ఇందిరాపార్కు వద్ద అభివాదం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా తదితరులు
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మౌనం వీడి భూదాన్ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ భూములను ప్రభుత్వం పంపిణీ చేయకపోతే తామే వాటిని ఆక్రమించి నిరుపేదలకు పంచుతామని ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మార్చి 17 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. సోమవారం అఖిల భారత సర్వసేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భూదాన్ భూములను భూములు లేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద నిరుపేదలతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో పాల్గొన్న చాడ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ఆచార్య వినోబాభావే భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాలను విరాళంగా సేకరించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూదాన్ భూములను పరిరక్షించకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే ఎన్ని భూదాన్ భూములు కబ్జాకు గురయ్యాయో పూర్తి ఆధారాలతో ఇస్తామన్నారు.
అనంతరం అఖిల భారత సర్వసేవా సంఘం జాతీయ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ పేద ప్రజలు భూమి విముక్తి కోసం పోరాడుతుంటే వారికి అండగా ఉండకుండా సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వినోబా భావే, మొద టి భూదాత రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అ«ధ్యక్షుడు శంకర్‌నాయక్, ట్రస్టీ షేక్‌హుస్సేన్, సంఘ సేవకులు కృష్ణప్రసాద్, సీపీఐ నగర కార్యదర్శి నర్సింహ తదితరులతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment