encrochments
-
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
మెట్రో స్టేషన్లో ‘ఆధార్’ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి మూసారాంబాగ్ మెట్రోస్టేషన్లో ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రానికి సిటీజన్ల నుంచి వచ్చే ఆదరణను బట్టి మరిన్ని స్టేషన్లలో ఆధార్, మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నాయి. త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు నగరంలో త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కాగా, త్వరలో మరో 27 ఏర్పాటు చేసేందుకు ఆయా బస్తీల్లోని కమ్యూనిటీహాళ్లు, వార్డు కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. డివిజన్‌కు రెండు వంతున జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 300 బస్తీ దవాఖానాలు, అవసరాన్ని బట్టి మరో యాభై అదనంగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసుకున్న వివిధ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం తొలగించారు. చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణల నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మరుతున్నందున జీహెచ్ఎంసీ సర్కిల్–17 ఉప కమిషనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. చౌరస్తాలోని హోటల్ యజ్ఞేష్ విరాట్ హోటల్ ముందు ఉన్న ఆక్రమణలతో పాటు రోడ్డు మీదకు ఏర్పాటు చేసిన షాపులను, బండీలను తొలగించారు. జేసీబీ ఇతర వాహనాలతో మూడు గంటలపాటు తొలగింపు కార్యక్రమం జరిగింది. చౌరస్తాలో మరో వైపు ట్రాన్స్ఫార్మర్ను అనుకొని ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం అధికారులు తొలగించారు. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) ఎల్బీనగర్లో భారీగా పెరిగిన ఓటర్లు! ఎల్బీనగర్లో ఓటర్ల సంఖ్య 5,57,081కి చేరింది. పురుష ఓటర్లు 2,91,749 కాగా.. మహిళా ఓటర్లు 2,65,229 మంది, ట్రాన్స్‌జెండర్స్ 103 మంది ఉన్నట్టు 2022లో విడుదల చేసిన తుది జాబితాలో పేర్కొన్నారు.గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్ 3వ స్థానంలో ఉంది. గతంలో ఎల్బీనగర్ ఓటర్లు 5,24,577మంది ఉండగా, ఇందులో పురుషులు 2,74.830 కాగా.. మహిళలు 2,49,653 మంది ఇతరులు 94లు ఉన్నారు. గతంలో కంటే సుమారు 32,504 మంది కొత్తగా యువ ఓటర్లు పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో పురుష ఓటర్లు 274830మంది ఉండా ప్రస్తుతం 2,91,749 మంది ఉన్నారు. కొత్తగా 16,919 మంది, మహిళా ఓటర్లు గతంలో 2.49653 మంది ఉండగా, ప్రస్తుతం 265229 మంది ఉన్నారు. కొత్తగా 15,576 మంది ఓటర్లు పెరిగారు. ఇక ఇతరులు గతంలో 94 ఉంటే... ప్రస్తుతం 103కి చేరగా కొత్తగా 9మంది పెరిగారు. మొత్తానికి 2022లో ప్రకటించిన తుది జాబితాలో భారీగా ఓటర్లు పెరిగారు. (చదవండి: నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’) -
భూదాన్ భూముల కబ్జాపై గురి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో.. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. ఆక్రమణలు.. రియల్ దందాలు పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. మియాపూర్ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. రికార్డులు సేకరించే పనిలో... డిజిటల్ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. -
ఉప్పుటేరును మింగేస్తున్నారు..!
సాక్షి, కృష్ణా: సామాన్యుడి ఇల్లు రోడ్డు నిర్మాణం పేరుతో తొలగిస్తే అతనికి మరో చోటు ఆశ్రయం కల్పించడానికి సెంటు భూమి కూడా ఇవ్వలేరు.. నిరుపేదల కష్టాలు వారికి పట్టనే పట్టవు. కానీ రూ.కోట్ల విలువైన పక్కా నిర్మాణాలు చేసుకోవడానికి, భారీ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఉప్పుటేరు, ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను ఆక్రమించుకుని అనుమతి లేని నిర్మాణాలు చేస్తుంటే కనీసం అటువైపు అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు.. ఇదీ కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలోని దుస్థితి. జిల్లాకు శివారు ప్రాంతమైన లక్ష్మీపురంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిపై అధికారులు అజమాయిషీ కొరవడటంతో భారీ కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇవి మరింత జోరందుకున్నాయి. నాటి పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైపోయాయి. అంతా బంగారమే! జిల్లాకు శివారునున్న లక్ష్మీపురం పంచాయతీలో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడ భూమి విలువ ప్రధాన పట్టణాలకంటే అధికంగా పలుకుతుంది. లాకు సెంటరులో అధికంగా ఇరిగేషన్, ఉప్పుటేరు పోరంబోకు భూములున్నాయి. వీటిని స్థానికులు కొందరు ఆక్రమించుకుని భారీ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడం వెనుక గతంలో రాజకీయ పెద్దల హస్తంతో పాటు, అధికారులు అండ కూడా పుష్కలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఉప్పుటేరును పూడ్చి.. లక్ష్మీపురం లాకు సెంటర్ మీదుగా కొల్లేరు నీటిని సముద్రంలోకి చేరవేసే ఉప్పుటేరు పాయ ప్రవహిస్తుంది. దీన్ని పూడ్చుకుంటూ కొందరు కట్టడాలు నిర్మించగా, మరి కొందరు భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడి నిర్మాణాలకు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. లాకుల వద్ద ఇరిగేషన్‌న్ భూముల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు రహదారిని ఆనుకుని య«థేశ్ఛగా జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇళ్లు తొలగించినా.. 216 జాతీయ నిర్మాణం పేరుతో లక్ష్మీపురంలో కొందరి పేదల ఇళ్లు తొలగించారు. ఇంతవరకు బాధితులకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించలేదు. కాని తమ కళ్ల ముందే రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఈ ఆక్రమణలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అధికారులు స్పందిస్తారా..? కృష్ణా నది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ఇటీవల అధికారులు కూల్చివేసినట్టుగానే ఉప్పుటేరు, ఇరిగేషన్ భూముల్లోని అక్రమ కట్టడాల విషయంలో కూడా చర్యలు తీసుకుంటారా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. వీటిపై పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ భూముల్లో కట్టడాలకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. -
ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై కలెక్టర్ అహ్మద్ బాబు కొరడా ఝళిపించారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేసిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని బల్దియూ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారి పక్కన అక్రమంగా ఏర్పాటుచేసిన షెడ్లు, దుకాణాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ ప్రక్రియను ఆక్రమణదారు లు, రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకునేం దుకు యత్నించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తున్నారని, ఈ చర్యతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. స్పందించిన ఆర్డీవో కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలుంటే ఆయనకు విన్నవించాలని స్పష్టం చేశారు. దీంతో ఆయూ దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సుమా రు గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. రోడ్డు పక్కనే గణపతి విగ్రహాలు తయారు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూ పాలని బీజేపీ నాయకులు ఆర్డీవోను కోరగా పట్టణంలోని రాంలీలా మైదానంలో పండుగ రోజుల వరకు ప్రత్యామ్నాయంగా ఉండొచ్చని ఆయన సూచించారు. ఆక్రమణల తొలగింపు ఒక్క ప్రాంతానికే పరిమితం చేయరాదని, అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆర్డీవో వెంట మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్, తహశీల్దార్ దత్తు, ఫుడ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ ఉన్నారు. ఆందోళన చేసిన వారిలో పార్టీల నా యకులు పాయల శంకర్, యూనిస్ అక్బానీ, సాజిద్‌ఖాన్, దుకాణదారులు పాల్గొన్నారు.