర్ధారించిన భూముల నిగ్గు తేల్చేందుకు మరో మార్గం లేదని.. ఉన్నంతలోనే లెక్కల్లో స్పష్టత వస్తుందని ఓ సీనియర్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూదాన్ భూములు అక్రమార్కుల పాలైన మాట వాస్తవమేనని.. కానీ ఇంత భారీగా భూములకు లెక్కలు లేకుండా పోయాయనే విషయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే భూదానోద్యమ స్ఫూర్తికి సార్థకత చేకూరుతుందని, భూమి లేని పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే నంబర్లు లేనివి పట్టుకునేదెలా? ఎప్పుడో 1950–65 సంవత్సరాల మధ్యలో దానంగా వచ్చిన భూముల వివరాలను పదిలపర్చడం, వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వాటి వ్యవహారం తేలడం అంత సులభమేమీ కాదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1.69 లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో కనీసం 60 వేల ఎకరాలకు సర్వే నంబర్లు లేవని చెబుతున్నాయి. అలా సర్వే నంబర్లు లేని భూముల లెక్క ఎలా తేల్చాలన్నది కూడా సమస్యగా మారనుంది. అంతేగాకుండా కొందరు దాతలు భూములిస్తూ సమర్పించిన దానపత్రంలో సర్వే నంబర్లు పేర్కొనలేదని, మరికొందరు సర్వే నంబర్లు ఇచ్చినా భూమి విస్తీర్ణం చెప్పలేదని, ఇంకొందరు వివాదాస్పద భూములను కూడా దానం చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్ని ఎకరాల భూములను అప్పట్లో రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
భూదాన్ దొంగలు దొరికేనా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో ‘భూదాన్’భూముల గుట్టు తేలుతుందా..? దశాబ్దాలుగా పరిష్కారం దొరకని ఆ భూముల సమస్య ఓ కొలిక్కి వస్తుందా? పేదలకు సాగుభూమి ఇవ్వాలన్న నాటి మహనీయుల స్ఫూర్తికి తూట్లు పొడిచిన అక్రమార్కులు బయటికి వస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో దాదాపు 75 వేల ఎకరాలను కొందరు దొంగలు దర్జాగా చేజిక్కించుకున్నట్లు అంచనా. ఇప్పుడా భూమంతా బయటికి వస్తే.. అటు పేదలకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు అండగా ఉండేందుకు.. దున్నేవాడికి భూమి నినాదంతో ఆచార్య వినోభాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రం అండగా నిలిచింది. కమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం కూడా దానికి తోడ్పడింది. 1951లో అప్పటి నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వెదిరె రామచంద్రారెడ్డి సోదరుల ఔదార్యంతో ఇక్కడ మొదలైన భూదానోద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1965 వరకు కూడా కొనసాగింది. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 95 వేల ఎకరాల భూములను అప్పటి భూస్వాములు వితరణ చేశారు. అందులో ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 1,69,291.02 ఎకరాలను భూదాన యజ్ఞానికి ధారపోశారు. భూదాన యజ్ఞ బోర్డు లెక్కల ప్రకారం ఇందులో 94,794.89 ఎకరాలను పేదలకు పంచారు. మిగతా 74,496.13 ఎకరాల భూమిలో.. 61,260 ఎకరాలు సాగుకు పనికిరాదని పేర్కొన్నారు. అయితే ఆ భూములు సాగుకు పనికిరావని ఎవరు తేల్చారో, ఆ భూమి ఎక్కడుందో, మిగతా 13,236 ఎకరాలను ఎందుకు పంచలేదో అనేదానిపై బోర్డు దగ్గర కూడా లెక్కల్లేవు. ప్రస్తుతం భూదాన బోర్డు వద్ద ఉన్న లెక్కల ప్రకారం తమ వద్ద 4,500 ఎకరాల భూములే ఉన్నాయని చెబుతోంది. ఈ లెక్కన సాగుకు పనికివచ్చే భూమిలోనూ మిగతా 9వేల ఎకరాలు ఏమయినట్లనేది ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ఎండీఏ పరిధిలోనే వేల ఎకరాలు జాడ తెలియకుండా పోయిన 74,496 ఎకరాల భూదాన్ భూముల్లో చాలా వరకు హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని వందల ఎకరాల భూములపై కోర్టు కేసులు నడుస్తున్న సమయంలో.. అవి భూదాన భూములని తేలుతోంది. అసలు భూదాన్ భూముల్లో కనీసం 20 వేల ఎకరాల మేర ‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)’పరిధిలోనే ఉంది. ప్రస్తుతం ఈ భూములు అత్యంత విలువైనవి. మరి హెచ్ఎండీఏ పరిధిలోని ఈ భూదాన్ భూముల వివరాలు భూరికార్డుల ప్రక్షాళనలో తేలుతాయా అన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు అసలు రైతులకు పంచినట్టు చెబుతున్న 94,794 ఎకరాలు కూడా లబ్ధిదారుల చేతిలోనే ఉన్నాయా, భూమి లేని పేదలే వాటిని అనుభవిస్తున్నారా, అక్రమార్కుల పరం అయ్యాయా అన్నదీ తేలాల్సి ఉంది. రంగాపూర్ వ్యథ ఇది.. పూర్వపు నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్ గ్రామాన్ని పరిశీలిస్తే... ఇక్కడ 800 ఎకరాల భూములను పేదలకు భూదాన్ కింద పంచారు. 80వ దశకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నార్నె రంగారావు అనే రిటైర్డ్ మిలటరీ అధికారి అక్కడ వాలాడు. మోసపూరిత ఎత్తుగడలతో మొత్తం 800 ఎకరాలను చేజిక్కించుకుని.. