Vinobhabave Acharya
-
‘100 ఎకరాలు దానంగా ఇచ్చారు, ఆయనది గొప్ప చరిత్ర’
‘‘వెదిరె రామచంద్రా రెడ్డిగారు ఇచ్చిన మొదటి భూదానం భారతదేశానికే కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. ఆయన జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను నాపై పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు నీలకంఠ అన్నారు. పోచంపల్లికి చెందిన ప్రథమ భూదాత వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం తెరపైకి రానుంది. నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. అరవింద్ రెడ్డి(రామచంద్రా రెడ్డి మనవడు) సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రా రెడ్డిగారు. ఆ చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోబా భావే ఆశయాలతో పని చేశారు రామచంద్రారెడ్డి.. అందుకే వినోబా భావే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాం’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. 1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలకు జరుగుతున్నాయి. -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
భూదాన్ భూముల కబ్జాపై గురి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో.. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. ఆక్రమణలు.. రియల్ దందాలు పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. మియాపూర్ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. రికార్డులు సేకరించే పనిలో... డిజిటల్ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. -
‘భూదాన’ దడ
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేదలకు భూమి ఇవ్వాలనే సంకల్పంతో ఆచార్య వినోభాబావే 1955లో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఎకరాలకు పైగా సేకరించారు. ఇప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమిని సేకరించి 1965లో భూదానయజ్ఞ బోర్డును స్థాపించారు. 1951-65 కాలంలో నగరశివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కుంట్లూరు, కూకట్పల్లి, తారామతిపేట, బాటసింగారం, మెదక్‌జిల్లా జహీరాబాద్, సుల్తాన్పూర్, నల్లగొండజిల్లా గొల్లగూడ ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఇందులో భాగంగా వినోభాబావే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పర్యటించి సుమారు 5వేల ఎకరాలను సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశారు. యాచారం, హయత్‌నగర్, కందుకూరు, మేడ్చల్, మహేశ్వరం మండలాల్లో 1,683 మంది భూదాతల నుంచి 21,931 ఎకరాలు సేకరించారు. ఇందులో దాదాపు 13వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. జిల్లాలో భూదానం ఇలా.. హయత్‌నగర్ మండలం కుంట్లూర్ 278/1 సర్వేనంబర్‌లో పది ఎకరాల భూమిని రాంరెడ్డి అనే రైతు భూదాన బోర్డుకు దానం చేశారు. సుమారు 285 మంది నిరుపేదలకు ఈ భూమిలో ప్లాట్లు కేటాయించారు. బాటసింగారంలో మహ్మద్ జహంగీర్ ఘోరీ అనే వ్యక్తి సర్వేనంబర్ 319లో 16 ఎకరాల 30 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూమిలో 470 ప్లాట్లు చేసి పేదలకు కేటాయించారు. తారామతిపేట 215, 216, 217, 235, 236, 209 సర్వేనంబర్లలోని 71 ఎకరాల భూములను శంకర్గంగయ్య దానం చేశారు. ఈ భూమిలో 1600 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. కూకట్‌పల్లిలో శాపూరి చెన్నయ్ అనే వ్యక్తి సర్వేనంబర్ 353, 354లలో 24 ఎకరాల 26 గుంటల భూమిని దానం చేశారు. ఈ భూముల్ని 12 మంది రైతులకు సాగు నిమిత్తం కేటాయించారు. సదరు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన 17 ఎకరాల భూమి కోర్టు కేసులో ఉంది. మిగిలిన ఏడు ఎకరాల్లో 300 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. బోర్డుపై ఆరోపణలు పేదల కోసమే భూ పంపిణీ అని చెప్పిన బోర్డు తమ ఆధీనంలో వున్న వేలాది ఎకరాల భూముల్ని అనేక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని భూములను ఇష్టారీతిలో విక్రయించారని గతంలో దుమారం లేచింది. ఇబ్రహీంపట్నంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు 670 ఎకరాలు, ఆక్టోపస్‌కు 570 ఎకరాలు, నేషనల్ పోలీస్ అకాడమీకి 400 ఎకరాలు, సీఆర్పీఎఫ్కు 400 ఎకరాల భూమిని కేటాయించారు. కందుకూరు, ఘట్కేసర్ మండలాల్లో సబ్స్టేషన్ల నిర్మాణం కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. రంగాపూర్‌లో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు 150 ఎకరాల భూములు కేటాయించారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేకరించిన 1.95లక్షల ఎకరాల్లో ప్రస్తుతం సుమారు 350 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. కేటాయింపు ఇలా..: భూదాన్యాక్ట్-1965 ప్రకారం భూమిలేని, ఇంటి స్థలం లేని పేదలు దరఖాస్తు చేసుకుంటే అసైన్డ్ చట్టాన్ని అనుసరించి భూదాన భూముల్లో వారికి స్థలాల్ని కేటాయిస్తారు. భూమిని పొందిన మూడేళ్లలోపు ఆ స్థలంలో వ్యవసాయం చేయాలి. సుమారు పదేళ్ల వరకూ లబ్ధిదారులు బోర్డుద్వారా పొందిన భూమిని విక్రయించరాదు. రైతుల కోసం ఇచ్చిన భూములపై కన్నేసిన బడా వ్యాపార వేత్తలు వారిని బెదిరించి కారుచౌకగా కొనుగోలు చేసినప్పటికీ భూదాన బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోలేదనే విమర్శలున్నాయి. అతి ఖరీదైన భూములున్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్ మండలాల్లో భూదాన భూముల్ని ఏపీఐఐసీకి అప్పగించి పారిశ్రామిక పక్షపాతిగా మారిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూదాన యజ్ఞబోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇటు పట్టాదారులతో పాటు కబ్జాదారుల్లో కలవరం మొదలైంది. బోర్డు రద్దుతో సంస్థలకు, పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమోనన్న ఆందోళనలు పెరిగాయి.