సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో ‘భూదాన్’భూముల గుట్టు తేలుతుందా..? దశాబ్దాలుగా పరిష్కారం దొరకని ఆ భూముల సమస్య ఓ కొలిక్కి వస్తుందా? పేదలకు సాగుభూమి ఇవ్వాలన్న నాటి మహనీయుల స్ఫూర్తికి తూట్లు పొడిచిన అక్రమార్కులు బయటికి వస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో దాదాపు 75 వేల ఎకరాలను కొందరు దొంగలు దర్జాగా చేజిక్కించుకున్నట్లు అంచనా. ఇప్పుడా భూమంతా బయటికి వస్తే.. అటు పేదలకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలకు అండగా ఉండేందుకు..
దున్నేవాడికి భూమి నినాదంతో ఆచార్య వినోభాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రం అండగా నిలిచింది. కమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం కూడా దానికి తోడ్పడింది. 1951లో అప్పటి నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వెదిరె రామచంద్రారెడ్డి సోదరుల ఔదార్యంతో ఇక్కడ మొదలైన భూదానోద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1965 వరకు కూడా కొనసాగింది. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 95 వేల ఎకరాల భూములను అప్పటి భూస్వాములు వితరణ చేశారు. అందులో ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 1,69,291.02 ఎకరాలను భూదాన యజ్ఞానికి ధారపోశారు. భూదాన యజ్ఞ బోర్డు లెక్కల ప్రకారం ఇందులో 94,794.89 ఎకరాలను పేదలకు పంచారు.
మిగతా 74,496.13 ఎకరాల భూమిలో.. 61,260 ఎకరాలు సాగుకు పనికిరాదని పేర్కొన్నారు. అయితే ఆ భూములు సాగుకు పనికిరావని ఎవరు తేల్చారో, ఆ భూమి ఎక్కడుందో, మిగతా 13,236 ఎకరాలను ఎందుకు పంచలేదో అనేదానిపై బోర్డు దగ్గర కూడా లెక్కల్లేవు. ప్రస్తుతం భూదాన బోర్డు వద్ద ఉన్న లెక్కల ప్రకారం తమ వద్ద 4,500 ఎకరాల భూములే ఉన్నాయని చెబుతోంది. ఈ లెక్కన సాగుకు పనికివచ్చే భూమిలోనూ మిగతా 9వేల ఎకరాలు ఏమయినట్లనేది ప్రశ్నార్థకంగా మారింది.
హెచ్‌ఎండీఏ పరిధిలోనే వేల ఎకరాలు
జాడ తెలియకుండా పోయిన 74,496 ఎకరాల భూదాన్ భూముల్లో చాలా వరకు హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని వందల ఎకరాల భూములపై కోర్టు కేసులు నడుస్తున్న సమయంలో.. అవి భూదాన భూములని తేలుతోంది. అసలు భూదాన్ భూముల్లో కనీసం 20 వేల ఎకరాల మేర ‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)’పరిధిలోనే ఉంది. ప్రస్తుతం ఈ భూములు అత్యంత విలువైనవి. మరి హెచ్‌ఎండీఏ పరిధిలోని ఈ భూదాన్ భూముల వివరాలు భూరికార్డుల ప్రక్షాళనలో తేలుతాయా అన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు అసలు రైతులకు పంచినట్టు చెబుతున్న 94,794 ఎకరాలు కూడా లబ్ధిదారుల చేతిలోనే ఉన్నాయా, భూమి లేని పేదలే వాటిని అనుభవిస్తున్నారా, అక్రమార్కుల పరం అయ్యాయా అన్నదీ తేలాల్సి ఉంది.
రంగాపూర్ వ్యథ ఇది..
పూర్వపు నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్ గ్రామాన్ని పరిశీలిస్తే... ఇక్కడ 800 ఎకరాల భూములను పేదలకు భూదాన్ కింద పంచారు. 80వ దశకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నార్నె రంగారావు అనే రిటైర్డ్ మిలటరీ అధికారి అక్కడ వాలాడు. మోసపూరిత ఎత్తుగడలతో మొత్తం 800 ఎకరాలను చేజిక్కించుకుని.. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడు. నామమాత్రపు ధరకు భూములు అమ్ముకున్న రైతులు తర్వాత నోళ్లు వెళ్లబెట్టగా.. రంగారావు మాత్రం కోట్లు జేబులో వేసుకున్నాడు. ఇదేమని అడిగితే అటు ప్రభుత్వాన్ని, ఇటు భూదాన బోర్డును, గ్రామస్తులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. నల్లగొండ జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు సుపరిచితం కావడం గమనార్హం. పేదలకు పంచిన భూదాన భూముల్లో ఇలాంటి ఎన్ని రంగాపూర్‌లు ఉన్నాయో తేలాల్సి ఉంది.
డబుల్ బెడ్‌రూం బెంగ తీరుతుంది!
హెచ్‌ఎండీఏ పరిధిలోని 20 వేల ఎకరాల భూదాన్ భూముల లెక్క తేలితే రాష్ట్ర ప్రభుత్వానికి, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరమయ్యే అవకాశముంది. భూదాన్ భూముల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆలోచన చేసింది. ఈ మేరకు భూదన్ భూముల లెక్కలు తేల్చాలని గతంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది కూడా. జిల్లాల యంత్రాంగం ఆ పనిలో ఉన్న తరుణంలోనే... భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూదాన్ భూముల సమస్యను తేలుస్తుందా, అలాగే వదిలేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment