సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్‌లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు.
కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్‌పాస్‌లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు.
దర్యాప్తు చేస్తాం!
ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి.
Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy
— ANI (@ANI) May 21, 2023
డ్రైవర్ దూకుడు వల్లే..
ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్‌లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్‌పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్‌లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్‌పాస్‌ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అదే కేఆర్ సర్కిల్‌లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది.
స్వగ్రామంలో విషాద ఛాయలు
సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment