బైరామల్‌గూడ రెండో లెవెల్ ఫ్లైఓవర్‌ను
ఈ నెల 8న సీఎం ప్రారంభించే అవకాశం..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్‌లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్‌బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది.
అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్‌బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్‌ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్‌సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే.
బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా..
నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్.
ప్రయాణ మార్గం..
ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment