సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు అన్యాక్రాంతమవగా తాజాగా మరికొంత భూమిని మాయం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో భూదాన్ బోర్డు సభ్యులుగా చెలామణి అయిన కొందరు పెద్ద మనుషులు ఈ భూములను కొల్లగొట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో సొంత గూడు సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్న పేదల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. వీకర్ సెక్షన్ కింద పేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములకు రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాల బారి నుంచి కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
ఖాళీ భూములపై ‘పెద్ద’ల కన్ను..
భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మిగులు భూములు ఉన్న రైతుల నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించి భూదాన్ బోర్డుకు అప్పగించారు. దీనిలో కొంత భూమి పేదలకు పంచారు. మరికొంత భూమిని రైతులు, రియల్టర్లు పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోర్డు పరిధిలో 7000 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నట్లు అంచనా.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో 215 నుంచి 227 వరకు ఉన్న సర్వే నంబర్లతోపాటు జాఫర్‌గూడ సర్వే నంబర్ 317, 319లలో 20 ఎకరాలకుపైగా, బాటసింగారం రెవెన్యూ పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో 75 ఎకరాలకుపైగా, కుంట్లూరులో 216 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాలకుపైగా భూదాన్ భూమి ఉంది. అదేవిధంగా తారామతిపేట్ సర్వే నంబర్ 235, 236లలో 48 ఎకరాలు ఉండగా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189లలో పెద్ద సంఖ్యలోనే భూదాన్ భూములున్నాయి. బాలాపూర్‌లోని సర్వే నంబర్ 88లో 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇక యాచారం, ఇబ్రహీపట్నం, మంఖాల్, మహేశ్వరంలోనూ ఈ బోర్డుకు భూములు ఉన్నాయి. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమైనప్పటికీ జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు, అమ్మకాలు కొనసాగు తున్నాయి.
లీజు పేరుతో గలీజు వ్యవహారాలు...
ఇప్పటికే మెజారిటీ భూములను రియల్టర్లు కొల్లగొట్టగా మరికొంత భూమిని గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు మాయం చేస్తున్నారు. వీకర్ సెక్షన్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద మొత్తంలో భూములు కొల్లగొట్టారు. ఒకే ప్లాటుకు 2, 3 నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఒక్కో ప్లాటును రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది విద్యాసంస్థలు, గోశాలలు, అనాథాశ్రమాలు, ఇతర సామాజిక సేవల పేరుతో ఈ భూములను వందేళ్లకు లీజుకు తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. (క్లిక్ చేయండి: డీజీపీ రేసులో పోటాపోటీ!)
బోర్డును పునరుద్ధరించాలి...
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా సుమారు రూ. 19 కోట్లు అక్రమంగా వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. భూదాన్ భూములను కాపాడాలంటే బోర్డును పునరుద్ధరించడం ఒక్కటే పరిష్కారం.
– వెదిర అరవింద్‌రెడ్డి, అధ్యక్షుడు, సర్వసేవాసంఘ్ (అఖిల భారత సర్వోదయ మండల్)
మేమే పంచుతాం..
ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భూములు మాయమయ్యాయి. కబ్జాదారుల చెరలోని భూములను విడిపించాలి. కనీసం మిగిలిన భూములైనా ప్రభుత్వం పేదలకు పంచాలి. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలోనే భూపంపిణీ చేపడతాం.
– రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment