- ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు
- రాజధాని ప్రకటనతో భూ సేకరణకు ఉడా కసరత్తు
సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించి రాష్ట్రంలోనే అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా పేరున్న వీజీటీఎం ఉడాను మొదటి నుంచి భూ సమస్య వేధిస్తోంది. ఆదాయం ఉన్నప్పటికీ భూమి లేకపోవడంతో ఉడా ప్రణాళికలు సిద్ధం చేసిన పెద్దపెద్ద ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో భూ సమస్యను అధిగమించేందుకు ఉడా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉడాకు బకాయిలు ఉన్న పలు ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల నుంచి నిధులకు బదులుగా భూమి ఇవ్వాలని కోరాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఎక్కువగా బకాయిలున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. ఉడా ఆశించిన రీతిలో బకాయిలకు బదులు భూములు ఇస్తే తక్షణమే 100 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. మరోవైపు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు సహకరించాలని రెండు జిల్లాల కలెక్టర్లు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్లకు ఉడా అధికారులు విన్నవించారు.
ఉడా భూములు, అప్పులు ఇవే..
రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, 1,400కు పైగా గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడాకు తాడేపల్లి మండలంలోని అమరావతి టౌన్‌షిప్‌లో 45 ఎకరాల భూమి ఉంది. గన్నవరం ఐటీ పార్కు సమీపంలో 7.23 ఎకరాల భూమి ఉంది. ఈ రెండు మినహా ఉడాకు ఎక్కడా భూములు లేవు. ఉడాకు రూ.160 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం రూ.25 కోట్ల డెవలప్‌మెంట్ చార్జీలు, పెనాల్టీ రుసుము రూపంలో రూ.5కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. మరో రూ.80 వరకు పాత బకాయిలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి రూ.70 కోట్ల వరకు రావాల్సి ఉంది. నగరపాలక సంస్థ 1992 నుంచి ఉడాకు బకాయిలు చెల్లించటం లేదు. బకాయిలు చెల్లించాలని పది సార్లకు పైగా నగరపాలక సంస్థకు లేఖలు రాశారు. ఫలితం లేకపోవటంతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుడివాడ, నూజివీడు మున్సిపాలిటీ లు కూడా ఉడాకు పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నాయి.
భూమి కోరుతూ విజయవాడ కమిషనర్‌కు లేఖ
బకాయిలకు బదులు భూమి కేటాయించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. గతంలో ఏర్పాటు చేసిన జక్కంపూడి హౌసింగ్ లే అవుట్‌కు సంబంధించి ఉడాకు నగరపాలక సంస్థ కోటి రూపాయలు బకాయి పడింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలు చెల్లించే అవకాశం లేదు. ఈ క్రమంలో జక్కంపూడి హౌసింగ్ లే అవుట్ బకాయికి బదులుగా కోటి రూపాయల విలువ చేసే నగరపాలక సంస్థ భూమిని కేటాయించాలని లేఖ రాశారు. ఇదే పద్ధతిలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించాలని ఉడా అధికారులు భావిస్తున్నారు.
1,500 ఎకరాల భూమి అవసరం
ప్రస్తుతం ఉడా అధికారులు రూ.1,400 కోట్లతో పలు అభివృద్ధి పనులు, మెగా ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆమోద ముద్ర కోసం ప్రభుత్వానికి పంపారు. అయితే ఆయా ప్రాజెక్టులకు కనీసం 1,500 ఎకరాల భూమి అవసరం. ప్రభుత్వం కొంత భూమి కేటాయించినా, వివిధ మార్గాల్లో సొంతగా మిగిలిన భూమిని సమకూర్చుకునేందుకు ఉడా ప్రయత్నిస్తోంది.
అలోచిస్తున్నాం : ఉడా వీసీ
అన్ని శాఖలు, మున్సిపాలిటీల నుంచి బకాయిలకు బదులు భూములు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నామని వీజీటీఎం ఉడా వీసీ పి.ఉషాకుమారి ‘సాక్షి’కి తెలిపారు. జక్కంపూడి లే అవుట్‌కు సంబంధించి తమకు రావల్సిన రూ.కోటి బదులు భూమిని కోరామని చెప్పారు. ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు.