నూతన పరిశ్రమల స్థాపన కోసం ఇప్పటికే గుర్తించిన భూముల (ల్యాండ్ బ్యాంక్) స్థితిగతులను మరోమారు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.45 లక్షల ఎకరాల భూమిని గుర్తించి పరిశ్రమలకు అనువుగా అభివృద్ధి చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థకు (టీఎస్‌ఐఐసీ) అప్పగించింది. అయితే ఈ ల్యాండ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పరిశ్రమల స్థాపనకు అనువుగా లేదని పరిశ్రమల శాఖ భావిస్తోంది.
హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1.45 లక్షల ఎకరాలను గుర్తించి గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా ల్యాండ్ బ్యాంక్‌ను గత జూన్‌లో టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. చదునుగా వున్న భూములను ‘ఏ’ కేటగిరీగాను, చిన్న దిబ్బలతో కొంత చదునుగా ఉన్న భూములను ‘బీ’ కేటగిరీలో, కొండలు, దిబ్బలతో కూడిన వాటిని ‘సీ’లో చేర్చారు. ఈ భూముల్లో పరిశ్రమలకు అవసరమైన అప్రోచ్‌రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, కాలుష్య జలాల శుద్ధీకరణ ప్లాంట్లు తదితర మౌలిక సౌకర్యాలను టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
అనువైన భూముల కోసం వెతుకులాట
ఈ భూముల్లో మూడింట రెండొంతులు బీ, సీ కేటగిరీలవే. కనీసం రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలను కూడా ల్యాండ్ బ్యాంక్ కింద చూపడంతో మౌలిక సౌకర్యాల కల్పన అసాధ్యమని టీఎస్‌ఐఐసీ భావిస్తోంది. వీటికోసం పెద్దఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందనీ, వ్యయ ప్రయాసల కోర్చి సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం ఉంది. ల్యాండ్ బ్యాంక్‌లో కొన్ని భూములు రిజర్వు ఫారెస్టు పరిధిలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌ఐఐసీకి అప్పగించిన భూములపై పూర్తి స్థాయిలో సర్వే చేసే బాధ్యతను రాష్ట్ర భూ పరిపాలన విభాగం కమిషనరేట్‌కు (సీసీఎల్‌ఏ) అప్పగించారు. ల్యాండ్ బ్యాంక్‌ను జల్లెడపట్టి నివేదిక సమర్పించేందుకు సీసీఎల్‌ఏ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాతే పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయాలని టీఎస్‌ఐఐసీ భావిస్తోంది.
గత కేటాయింపులపైనా దృష్టి
గతంలో జరిపిన కేటాయింపులపైనా పరిశ్రమల శాఖ దృష్టి పెట్టింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్), పారిశ్రామిక పార్కుల్లో గతంలో కేటాయింపులు పొందినా నేటికీ పరిశ్రమలు స్థాపించకపోవడంతో భూమి నిరుపయోగంగా ఉంది. ఇలా సుమారు 10 వేల ఎకరాలు వృథాగా పడిఉన్నట్లు అంచనా. భూములు పొంది పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులిచ్చి, స్పందించని వారి నుంచి భూమి తిరిగి స్వాధీనం చేసుకుని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు.