భూదాన్‌ భూముల కబ్జాపై గురి  | Government Focused On The Bhoodan Lands | Sakshi
Sakshi News home page

భూదాన్‌ భూముల కబ్జాపై గురి 

May 7 2021 1:54 AM | Updated on May 7 2021 10:21 AM

Government Focused On The Bhoodan Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

 ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో..
ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. 

ఆక్రమణలు.. రియల్‌ దందాలు
పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేశారు. మియాపూర్‌ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్‌ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్‌ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేసింది.

రికార్డులు సేకరించే పనిలో...
డిజిటల్‌ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్‌ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.  

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement