
భారత స్వాతంత్య్ర సమరం సాగినన్ని రోజులూ మహాత్మాగాంధీనీ, ఆయన అహింసావాద సిద్ధాంతాలనూ అత్యంత దగ్గరగా అనుసరించిన మొట్ట మొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. అందుకే 1940 లోనే ఆయనను గాంధీజీ భారతదేశ ‘మొదటి సత్యాగ్రహి’గా ఎంపిక చేశారు. అటువంటి వినోబా ప్రారంభించినదే ‘స్వచ్ఛంద భూదాన’ ఉద్యమం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్ళలో తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో అంతర్గత భూపో రాటాలు పొడసూపాయి. భూమి లేని ప్రజలు, భూస్వాములపై తిరుగుబాటును ప్రకటించి, దానిని తీవ్రతరం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోనే అంతర్యుద్ధ వాతావరణం నెలకొంటుందనీ. ఇది వర్ధమాన భారత దేశానికి ఏమాత్రం మంచిది కాదనీ భావించి జాతీయ సర్వోదయ 3వ వార్షిక సదస్సులో భారతదేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛంద భూదాన్’ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.
1951 ఏప్రిల్ 18న పాదయాత్ర చేస్తూ తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి చేరుకున్న వినోబా దగ్గరకు సుమారు 700 కుటుంబాలవారు వచ్చి కలిశారు. ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని ఇప్పిస్తే తాము వ్యవసాయం చేసుకుంటూ సామరస్యంగా జీవిస్తామని చెప్పారు. ఆయనే స్వయంగా వెళ్ళి ఆ గ్రామంలో ఒక భూస్వామిని కలిసి మాట్లాడారు. ఈ దేశంలో ప్రజలందరూ ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకుంటూ, సంయుక్త భారత దేశాన్ని నిర్మించుకోవాలన్నదే జాతిపిత మహాత్మ గాంధీ కల అని చెప్పారు. ఆ మాటలు విన్న పోచంపల్లి జమీందార్ వెదిరె రామచంద్రారెడ్డి తక్షణమే స్పందించి, పోచంపల్లి గ్రామంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు పంచడానికి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ దానం వెనువెంటనే అమలులోకి వచ్చే విధంగా దాన పత్రాన్ని సిద్ధం చేసి వినోబా భావే (Vinoba Bhave) కు అందించారు.
సుమారు ఆరున్నర సంవత్సరాల కాలం పాటు భారత దేశంలో 80 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి దాదాపు 50 లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించి సామాన్యుడి సర్వోదయానికి బలమైన పునాది వేశారు. 1965లో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో ‘భూదాన్–గ్రామ్‌దాన్’ చట్టం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు బాధ్యత తీసుకున్నాయి. వినోబా స్వీకరించిన దానపత్రాలన్నిటినీ ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని గెజిట్ విడుదల చేశాయి. ఫలితంగా ఈ భూములన్నీ శాశ్వతంగా భూదాన్ (Bhoodan) భూములుగానే ఉంటాయి. 1982, నవంబరు 15న వినోబా తుదిశ్వాస విడిచే నాటికి దేశం మొత్తం మీద 50 శాతానికి పైగా భూదాన్ భూములు నిరుపేద ప్రజలకు పంచబడ్డాయి. ఆ తరువాత ఈ ప్రక్రియ సన్నగిల్లింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అమలులోకి వచ్చినప్పుడు సుమారు 2 లక్షల యాభై వేల పైచిలుకు ఎకరాలు భూదాన్ భూములు ఉన్న ట్లుగా గెజిట్‌లో నమోదు అయ్యింది. వినోబా చనిపోయే నాటికి దాదాపు 40 వేల ఎకరాల భూములు మాత్రమే ఈ రాష్ట్రంలో పారదర్శకంగా భూమి లేని నిరుపేదలకుపంచబడ్డాయి. మిగిలిన భూములన్నీ ప్రభుత్వ సంర క్షణలోనే ఉన్నా... రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాది ఎకరాల భూదాన్ భూములు అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకుని ఉన్నాయి. వీటిని విడిపించి భూమి లేని నిరుపేదలకు పంచి సర్వోదయ స్ఫూర్తిని నిలపడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అదే వినోబాకు నిజమైన నివాళి.
ఎన్. రాంబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ అధ్యక్షులు
(ఏప్రిల్ 18తో భూదాన ఉద్యమానికి 75 వసంతాలు)