
భార్యను హతమార్చి ముక్కలుగా
నరికిన భర్త పూణెలో పట్టివేత
ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం
ప్రాణాపాయం లేదని తేల్చిన వైద్యులు
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్‌రూమ్‌లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు.
అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
పుణెకు చేరిన హుళిమావు పోలీసులు
పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు.