తుది దశలో బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ పనులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్‌డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి.
బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు.
చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం
బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్‌డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్‌ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
బైరామల్ గూడ ఫ్లై ఓవర్..
అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు
ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు
వెడల్పు :12.50 మీటర్లు
లేన్లు : 3
ప్రయాణం : ఒక వైపు
Comments
Please login to add a commentAdd a comment