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడు. నామమాత్రపు ధరకు భూములు అమ్ముకున్న రైతులు తర్వాత నోళ్లు వెళ్లబెట్టగా.. రంగారావు మాత్రం కోట్లు జేబులో వేసుకున్నాడు. ఇదేమని అడిగితే అటు ప్రభుత్వాన్ని, ఇటు భూదాన బోర్డును, గ్రామస్తులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. నల్లగొండ జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు సుపరిచితం కావడం గమనార్హం. పేదలకు పంచిన భూదాన భూముల్లో ఇలాంటి ఎన్ని రంగాపూర్లు ఉన్నాయో తేలాల్సి ఉంది. డబుల్ బెడ్రూం బెంగ తీరుతుంది! హెచ్ఎండీఏ పరిధిలోని 20 వేల ఎకరాల భూదాన్ భూముల లెక్క తేలితే రాష్ట్ర ప్రభుత్వానికి, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరమయ్యే అవకాశముంది. భూదాన్ భూముల్లో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆలోచన చేసింది. ఈ మేరకు భూదన్ భూముల లెక్కలు తేల్చాలని గతంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది కూడా. జిల్లాల యంత్రాంగం ఆ పనిలో ఉన్న తరుణంలోనే... భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూదాన్ భూముల సమస్యను తేలుస్తుందా, అలాగే వదిలేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
భూదాన్’ పేరుతో మోసం
- 8 మంది అరెస్టు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుట్లూరులో భూదాన్ భూమి పేరుతో పేదలను మోసం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్- 215 నుంచి 224 మధ్యగల భూమి భూదాన్ ట్రస్టుకు సంబంధించినదంటూ కొందరు వ్యక్తులు పేదలను ముగ్గులోకి దించారు. అందుకుగాను కేసీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరు పెట్టి ఒక్కో వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. వారికి నకిలీ పట్టాలు ఇచ్చి.. ఆ స్థలంలో గుడిసెలు వేయించారు. ఈ తతంగం అంతా తెలుసుకున్న అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూత్రధారులైన 8మందిని శనివారం అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భూదాన్ భూముల చిట్టా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ యజ్ఞబోర్డు మాజీ పాలకవర్గం పాపాల పుట్టను తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చేతులు మారిన భూదాన్ భూముల చిట్టాను విప్పేందుకు ప్రత్యేక అధికారులను రంగంలోకి దించింది. భూదాన్‌బోర్డు ముసుగులో చేసిన అక్రమాలను వెలికితీసేందుకు జిల్లాకు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఓ.జే మధు, లింగయ్యనాయక్, జి.రమేశ్, కె.సీతారామారావు, ఎం.శేఖర్‌రెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌లను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 11,744 ఎకరాల మేర భూదాన్ భూములు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్క తేల్చింది. ఇందులో 7,363 ఎకరాలు భూమిలేని పేదలకు పంపిణీ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంట్లో మూడు వేల ఎకరాలు లబ్ధిదారుల ఆధీనంలో ఉన్నట్లు తేల్చగా, సుమారు 1,600 ఎకరాల మేర ఎన్ ఎస్జీ, ఆక్టోపస్, ఎన్ఐఏ, ఎన్పీఏ సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. ఇవి పోగా, మిగతా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే అంశంపై స్పష్టత రావడంలేదు. వినోభాబావే పిలుపుమేరకు భూదానోద్యమంలో చాలామంది దాతలు విరివిగా భూ వితరణ చేశారు. ఈ భూములను కాపాడాల్సిన యజ్ఞబోర్డు కంచె చేను మేసిన చందంగా కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే భూదాన్ బోర్డు పాలకవర్గం నిర్వాకంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బోర్డు ప్రతినిధులు చేసిన అక్రమాలను లోతుగా విచారించి సమగ్ర నివేదికను సర్కారుకు అందజేసే బాధ్యతను డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు. ఫర్ సేల్..! పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్ధేశంతో దాతలు దానం చేసిన భూములు వక్రమార్గంలో పరాధీనమయ్యాయి. శివార్లలో విలువైన భూములు రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లాయి. భూములను పరిరక్షించాల్సిన బోర్డు ప్రతినిధులు.. రియల్టర్లుగా అవతారమెత్తారు. దీంతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, హయత్‌నగర్, కీసర తదితర మండలాల్లోని భూదాన్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కేసీఆర్ సర్కా రు.. పాలకవర్గాన్ని రద్దు చేసింది. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం 3,060, యాచారం 1,300, మొయినాబాద్ 470, మహేశ్వరం 506, కందుకూరు 530, శంషాబాద్ 564, కీసర 51 ఎకరాల మేర భూదాన్ భూములున్నట్లు లెక్క తేలింది. అయితే, రికార్డులకు అనుగుణంగా భూముల లెక్కలు తేలకపోవడంతో యంత్రాంగం జుట్టుపీక్కుంటోంది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణంకంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం, కొన్నిచోట్ల భూమిని దానం చేసినట్లు ప్రకటించినప్పటికీ, దాతల కుటుంబాల పోజిషన్‌లోనే భూములు ఉన్నట్లు స్పష్టమైంది. మరికొన్ని చోట్ల ఒరిజినల్ పట్టాదారుల స్థానే ఇతరులు సాగు చేసుకుంటున్నట్లు యంత్రాంగం పసిగట్టింది.