Underpass
-
అండర్‌పాస్ వరదలో కారు చిక్కుకొని.. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మృతి
గురుగ్రామ్: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి, అనేక వీధులు, దారులు జలమయమయ్యాయి. అయితే హర్యానాలో భారీ వర్షానికి ఫరీదాబాద్‌లోని అండర్‌పాస్‌లో వరద నీటిలో కారు చిక్కుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాధితులను గురుగ్రామ్‌లోని పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించారు.గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో ఫరీదాబాద్‌కు ఇంటికి బయల్దేరారు. అయితే ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు చేరుకోగా.. వరద నీటితో నిండి పోయి ఉంది. అయితే నీటి ఎత్తు ఎక్కువ లేదని భావించిన ఇద్దరు.. కారును నీటిలో ముందుకు పోనిచ్చారు. దీంతో కారు పూర్తిగా మునిగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.కానీ దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయారు. కారు ఇరుక్కుపోయిందని సమాచారం అందుకున్న పోలీసులు అండర్‌పాస్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారు వద్ద శర్మ మృతదేహాం బయటకు తీయగా.. అనేక గంటల గాలింపు తర్వాత శనివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ద్విదేది మృతదేహాన్ని వెలికితీశారు.మరోవైపు ఢిల్లీ, దేశ రాజధాని పరిసర ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
రైల్వే అండర్‌పాస్‌లోకి వాన నీరు
కర్ణాటక: గత రెండు రోజులుగా కురుస్తున్న జడివాన నేపథ్యంలో గురువారం నగరంలోని అరబ్ మొహల్లా అండర్‌పాస్‌లోకి వాన నీరు చేరాయి. దీంతో మన్సలాపూర్, యక్లాసపూర్, మర్చేడ్, హొసపేటె వంటి కుగ్రామాలకు వెళ్లే ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం మన్సలాపూర్ నుంచి ద్విచక్ర వాహనంలో పాలు విక్రయించడానికి వచ్చిన వ్యక్తి వాహనం నీటిలో తడవకుండా ఉండేందుకు మోసుకు రావడం కనిపించింది. కాగా ఎంపీ రాజా అమరేశ్వర నాయక్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, దక్షిణ మధ్య రైల్వే మండలి సలహా సమితి సభ్యుడు బాబురావ్‌లు ఏడాది క్రితం రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిలబడకుండా మరమ్మతు పనులు చేయిస్తామని చెిప్పి మాట తప్పారని ప్రజలు అక్రోశం వ్యక్తం చేశారు. -
అండర్పాస్లా.. మృత్యుకూపాలా?
బనశంకరి: సిలికాన్ సిటీలో అండర్‌పాస్‌లు మృత్యుకూపాలుగా మారుతున్నాయనే భయం నగరవాసుల్లో నెలకొంది. భారీ వర్షం వస్తే అండర్‌పాస్‌లను దాటేదెలా అనే ఆందోళన ఏర్పడుతోంది. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో ఆదివారం కురిసిన కుండపోతకు కారులో నీట మునిగి తెలుగు టెక్కీ భానురేఖా (22) జల సమాధి అయిన దుర్ఘటన అండర్‌పాస్‌ల ముప్పును మరోసారి తెరపైకి తెచ్చింది. ఓ మోస్తరు వర్షం వచ్చిందంటే అండర్‌పాస్‌లో వాహనాలు చిక్కుకోవడం ఇటీవల సాధారణంగా మారింది. బైక్‌లు, కార్లే కాదు బస్సులు కూడా మునిగేపోయేంతగా నీరు చేరడం, ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయిన ఘటనలు నగరవాసులకు సాధారణంగా మారాయి. తరచూ దుర్ఘటనలు కొన్ని నెలల కిందట హెబ్బాలలో అండర్‌పాస్ నీరు నిలిచిపోవడంతో రోడ్డుదాటే ప్రయత్నంలో విద్యార్థినిని బీబీఎంపీ చెత్త లారీ ఢీకొనడంతో మృత్యువాత పడింది. శివానంద సర్కిల్ రైల్వే అండర్‌పాస్ కింద బైకులో వెళుతున్న వ్యక్తి వాననీటిలో కొట్టుకుపోయాడు. బయటకు రాని చిన్నా చితకా ప్రమాదాలు అనేకం జరుగుతుంటాయి. ఇలా అండర్‌పాస్‌లు నగరవాసులకు మృత్యు కూపాలుగా మారుతుండటం నిర్వహణలోపం, నిఘా లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొన్నారు. అండర్‌పాస్‌లలో నీరు సజావుగా వెళ్లడానికి గ్రిల్ డ్రైనేజీ ఉంటుంది. అక్కడ నుంచి రాజకాలువ కు నీరు సజావుగా వెళుతుందా లేదా అనేది ముఖ్యం. కాలువలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చేస్తున్నారా లేదా అనేది గమనించాలని నిపుణులు తెలిపారు. జోరుగా వర్షం వస్తే ఫుట్‌పాత్ సొరంగమార్గాల్లో నీరు నిలిచిపోతోంది. సీబీఐ జంక్షన్ హెబ్బాల లో పాదచారులు రోడ్డు దాటే సొరంగమార్గాలు వర్షం వస్తే జలమయం అవుతాయి. అప్పుడు రోడ్లు దాటడానికి ప్రజలు సొరంగ మార్గం వాడకుండా రోడ్లపైకి వస్తారు. ఇది కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. యశవంతపుర చేపల మార్కెట్లో నిర్మించిన సొరంగమార్గం వర్షానికి నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇది కొత్త సమస్య కాదని, పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కరించలేదని ప్రజలు ఆరోపించారు. నిర్వహణ సక్రమంగా ఉండాలి వర్షాకాలానికి ముందే అండర్‌పాస్ కాలువల నిర్వహణ చేపట్టాలి, అండర్‌పాస్‌లోకి వర్షం నీరు చేరితే సజావుగా ప్రవహిస్తుందా లేదా అనేది పరిశీలించాలి. కాలువలు పూడికతో నిండిపోయి ఉంటే తొలగించాలి, లేదంటే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని బీబీఎంపీ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కేటీ.నాగరాజ్ అభిప్రాయపడ్డారు. కినో థియేటర్ వద్ద రైల్వే అండర్‌పాస్‌లో నీరు చేరుకోవడంతో బస్సులు మునిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 20 అడుగుల లోతులో 800 మీటర్లు పొడవు ప్రధాన డ్రైనేజీ నిర్మించారు. అక్కడి నుంచి రాజకాలువకు నీరు సజావుగా ప్రవహిస్తుంది. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడానికి కారణం కాలువలో చెత్త పేరుకు పోవడమేనని తెలిపారు. సాంకేతిక సమస్యలపై చిన్నచూపు ప్రభుత్వ పనులను పర్యవేక్షించే టెక్నికల్ పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని ఓ ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ బెంగళూరు విభాగం అద్యక్షుడు శ్రీకాంత్ చన్నాళ్ అభిప్రాయపడ్డారు. వంతెనలు నిర్మాణం, నిర్వహణ విషయంలో సివిల్ ఇంజనీర్లు పరిజ్ఞానం కలిగిఉంటారు. పనులు కాంట్రాక్టుకు ఇచ్చే ముందు ఆ సంస్థ సాంకేతికంగా బలంగా ఉందాలేదా అనేది గమనించాలి. కానీ అది జరగడంలేదన్నారు. టెక్నికల్ బిడ్ కు 25 శాతం ప్రాధాన్యత ఇస్తే, డబ్బులకు 75 శాతం ప్రాముఖ్యత ఉంటుంది. దీనికి రాజకీయ ఇతర ఒత్తిడులు కారణమని వాపోయారు. టోల్ తరహాలో బూమ్గేట్ కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ ప్రవేశ ద్వారానికి టోల్ గేట్లు వద్ద అమర్చిన బూమ్ బ్యారియర్ గేట్లను వేయాలని పాలికే సిద్ధమైంది. సీసీ కెమెరా అమర్చి అండర్‌పాస్‌లో ముంపు ఏర్పడితే ఈ గేట్‌ను మూసివేస్తారు. అప్పుడు వాహనాలు ముందుకు వెళ్లే వీలు ఉండదు. అలాగే వాహనాల సంచారం నిలిపివేయడానికి ట్రాఫిక్ పోలీసులు సహకారం తీసుకోవాలని నివేదికలో ప్రస్తావించారు. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌పై నివేదిక రైల్వే వంతెనలు, ప్రధాన రహదారుల కింద సత్వర ప్రయాణం కోసం అండర్‌పాస్‌లు ఎంత సౌకర్యంగా ఉంటాయో, వర్షాకాలంలో అంత ఇబ్బందిగా మారుతాయి. చిన్న వర్షం వస్తే నిండిపోయి ట్రాఫిక్ బంద్ అవుతుంది. ఐటీ సిటీలో పదుల సంఖ్యలో ఉన్న అండర్‌పాస్‌లతో ఉన్న సమస్యే ఇది. కుండపోత కురిస్తే కార్లు, బైక్‌లే కాదు బస్‌లు కూడా మునిగిపోయేంతగా నీరు చేరుతుంది. కొమ్మలు, ఆకులు రాలి అండర్‌పాస్ కాలువల్లో చేరడమే ప్రమాదాలకు కారణమని బీబీఎంపీ రాజకాలువల విభాగం ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడానికి కారణాలపై నివేదికను సిద్ధం చేసి బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు అందజేశారు. ఈ అండర్పాస్ని 2011లో నిర్మించారు. నీరు ప్రవహించడానికి డ్రై నేజీ వ్యవస్థను కల్పించి ఇనుప గ్రిల్ అమర్చారు. దగ్గరలోనే రాజకాలువ ప్రవహిస్తుంది. ఎప్పటికప్పుడు పూడిక తీస్తుంటారు. ఆదివారం భారీ గాలీవానకు రోడ్డుపై పడిన ఆకులు, చెత్త చెదారం నీటిలో చేరి గ్రిల్ నిండిపోయింది. వర్షపునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో అండర్‌పాస్ నిండిపోయింది. ఈ కారణంతో ప్రమాదం సంభవించిందని ఇంజనీర్ బీఎన్ ప్రహ్లాద్ నివేదికలో ప్రస్తావించారు. అండర్‌పాస్‌కు అన్ని వైపులా నుంచి వాననీరు పోటెత్తకుండా తప్పించడానికి ప్రత్యేక డ్రైనేజీలు నిర్మించాలన్నారు. 15 రోజుల్లో శాశ్వత పరిష్కార పనులు పూర్తిచేస్తామని తెలిపారు. -
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్‌లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్‌పాస్‌లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్‌లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్‌పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్‌లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్‌పాస్‌ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. ప్రారంభించిన నాలుగు నెలలకే రోడ్డుపై ఇలా గుంతలు పడటం గమనార్హం. బెంగళూరులోని తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపేలా కుందనహళ్లి అండర్‌పాస్ నిర్మించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) రూ. 19.5 కోట్లతో ఈ అండర్‌పాస్‌ను నిర్మించింది. ఇందులో భాగంగా వేసిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రభుత్వ నాసిరకపు పనికి ఇది నిదర్శమని మండిపడింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నాగరాజు యాదవ్ విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.. #WATCH: Another day, another road in Bengaluru. A section of road caves in near NPS Kengeri. Officials have taken up restoration work. While @chairmanbwssb says it's because of leakage from a water pipe, the issue persists across the city. pic.twitter.com/v1LJ7hr3H1 — Suraj Suresh (@Suraj_Suresh16) October 10, 2022 ప్రస్తుతం కుంగిపోయిన రోడ్డుపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. మరోవైపు రోడ్డు లోపల పైప్ లైన్ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు పగిలిన పైప్‌లైన్‌ను సరిచేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తూ.. ఉచితంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు బెంగుళూరు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
ఇక వారికి ట్రాఫిక్ చిక్కులు లేనట్లే.. ఫిబ్రవరిలోనే అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన మరో అండర్‌పాస్ వచ్చే ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద కుడివైపు అండర్‌పాస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులుదిద్ది, ఫిబ్రవరిలో వినియోగంలోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్‌పాస్ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్‌పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిథానీల మీదుగా ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. అండర్‌పాస్ వివరాలు.. ► పొడవు: 490 మీటర్లు ► వెడల్పు: 12. 87 మీటర్లు ► మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం ► అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు ఫిబ్రవరిలో అందుబాటులోకి.. తుకారాంగేట్ ఆర్యూబీ సైతం.. ఎల్బీనగర్ అండర్‌పాస్‌తో పాటు తుకారాం గేట్ రైల్వే అండర్‌పాస్ పనులు కూడా పూర్తి కావచ్చాయని, అది కూడా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య -
ముందుకు సాగని ‘మూడో దారి’
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ వ్యాప్తంగా ఎక్కడిక్కడ కొత్త మార్గాల అభివృద్ధి, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఏళ్ళుగా మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద మూడో అండర్ పాస్ కట్టాలనే ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించట్లేదు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు అనునిత్యం నరకం చవి చూస్తున్నారు. సిటీ బస్సులు నడవని, ‘కరోన ఫీవర్’ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లోనే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయంటే... రేపు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరిస్థితి వేరుగా చెప్పక్కర్లేదు. ‘డైనమిక్’గా వాడుకోవచ్చని భావించారు... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్పట వైపు వెళ్ళే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీక్ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయంత్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పు ఉదయం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పిండంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహన కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. హెచ్ఎంఆర్ అప్పట్లో ముందుకు వచ్చినా... మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు సహకరించడానికి అప్పట్లో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. దాదాపు రెండేళ్ళ క్రితం జీహెచ్ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని హెచ్ఎంఆర్ ప్రకటించింది. ఇప్పటికీ మోక్షం లభించలేదు. మూసీ వెంట మార్గాన్నీఅన్వేషించినా... మరోపక్క మలక్‌పేట సమీపంలో ఉన్న మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. చాదర్‌ఘాట్ కాజ్వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే అనే చోట్ల అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వెళ్ళాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్ సమీపంలోని అంబర్పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్‌ను మళ్ళించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. మలక్‌పేటలో మూడో అండర్ పాస్‌తో పాటు వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకుడిని నిత్యం నరకం తప్పట్లేదు. అత్యంత కీలక రహదారుల్లో ఒకటి... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో నరకం చవిచూడాల్సిందే. -
ఎల్బీనగర్ అండర్‌పాస్.. ఈజీ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లోని ఈస్ట్‌జోన్‌లో సాగర్‌రింగ్ రోడ్, ఎల్బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, ఉప్పల్ జంక్షన్లు అత్యంత రద్దీ ప్రాంతాలు. విజయవాడ, నాగార్జునసాగర్, శంషాబాద్ విమానాశ్రయం వైపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రావాలన్నా..తిరిగి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకప్రాయం. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్సార్డీపీ ఫేజ్ వన్ ప్యాకేజీ–2లో భాగంగా వివిధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లూప్‌ల వంటి వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 14 పనుల్లో గురువారం ప్రారంభమైన రెండింటితో సహా ఇప్పటికి ఐదు పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు కొంత మేరఉపశమనం లభించింది. మిగతావన్నీ పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, దిల్సుక్నగర్ల నుంచి నుంచి నల్లగొండ, విజయవాడల వైపు, అలాగే నాగార్జునసాగర్, శంషాబాద్ వైపు వెళ్లేవారికి.. ఆప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి సిగ్నల్ జంజాటాల్లేని ప్రయాణం సాధ్యం కానుంది. పూర్తయి వినియోగంలోకి వచ్చినవి ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు అండర్‌పాస్, చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్ పూర్తి కావాల్సినవి.. ♦ ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ ♦ ఎల్బీనగర్ వద్ద కుడివైపు అండర్‌పాస్ ♦ బైరామల్ గూడ వద్ద ఫస్ట్ లెవెల్లో కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు ♦ బైరామల్ గూడ వద్ద సెకెండ్ లెవెల్లో ఫ్లై ఓవర్ ♦ బైరామల్ గూడ వద్ద కుడి, ఎడమవైపుల లూప్‌లు ♦ కామినేని అండర్‌పాస్ నాగోల్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్ ట్రాఫిక్ రద్దీ ఇలా.. ఈస్ట్‌జోన్‌లోని ఆయా జంక్షన్ల వద్ద భవిష్యత్‌లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ నిపుణులు అంచనా వేశారు. ఆమేరకు.. 2034 నాటికి రద్దీ సమయాల్లో గంటకు ఉండే ట్రాఫిక్ పీసీయూ.. పూర్తయిన, పూర్తి కావాల్సిన పనుల అన్నింటి అంచనా వ్యయం :రూ. 448 కోట్లు -
శరవేగంగా హైదరాబాద్ అభివృద్ధి
ఎల్బీనగర్/మన్సూరాబాద్: ప్రపంచ దేశాల నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) పనుల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని జంక్షన్లో రూ.43 కోట్ల తో నిర్మించిన 940 మీటర్ల ఫ్లైఓవర్, రింగ్ రోడ్డులో రూ.14.73 కోట్లతో నిర్మించిన 519 మీటర్ల అండర్ పాస్‌ను నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలతో కలసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న విధానాలతో ప్రపంచ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెరిగాయన్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగణంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సిగ్నల్స్ రహిత ట్రాఫిక్ ఏర్పాటులో భాగంగానే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టామ న్నారు. ఎల్బీనగర్లోని 12 ప్రాంతాల్లో రూ.448 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. మరో వారంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని రెండో అండర్‌పాస్ పనులను ప్రారంభిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎమ్మెల్సీ యెగ్గె్గ మల్లేశం, జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైవేలపై అండర్‌పాస్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారి.. రాష్ట్రంలో కీలకమైన రోడ్డు. హైదరాబాద్ – రామగుండం వరకు విస్తరించిన 230 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగా గమనిస్తే ఎక్కడా బైపాస్‌లు కనిపించవు. రెండు రోడ్లు కలిసే చోట ప్రత్యామ్నాయ మార్గాలుగా అండర్‌పాస్‌ల ఊసే ఉండదు. వాహనదారులు ఈ రోడ్డు మీదుగా బిక్కుబిక్కుమంటూ సాగాల్సిందే. వేగంగా వాహనాలు దూసుకెళ్లే రోడ్లు ఎలా ఉండకూడదో చక్కటి ఉదాహరణగా నిలిచే రోడ్డు ఇది. జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ఎదురుగా రోడ్డును ఆనుకునే ఓ ఊరు తారసపడింది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఊరి వైపు కాకుండా ఆ పక్కనే నిర్మించిన అండర్‌పాస్ గుండా దూసుకుపోయాయి. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మరో రోడ్డు దాటుతున్న సమయంలోనూ వాహన వేగం తగ్గలేదు. అక్కడ మరో అండర్పాస్లోంచి దూసుకుపోయే ఏర్పాటు. చివరకు బైపాస్ ముగిసే చోట కూడా మరో అండర్‌పాస్ ఉండటంతో వాహనాల అదే వేగంతో వెళ్లొచ్చు. రెండు రోడ్ల మీదుగా దూసుకొచ్చే వాహనాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా ఉండదు. మొదటిది వాస్తవం.. రెండోది కల్పన. అయితే ఇప్పుడు జాతీయ రహదారులపై పరిస్థితి మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వేగంగా దూసుకెళ్లే వాహనాల భద్రతకు భరోసా ఇవ్వనుంది. జాతీయ రహదారులపై ప్రమాదాలను వీలైనంత తగ్గించేందుకు గ్రామాలుండే చోట్ల వాటిపై బైపాస్‌లు, వాటిని అండర్‌పాస్‌లతో జోడించటం అత్యవసరమని కేంద్రం నిర్ణయించింది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మించే రోడ్లపై దీని అమలు ప్రారంభించారు. ఫలితంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించని రోడ్ల డిజైన్లను మారుస్తున్నారు. ఆయా రహదారులన్నింటిలో అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లను నిర్మించేలా కొత్త నమూనాలను రూపొందించారు. ఎలా ఉంటుంది..? చాలా రహదారులపై గ్రామాలున్నాయి. వాహనాలు ఆ గ్రామాల మీదుగా దూసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి చోట్ల బైపాస్‌లను నిర్మించి వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వాటి మీదుగా మళ్లించాలి. కానీ భూ సేకరణ, నిర్మాణ వ్యయాల కారణంగా బైపాస్‌లు లేకుండానే రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్లపై కచ్చితంగా బైపాస్‌లు నిర్మిస్తారు. రోడ్డును ఆనుకుని 500 మీటర్ల కంటే ఎక్కువ మేర గ్రామం విస్తరించి ఉంటే వీటి నిర్మాణం తప్పనిసరి. తాజా నిర్ణయం మేరకు ఈ బైపాస్‌ల ప్రారంభం, ముగిసే చోట అండర్‌పాస్‌లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. గ్రామాల వైపు వెళ్లే వాహనాలు, ప్రధాన కారిడార్ మీదుగా వెళ్లే వాహనాల మధ్య ఎలాంటి అయోమయం లేకుండా ఈ అండర్‌పాస్‌లు దారులను విడదీస్తాయి. కొన్ని చోట్ల బైపాస్‌ల మీదుగా మరో రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇలాంటి వాటికి రెండో రోడ్డు కలిసే చోట మూడో అండర్‌పాస్ నిర్మించాల్సి ఉంటుంది. మారిన డిజైన్లు.. ప్రస్తుతం హైదరాబాద్–కొడంగల్ మీదుగా విస్తరించే జాతీయ రహదారిలో హైదరాబాద్–మన్నెగూడ మధ్య రెండు చోట్ల కొత్తగా అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌లలో వీటిని నిర్మిస్తారు. ఖమ్మం–కోదాడ మార్గంలో 11 ప్రధాన అండర్‌పాస్‌లు, ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లగలిగే 9 చిన్న అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. ఖమ్మం–సూర్యాపేట మార్గంలో 12 ప్రధాన అండర్‌పాస్‌లు, 11 చిన్న అండర్‌పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ఖమ్మం–అశ్వారావుపేటలో ఎన్ని అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయంలో సర్వే జరుపుతున్నారు. త్వరలో మిగతా చోట్ల కూడా వీటిని ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారుల విభాగం పనులు చేపట్టే రోడ్లపైనా నిర్మించనున్నారు. -
రష్యాలో షాకింగ్ ప్రమాదం.. జనాలపైకి బస్సు
మాస్కో : రష్యాలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సు కాస్త పాదచారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఐదుగురు చనిపోయినట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. వారు చెప్పిన ప్రకారం వెస్ట్రన్ మాస్కోలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన లోపంతోపాటు పలుకారణాలు ఉండొచ్చని తాము అనుమానిస్తున్నట్లు వెల్లడిచించారు. ‘రోడ్డుపై వెళుతున్న బస్సు అనూహ్యంగా అండర్ పాస్ మెట్ల మీదుగా వెళుతున్న పాదచారులపైకి వెళ్లింది. దాంతో మేం షాకయ్యాం. మాకు అందిన సమాచారం మేరకు ఐదుగురు చనిపోయారు’ అని పోలీసు అధికార ప్రతినిధి ఆర్టీయోం కొలెస్నికోవ్ చెప్పారు. సీసీటీవీలో లభించిన వీడియో ప్రకారం తొలుత బస్సు పాదచారుల మార్గంపైకి వచ్చింది. ఆ తర్వాత అండర్ పాస్ మెట్లమీదకు జారుకుంటూ నడుస్తున్న వారిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అండర్‌పాస్ నిర్మాణానికి చొరవ చూపాలి’
మేడ్చల్ రూరల్: మండలంలోని గుండ్లపోచంపల్లి నుంచి వెళ్లే వాహనదారులకు కొంపల్లి బ్రిడ్జి వద్ద అండర్‌పాస్ సౌకర్యం కల్పించాలని గుండ్లపోచంపల్లి సర్పంచ్ భేరి ఈశ్వర్ కేంద్ర రహదారులు, ట్రాన్స్‌పోర్టు మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందించారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మంత్రి నివాసానికి వెళ్లి ఈ మేరకు విన్నవించారు. గౌడవెల్లి, బండమాదారం, రాయిలాపూర్, శ్రీరంగవరం, నూతన్కల్తో పాటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల వారు నగరానికి వెళ్లేందుకు గుండ్లపోచంపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తారని తెలిపారు. ఈ రూట్లో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. నగరం వైపు వెళ్లాలంటే కొంపల్లి బ్రిడ్జి నుంచి 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో రాంగ్రూట్లో దూలపల్లి చౌరస్తా వరకు వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన సమస్యను అధిగమించేందుకు కొంపల్లి బ్రిడ్జి వద్ద అండర్‌పాస్ వసతి కల్పించాలని కోరారు. తమ వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి దీనిపై ప్రిన్సిపల్ సెక్రెటరీకి వెంటనే ఆదేశాలు జారీ చేశారని సర్పంచ్ తెలిపారు. వాహనదారుల సమస్యను పరిశీలించి పనులు చేపట్టాలని సూచించారని అన్నారు. సుమారు రూ.16 కోట్లతో అండర్‌పాస్ పనులు చేపట్టి వాహనదారులు ఇబ్బందులు తొలగించి వారికి వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కొంపల్లి సర్పంచ్ జిమ్మి దేవేందర్, ఫామ్మెడోస్ చైర్మన్ రవీకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
తండా సమీపంలో అండర్‌పాస్ ఉందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండల పరిధిలోని పెద్దకుంట తండా గ్రామానికి చెందిన ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు వీలుగా గ్రామ సమీపంలో అండర్‌పాస్ ఉందో లేదో స్వయంగా వెళ్లి పరిశీలన చేయాలని హైకోర్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది రచన వడ్డేపల్లి, జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) మేనేజర్ శైలజను ఆదేశించింది. తండాకు చెందిన మగవాళ్లంతా గత రెండేళ్ల కాలంలో 44వ జాతీయ రహదారి దాటుతూ మృత్యువాత పడ్డారని, అక్కడి మహిళల పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వారిని ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. పరిశీలకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. తండాకు చెందిన మగవాళ్లంతా గత రెండేళ్లలో 44వ జాతీయ రహదారి దాటుతూ మరణించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచన చేసిన వాదనను ఎన్హెచ్ఏఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదన్నారు. మృతుల సంఖ్యను ఎక్కువ చేసి, పత్రికా కథనాల ఆధారంగా గణాంకాలు చెబుతున్నారన్నారు. తండావాసులు రోడ్డు దాటేందుకు వీలుగా సమీపంలోనే అండర్ పాస్ ఉందని, దీనిని వారు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. అదంతా అవా స్తవమని రచన విన్నవించారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ జోక్యం చేసుకుంటూ, గత విచారణ తర్వాత జిల్లా ఎస్పీ స్వయం గా వెళ్లి పరిశీలించారని, పిటిషనర్లు చెబుతున్నదానిలో వాస్తవం లేదన్నారు. తండాకు అండర్‌పాస్ ఎంత దూరంలో ఉందన్న అంశంపై భిన్న వాదనలున్నందున, అక్కడికి కలసి వెళ్లి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రచన, శైలజలను ధర్మాసనం ఆదేశించింది. -
తూర్పుఢిల్లీలో అండర్‌పాస్
* పనులను చేపట్టనున్న ప్రజాపనుల శాఖ * ఐదు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీవాసులకు శుభవార్త. మదర్‌డెయిరీ నుంచి లక్ష్మీనగర్ మీదుగా షకర్పూర్ వెళ్లేవారికి త్వరలో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించనుంది. ఈ మార్గంలోగల రైల్వే ఓవర్బ్రిడ్జిల కింద రెండు అండర్‌పాస్‌లను త్వరలో నిర్మించనున్నారు.వచ్చే నెలలో రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఇందుకు సంబంధించిన పనులను చేపట్టనుంది. దీని అంచనా వ్యయం రూ. 1.5 కోట్లు. ఏప్రిల్నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండర్‌పాస్ నిర్మాణ పనులు పూర్తయితే ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం 2013లోనే ఆమోదముద్ర వేసింది. అయితే అప్పటినుంచి అనేక కారణాల వల్ల ఇది వాయిదాపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజాపనుల శాఖ నిర్ణయించింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మదర్ డెయిరీ ప్రాంతం వద్దనుంచి ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. పిల్లర్లను ఆధారంగా చేసుకుని అండర్‌పాస్ నిర్మించడం అంత కష్టమైన పనేమీ కాదు. రైల్వే మార్గాన్ని గట్టుగా చేసుకుని ఈ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం బాక్స్ పుషింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి వస్తుంది. చెట్ల నరికివేత పనులను అనుమతి పొందేందుకు దరఖాస్తు చేయడంవల్ల తొలుత ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను వచ్చే నెలలో మొదలుపెడతామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఒకసారి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాండవ్‌నగర్ నుంచి గణేశ్‌నగర్‌కు దీన్ని వినియోగించుకోవచ్చన్నారు.