Land Bank
-
బంపర్ ఆఫర్
ల్యాండ్ బ్యాంక్‌లో ప్రభుత్వ భూములు చేర్చితే నజరానా..! తహసీల్దార్లకు మెడల్, రూ. పదివేల నగదు పురస్కారం మూడు కేటగిరీలుగా ల్యాండ్ పార్శిళ్ల విభజన ప్రభుత్వ భూములపై ప్రొఫార్మాలతో నివేదిక హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌లో గల భూముల పరిరక్షణతో పాటు, నమోదు కాని ప్రభుత్వ భూములపై సైతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా దృష్టి సారించారు. ల్యాండ్ బ్యాంక్‌లో అదనంగా ప్రభుత్వ భూములు చేర్చితే సద తహసీల్దార్లకు నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. పదివేల నగదుతోపాటు ఉత్తమ మెడల్‌తో గణతంత్ర దినోత్సవం రోజు సన్మానిస్తామని ప్రకటించారు. వెబ్‌ల్యాండ్‌లో చేర్చేందుకు వీలుగా అదనంగా ప్రభుత్వ భూములను గుర్తించిన షేక్‌పేట, బండ్లగూడ తహసీల్దార్లను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న భూముల పరిరక్షణ బాధ్యత తహసీల్దార్లదేననని స్పష్టంచేశారు. గురువారం ఆమె భూముల పరిరక్షణపై జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మదన్ మోహన్, ఆర్డీఓ చంద్రకళలతో కలిసి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ల్యాండ్ బ్యాంక్‌ను రక్షించాలని,. ప్రభుత్వ భూములను పెంచేందుకు తహసీల్దార్లు కృషి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ బ్యాంక్‌లో ని పార్సిళ్లను ఎ,బి,సి,డి కేటాగిరీలుగా విభజించి నిర్ణీత ప్రొఫార్మా రూపొందించాలని సూచించారు. ఇందులో కేటగిరి ఏ కింద లిటిగేషన్ లేని 121 ఖాళీ స్ధలాలు వివరాలను తహసీల్దార్లు స్వయంగా తనిఖీ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా ఫోటోలు, స్కెచ్లను తయారు చేసి ఈ నెల 16న జరిగే సమీక్షా సమావేశంలో అందజేయాలన్నారను. తనిఖీ సమయంలో ఆ ల్యాండ్ పార్సిల్స్‌లో ప్రభుత్వ భూమి అనే బోర్డు ఉందా..? ఫెన్సింగ్ ఉందా? అనే విషయాలు పరిశీలించి లేని పక్షంలో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ఖాళీ స్థలాలను బి కేటగిరి కింద చేర్చి ఆ ల్యాండ్ పార్సిల్‌కు సంబంధించిన కోర్టు కేసులు వాటి స్థితి వివరాలు ప్రొఫార్మాలో పొందుపరచాలన్నారు. లిటిగేషన్ భూముల తనిఖీ బాధ్యతలను వీఆర్వో, వీఆర్ఏలకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్‌ను తయారు చేసుకోవాలన్నారు. ఆక్రమణల తొలగింపు తప్పనిసరి ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు గుర్తించిన పక్షంలో వెంటనే ఆ వివరాలను తహసీల్దార్ల ద్వారా ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగానికి తెలియజేసి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ పార్సిళ్లలో కట్టడాలను సీ కింద గుర్తించి వాటిని తహసీల్దార్లు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని, ఎంత విస్తీర్ణం మేర నిర్మాణాల ఉన్నాయి, ఖాళీ స్థలం వివరాలతో నివేదిక సిద్ధం చేసి ఈనెల 23న జరిగే సమావేశంలో అందజేయాలన్నారు. ఇందుకు సంబందించి అవసరమైన ఫార్మాట్‌ను డిజైన్ చేసి పంపనున్నట్లు తెలిపారు. త్వరలో తహసీల్దార్ ఆఫీసుల తనిఖీ తహసీల్దార్ ఆఫీసులను త్వరలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకు మందు ఈ నెల 11 నుంచి అ«ధికారుల బృందం సందర్శించి రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. సుమారు 259 మంది ఉద్యోగులు వేలి ముద్రలు నమోదు చేయడం లేదని, డిప్యూటేషన్‌పై ఉన్న సిబ్బంది సంబంధిత కార్యాలయాల్లో వేలిముద్రలను నమోదు చేసుకోవాలని సూచించారు. -
కార్పొరేట్ల కోసమే ల్యాండ్ బ్యాంక్
- జీవో 155 ఉపసంహరించుకోవాలి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ విజయవాడ కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే రాష్ర్టంలో 10లక్షల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పేదలు, దళితుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 155ను ఉపసంహరించుకోవాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీవో నంబర్ 155ద్వారా పేదలు, దళితుల వద్ద అసైన్డ్ భూములను నామమాత్రపు రేటు ఇచ్చి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో 1.5రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో 1.25 రెట్లు, అదనంగా 12శాతం చెల్లించి భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయా నిబంధనలను తుంగలో తొక్కి బేసిక్ విలువ చెల్లింపు పేరుతో పేదల భూములు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను చేపడితే ప్రజా ఉద్యమం ద్వారా ప్రతిఘటిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. -
భలే భూగోతం..!
ల్యాండ్ బ్యాంకు పేరిట భూముల గుర్తింపు-ఆపై లాక్కునేందుకు ఎత్తుగడ భూ కామందుల చేతుల్లో ఉన్న భూమి ఊసెత్తని యంత్రాంగం ఏడు విడతల్లో పంపిణీ చేసిన భూమే సింహభాగం ఫారెస్ట్ల్యాండునూ ల్యాండ్బ్యాంకులో పొందుపరిచి గందర గోళం చేస్తున్న ప్రభుత్వం మాకు దిక్కెవరంటున్న హరిజన, గిరిజనులు విజయనగరం కంటోన్మెంట్: హరిజన, గిరిజనుల సంక్షేమానికి విడుదల చేస్తున్న వందల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు వారు అనుభవిస్తున్న భూములకూ రెక్కలొస్తున్నాయి. ల్యాండు బ్యాంకు పేరుతో డిపట్టాలను లాక్కునేందుకు ప్రభుత్వమే పన్నాగం పన్ను తోంది. ఇప్పటికే భూ కామందుల ఆక్రమణలతో అల్లాడిపోతున్న నిరుపేదలపై ఏకంగా ప్రభుత్వమే ల్యాండ్ బ్యాంకును తెరిచి పేదోళ్ల భూములను పారిశ్రామిక వేత్తలకు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట పందేరం చేసేందుకు పక్కా ప్రణాళికను రచించింది. అధికారులపై ఒత్తిడి భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం డిపట్టా భూములపై కన్నేసింది. ల్యాండ్‌బ్యాంకు పేరిట ఒక చోట చేర్చి ఉంచింది. ఎప్పుడైనా ఆ భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో వేలాది మంది నిరుపేద డిపట్టాదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 37,923.17 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకు కింద పోగేశారు. ఈ భూమిని సాగు చేస్తున్న వారికి నోటిఫికేషన్, నోటీసులు ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఇందు కోసం కలెక్టర్, రెవెన్యూ అధికారులతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి వారిపైనా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు పేదవారికిచ్చిన డిపట్టా భూములను కేటగిరీలుగా విభజించి వాటిని పార్శిళ్లుగా వర్గీకరించారు. జిల్లాలో ఒకటి నుంచి 50 ఎకరాలు ఒక కేటగిరీగా, 51 నుంచి 100 ఎకరాలు ఒక కేటగిరిగా, వంద ఎకరాలనుంచి ఆపైన ఉన్న భూములను మూడో కేటగిరీగా విభజించారు. జిల్లాలోని 34 మండలాల్లో 79 చోట్ల 818 పార్శిళ్లుగా విభజించారు. మహానేత ఆశయానికి తూట్లు: గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న వారికి పట్టాలు అందజేశారు. గతంలో ఏడు విడతల భూపంపిణీల్లో కలిపి 56,622 మందికి 69,476 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో 12057 మంది ఎస్సీలకు 13959 ఎకరాలు, 22701 మందికి 33,760.52 ఎకరాలను పంపిణీ చేశారు. మిగతా భూమి బీసీలు, ఓసీలకు పంపిణీ చేశారు. అయితే ఓసీ, బీసీలు మినహా ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో సింహభాగం ప్రస్తుతం చేతులు మారి పలువురి వద్ద ఉంది. వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయని ప్రభుత్వం పేదల చేతుల్లోని భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇలా డి పట్టాలను పొందిన వారి భూములను కూడా లాక్కునేందుకు ల్యాండ్ బ్యాంకులో పొందుపరచడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు పోరాడేందుకు నడుం బిగిస్తున్నాయి. ఫారెస్ట్ భూములు కూడా..ల్యాండ్ బ్యాంకు పేరిట ప్రభుత్వం అటవీ భూములను కూడా పొందుపరిచింది. డిపట్టాలు ఇచ్చాక వారికి భూమి ఎక్కడ ఉందో చూపించేందుకు సబ్ డివిజన్ చేయలేదు. జిల్లాలో 8 వేల ఎకరాలుంటుంది.ఎవరి భూమి ఏదో తెలియకముందే వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక రచించడం దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు -
ల్యాండ్ బ్యాంక్‌పై జల్లెడ
నూతన పరిశ్రమల స్థాపన కోసం ఇప్పటికే గుర్తించిన భూముల (ల్యాండ్ బ్యాంక్) స్థితిగతులను మరోమారు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.45 లక్షల ఎకరాల భూమిని గుర్తించి పరిశ్రమలకు అనువుగా అభివృద్ధి చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థకు (టీఎస్ఐఐసీ) అప్పగించింది. అయితే ఈ ల్యాండ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పరిశ్రమల స్థాపనకు అనువుగా లేదని పరిశ్రమల శాఖ భావిస్తోంది. హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1.45 లక్షల ఎకరాలను గుర్తించి గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా ల్యాండ్ బ్యాంక్‌ను గత జూన్‌లో టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. చదునుగా వున్న భూములను ‘ఏ’ కేటగిరీగాను, చిన్న దిబ్బలతో కొంత చదునుగా ఉన్న భూములను ‘బీ’ కేటగిరీలో, కొండలు, దిబ్బలతో కూడిన వాటిని ‘సీ’లో చేర్చారు. ఈ భూముల్లో పరిశ్రమలకు అవసరమైన అప్రోచ్‌రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, కాలుష్య జలాల శుద్ధీకరణ ప్లాంట్లు తదితర మౌలిక సౌకర్యాలను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అనువైన భూముల కోసం వెతుకులాట ఈ భూముల్లో మూడింట రెండొంతులు బీ, సీ కేటగిరీలవే. కనీసం రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలను కూడా ల్యాండ్ బ్యాంక్ కింద చూపడంతో మౌలిక సౌకర్యాల కల్పన అసాధ్యమని టీఎస్ఐఐసీ భావిస్తోంది. వీటికోసం పెద్దఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందనీ, వ్యయ ప్రయాసల కోర్చి సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం ఉంది. ల్యాండ్ బ్యాంక్‌లో కొన్ని భూములు రిజర్వు ఫారెస్టు పరిధిలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఐఐసీకి అప్పగించిన భూములపై పూర్తి స్థాయిలో సర్వే చేసే బాధ్యతను రాష్ట్ర భూ పరిపాలన విభాగం కమిషనరేట్‌కు (సీసీఎల్ఏ) అప్పగించారు. ల్యాండ్ బ్యాంక్‌ను జల్లెడపట్టి నివేదిక సమర్పించేందుకు సీసీఎల్ఏ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాతే పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయాలని టీఎస్ఐఐసీ భావిస్తోంది. గత కేటాయింపులపైనా దృష్టి గతంలో జరిపిన కేటాయింపులపైనా పరిశ్రమల శాఖ దృష్టి పెట్టింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్కుల్లో గతంలో కేటాయింపులు పొందినా నేటికీ పరిశ్రమలు స్థాపించకపోవడంతో భూమి నిరుపయోగంగా ఉంది. ఇలా సుమారు 10 వేల ఎకరాలు వృథాగా పడిఉన్నట్లు అంచనా. భూములు పొంది పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులిచ్చి, స్పందించని వారి నుంచి భూమి తిరిగి స్వాధీనం చేసుకుని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. -
చట్టంతో కొట్టేద్దాం..
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి పెద్దఎత్తున భూములను సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రైతుల నుంచి కారుచౌకగా భూములను స్వాధీనం చేసుకోవడంపై దృష్టిని సారించారు. ఉన్నపళంగా భూములను సేకరించడానికి 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం అడ్డంకిగా మారుతోంది. అన్ని చోట్లా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చట్టంలో సవరణలు చేసి, రైతులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. 2013 భూ సేకరణలో అడ్డంకులను అధిగమించడం, నామమాత్రపు పరిహారం చెల్లించి భూములను సేకరించడం కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని ఈ కొత్త చట్టాన్ని చేసే పనిలో పడింది. తమిళనాడు తరహాలో భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని అధ్యయనం చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)ను, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలు, రహదారులకు అవసరమైన భూములను ఏకపక్షంగా సేకరించడం కోసం ఏడాదిపాటు అమల్లో ఉండేలా తమిళనాడు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. భూసేకరణ చట్టంలోని ఒక క్లాజు ఆధారంగా ఈ సవరణలు చేసింది. భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, 80 శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూసేకరణ చేయాలని, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర భూ సేకరణ చట్టంలో నిర్దేశించారు. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఏడాదిపాటు కేంద్ర భూ సేకరణ చట్టంలోని నిబంధనలను మినహాయిస్తూ సవరణలు చేపట్టింది. తద్వారా పరిశ్రమల కోసం రైతుల నుంచి ఏకంగా 53 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భూ సేకరణ చట్టంలో సవరణలు తీసుకువచ్చి రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. 2013 భూ సేకరణ చట్టమే ప్రస్తుతం అమల్లో ఉంది. అందులో సవరణలు తీసుకువస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ సేకరణ చేయాలంటే తొలుత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణకు మార్కెట్ విలువపై నాలుగింతల పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. అదే పట్టణ ప్రాంతాల్లో భూ సేకరణకు మార్కెట్ విలువ పై రెండింతల పరిహారం చెల్లించాలి. భూమి కోల్పోయిన రైతులకు ఇళ్లతోపాటు ఒకసారి అలవెన్స్ గానీ లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గానీ ఇవ్వాలి. ప్రైవేట్ సంస్థల కోసం భూ సేకరణ చేయాలంటే 80 శాతం మంది భూమి యజమానుల అంగీకారం ఉండాలి. ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్య ప్రాజెక్టులకైతే 70 శాతం మంది భూమి యజమానుల అంగీకారం అవసరం. వీటన్నింటినీ లెక్కచేయకుండా తమిళనాడు ప్రభుత్వం పరిశ్రమలు, రహదారుల కోసం భూ సేకరణ చట్టంలో సవరణలు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. పరిశ్రమల కోసమే 10 లక్షల ఎకరాలను సేకరించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు భూ సేకరణ చట్టం అత్యుత్తమంగా ఉందని ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘ల్యాండ్ బ్యాంకు’ సిద్ధం
జగిత్యాల : ప్రతీ జిల్లాలో ఫారెస్ట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. అంతరించిపోతున్న అడవుల స్థానంలో కొత్తగా గ్రీనరీ అభివృద్ధితోపాటు పలు చోట్ల పరిశ్రమల కోసం తీసుకునే అటవీశాఖ భూముల స్థానంలో ఈ భూముల ను అటవీశాఖకు అప్పగించనున్నారు. ల్యాండ్ బ్యాం కు ఆఫ్ ఫారెస్ట్ కోసం అవసరమైన భూమి సేకరించాలని సర్కార్ జిల్లా అధికారులను ఆదేశించింది. రెండు రకాలుగా... జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, పరిశ్రల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం భూ సేకరణ జరపాలని ఆదేశించింది. జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాల భూమిని సేకరించారు. జిల్లాలో 3,69,311 ఎకరాల భూమిని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. ఏ, బీ కేటగిరీ భూములను పరిశ్రమలు, భూపంపిణీకి తీసుకోనున్నారు. సీ, డీ భూముల్లో అడవులు పెంపకానికి వినియోగించాలని అలోచిస్తున్నారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలు, మంచినీటి పథకాలకు, రోడ్ల విస్తరణకు పలు ప్రాంతాల్లో ఫారెస్టు భూములు తీసుకునే అవకాశముంది. తీసుకున్న ఆటవీశాఖ భూముల స్థానంలో సీ, డీ కేటగిరీ భూములను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సీ, డీ కేటగిరీ భూములివి... జిల్లాలో ‘సీ’ కేటగిరీలో 28,430 ఎకరాలు, ‘డీ’ కేటగిరీలో 3,13,220 ఎకరాలు సేకరించారు. ప్రధానంగా ‘డీ’ కేటగిరీలో గుట్టలు, బండరాళ్లు ఉన్న భూమిగా ఉంది. ‘సీ’ కేటగిరీలో భూమితోపాటు బండరాళ్లు ఉన్నట్లుగా అధికారులు రికార్డులు తయారుచేశారు. జిల్లాలో అవసరమైతే అటవీశాఖకు కేటాయించడానికి సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ,7406 ఎకరాలు, జగిత్యాలలో 1,20,390 ఎకరాలు, మంథనిలో 32,352 ఎకరాలు, పెద్దపల్లిలో 61,894 ఎకరాలు, కరీంనగర్లో 29,965 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు. మొక్కల పెంపకానికి... రాబోయే సంవత్సరం నుంచి హరితతోరణం కింద లక్షలాది మొక్కలను పెంచడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో మొక్కలు పెంపకానికి గ్రామాలతోపాటు గ్రామ శివారుల్లో ఉన్న గుట్టలు, ఆడవులప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా మొక్కలు పెంచడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశారు. ఖాళీస్థలం ఎక్కడున్నా మొక్కలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికంగా జగిత్యాల డివిజన్‌లోనే... జిల్లాలో ఎక్కువగా సీ, డీ కేటగిరీలకు చెందిన భూమి జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే ఉంది. ఈ మేరకు డివిజన్లో ‘సీ’ కేటగిరీలో 14,176 ఎకరాలు, డీ కేటగిరీలోలో 1,43,616 ఎకరాల భూమి డివిజన్లో ఉంది. ఈ భూముల్లో అటవీశాఖకు కేటాయించడానికి అనువుగా 14,300 ఎకరాల భూమిని తొలి విడతగా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్డీవో ఎస్.పద్మాకర్ జిల్లా కలెక్టర్‌కు నివేదిక తయారు చేశారు. -
బకాయిలొద్దు.. భూములివ్వండి
ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు రాజధాని ప్రకటనతో భూ సేకరణకు ఉడా కసరత్తు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించి రాష్ట్రంలోనే అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా పేరున్న వీజీటీఎం ఉడాను మొదటి నుంచి భూ సమస్య వేధిస్తోంది. ఆదాయం ఉన్నప్పటికీ భూమి లేకపోవడంతో ఉడా ప్రణాళికలు సిద్ధం చేసిన పెద్దపెద్ద ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో భూ సమస్యను అధిగమించేందుకు ఉడా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉడాకు బకాయిలు ఉన్న పలు ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల నుంచి నిధులకు బదులుగా భూమి ఇవ్వాలని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కువగా బకాయిలున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. ఉడా ఆశించిన రీతిలో బకాయిలకు బదులు భూములు ఇస్తే తక్షణమే 100 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. మరోవైపు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు సహకరించాలని రెండు జిల్లాల కలెక్టర్లు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్లకు ఉడా అధికారులు విన్నవించారు. ఉడా భూములు, అప్పులు ఇవే.. రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, 1,400కు పైగా గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడాకు తాడేపల్లి మండలంలోని అమరావతి టౌన్షిప్లో 45 ఎకరాల భూమి ఉంది. గన్నవరం ఐటీ పార్కు సమీపంలో 7.23 ఎకరాల భూమి ఉంది. ఈ రెండు మినహా ఉడాకు ఎక్కడా భూములు లేవు. ఉడాకు రూ.160 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రూ.25 కోట్ల డెవలప్మెంట్ చార్జీలు, పెనాల్టీ రుసుము రూపంలో రూ.5కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. మరో రూ.80 వరకు పాత బకాయిలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి రూ.70 కోట్ల వరకు రావాల్సి ఉంది. నగరపాలక సంస్థ 1992 నుంచి ఉడాకు బకాయిలు చెల్లించటం లేదు. బకాయిలు చెల్లించాలని పది సార్లకు పైగా నగరపాలక సంస్థకు లేఖలు రాశారు. ఫలితం లేకపోవటంతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుడివాడ, నూజివీడు మున్సిపాలిటీ లు కూడా ఉడాకు పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నాయి. భూమి కోరుతూ విజయవాడ కమిషనర్‌కు లేఖ బకాయిలకు బదులు భూమి కేటాయించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. గతంలో ఏర్పాటు చేసిన జక్కంపూడి హౌసింగ్ లే అవుట్‌కు సంబంధించి ఉడాకు నగరపాలక సంస్థ కోటి రూపాయలు బకాయి పడింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలు చెల్లించే అవకాశం లేదు. ఈ క్రమంలో జక్కంపూడి హౌసింగ్ లే అవుట్ బకాయికి బదులుగా కోటి రూపాయల విలువ చేసే నగరపాలక సంస్థ భూమిని కేటాయించాలని లేఖ రాశారు. ఇదే పద్ధతిలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించాలని ఉడా అధికారులు భావిస్తున్నారు. 1,500 ఎకరాల భూమి అవసరం ప్రస్తుతం ఉడా అధికారులు రూ.1,400 కోట్లతో పలు అభివృద్ధి పనులు, మెగా ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆమోద ముద్ర కోసం ప్రభుత్వానికి పంపారు. అయితే ఆయా ప్రాజెక్టులకు కనీసం 1,500 ఎకరాల భూమి అవసరం. ప్రభుత్వం కొంత భూమి కేటాయించినా, వివిధ మార్గాల్లో సొంతగా మిగిలిన భూమిని సమకూర్చుకునేందుకు ఉడా ప్రయత్నిస్తోంది. అలోచిస్తున్నాం : ఉడా వీసీ అన్ని శాఖలు, మున్సిపాలిటీల నుంచి బకాయిలకు బదులు భూములు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నామని వీజీటీఎం ఉడా వీసీ పి.ఉషాకుమారి ‘సాక్షి’కి తెలిపారు. జక్కంపూడి లే అవుట్‌కు సంబంధించి తమకు రావల్సిన రూ.కోటి బదులు భూమిని కోరామని చెప్పారు. ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు భూమి రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్షణ కేటాయింపు నకు వీలుగా ఉన్న భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృందాలు ఇటీవల జిల్లాలో పర్యటించి ఎంపిక చేసిన భూములను పరిశీలించి వెళ్లాయి. సుమారు నెల రోజుల పాటు జిల్లాలో భూములను సర్వే చేసి 13.439 ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్నట్లు తేల్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగం ద్వారా బుధవారం నివేదిక కూడా సమర్పించారు. అధికారులు సమర్పించిన ఈ నివేదికపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. తాజాగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యతపై ఆరా తీసేందుకు సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలంటూ రెవెన్యూ విభాగానికి తొలుత 34,184.59 ఎకరాలు వివరాలు అప్పగించారు. వీటిలో 16,723.07 ఎకరాల భూమి అనువుగా లేదని సర్వేలో తేల్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న 13,439 ఎకరాల్లో 2301.71 ఎకరాలు సమతల భూమి, 3802.49 ఎకరాలు చిన్నపాటి కొండలు, గుట్టలు, 7335.50 ఎకరాలు కొండలతో కూడి ఉన్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోనే అధికం అత్యధికంగా మహబూబ్‌నగర్ డివిజన్లో 13వేల ఎకరాలకు పైగా భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంది. గద్వాల డివిజన్ పరిధిలో కేవలం 10.36 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్, అటవీ, శిఖం భూముల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలోనూ భూమిని గుర్తించినా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తారని టీఐఐసీ అంచనా వేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని టీఐఐసీ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. హైదరాబాద్- బెంగళూరు మార్గంలో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై ఆసక్తి నెలకొంది. -
25,117 ఎకరాలు సిద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పారిశ్రామికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐటీ ఆధారిత, ఫార్మా, బల్క్‌డ్రగ్, సినీ పరిశ్రమల స్థాపనకు తగినంత ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తోంది. పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు వీలుగారంగారెడ్డి జిల్లాలో తక్షణ కేటాయింపులకు అనువుగా ఉన్న భూములను గుర్తించింది. తెలంగాణ రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ) జిల్లాలో 25,117 ఎకరాల మేర భూమి అందుబాటులో ఉన్నట్లు లెక్క తేల్చింది. నెలరోజులుగా ప్రభుత్వ భూములను సర్వే చేసిన టీఐఐసీ యంత్రాంగం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ను విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోంది. ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమల స్థాపనను సరళతరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వివాదరహిత భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. 10,852 ఎకరాల మిగులు భూమి గుర్తింపు గతంలో వివిధ పరిశ్రమలకు, బడా కంపెనీలకు జిల్లాలో 39వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పారిశ్రామిక అవసరాలకు పోను దీంట్లో సుమారు 10,852 ఎకరాల మేర మిగిలి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్కతీసింది. ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్న ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అదే సమయంలో పెట్టుబడులపై గంపెడాశలు పెట్టుకున్న ప్రభుత్వం.. భూ ల భ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల వద్ద వృధాగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడమేగాకుండా మరింత భూమిని సేకరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారగణం జిల్లాలో 63,726 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిగ్గు తేల్చింది. దీంట్లో చాలావరకు కొండలు, గుట్టలతో నిండిఉన్నట్లు గుర్తించింది. వీటిని మైనింగ్‌కు ఇస్తే బాగుంటుందని యంత్రాంగం ప్రభుత్వానికి సూచించింది. అదనంగా 14,265 ఎకరాలు ఇప్పటివరకు ఎవరికీ కేటాయించని ప్రభుత్వ భూమి 4,300 ఎకరాలు ఉన్నట్లు తేల్చిన యంత్రాంగం... జిల్లావ్యాపం్తగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ భూముల జాబితాను రూపొందించింది. దీంతో జిల్లాలో 63,726 ఎకరాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంట్లో పరిశ్రమల స్థాపనకు యోగ్యమైన భూములపై టీఐఐసీ ప్రత్యేకంగా సర్వే నిర్విహ ంచింది. తొలి దశ లో 6,706.34 ఎకరాలు గుర్తించిన టీఐసీసీ, మలివిడతలో 7,559.29 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 25,117 ఎకరాలు తక్షణ కేటాయింపులకు అనువుగా ఉందని, దీనికి అదనంగా ఇప్పటివరకు ఎవరికి కేటాయించని వివాదరహిత భూమి 4,300 ఎకరాల మేర అందుబాటులో ఉందని గుర్తించింది. అయితే, టీఐసీసీ గుర్తించిన భూమి అధికశాతం కుల్కచర్ల, యాచారం, మర్పల్లి, బషీరాబాద్, బంట్వారం, యాలాల తదితర మారుమూల మండలాల్లోనే ఉండగా.. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనువైనది కాకపోవడం గమనార్హం. నగర శివార్లలో మాత్రం భూ లభ్యత లేకపోవడం అధికార యంత్రాంగానికి ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం, కృష్ణాజలాలు, తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికసంస్థలు ముందుకొస్తాయని, మారుమూల ప్రాంతాల్లో వందల ఎకరాలు కేటాయించిన ఫలితం శూన్యమేననే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన బాలానగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ మండలాలతో పాటు గ్రామీణ మండలాలైన దోమ, కుల్కచర్ల, బషీరాబాద్ మండలాల్లో పరిశ్రమలకు అనువుగా ఒక ఎకరా కూడా తేలకపోవడం గమనార్హం.