అండర్‌పాస్‌లా.. మృత్యుకూపాలా? | - | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌లా.. మృత్యుకూపాలా?

Published Wed, May 24 2023 6:40 AM | Last Updated on Wed, May 24 2023 7:18 AM

వర్షం కురిస్తే జలపాతం ఉరకలెత్తుతుంది.. నగరంలో ఓ ప్రముఖ అండర్‌పాస్‌ దుస్థితి  - Sakshi

వర్షం కురిస్తే జలపాతం ఉరకలెత్తుతుంది.. నగరంలో ఓ ప్రముఖ అండర్‌పాస్‌ దుస్థితి

బనశంకరి: సిలికాన్‌ సిటీలో అండర్‌పాస్‌లు మృత్యుకూపాలుగా మారుతున్నాయనే భయం నగరవాసుల్లో నెలకొంది. భారీ వర్షం వస్తే అండర్‌పాస్‌లను దాటేదెలా అనే ఆందోళన ఏర్పడుతోంది. కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌లో ఆదివారం కురిసిన కుండపోతకు కారులో నీట మునిగి తెలుగు టెక్కీ భానురేఖా (22) జల సమాధి అయిన దుర్ఘటన అండర్‌పాస్‌ల ముప్పును మరోసారి తెరపైకి తెచ్చింది. ఓ మోస్తరు వర్షం వచ్చిందంటే అండర్‌పాస్‌లో వాహనాలు చిక్కుకోవడం ఇటీవల సాధారణంగా మారింది. బైక్‌లు, కార్లే కాదు బస్సులు కూడా మునిగేపోయేంతగా నీరు చేరడం, ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయిన ఘటనలు నగరవాసులకు సాధారణంగా మారాయి.

తరచూ దుర్ఘటనలు
కొన్ని నెలల కిందట హెబ్బాలలో అండర్‌పాస్‌ నీరు నిలిచిపోవడంతో రోడ్డుదాటే ప్రయత్నంలో విద్యార్థినిని బీబీఎంపీ చెత్త లారీ ఢీకొనడంతో మృత్యువాత పడింది. శివానంద సర్కిల్‌ రైల్వే అండర్‌పాస్‌ కింద బైకులో వెళుతున్న వ్యక్తి వాననీటిలో కొట్టుకుపోయాడు. బయటకు రాని చిన్నా చితకా ప్రమాదాలు అనేకం జరుగుతుంటాయి. ఇలా అండర్‌పాస్‌లు నగరవాసులకు మృత్యు కూపాలుగా మారుతుండటం నిర్వహణలోపం, నిఘా లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొన్నారు. అండర్‌పాస్‌లలో నీరు సజావుగా వెళ్లడానికి గ్రిల్‌ డ్రైనేజీ ఉంటుంది. అక్కడ నుంచి రాజకాలువ కు నీరు సజావుగా వెళుతుందా లేదా అనేది ముఖ్యం. కాలువలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చేస్తున్నారా లేదా అనేది గమనించాలని నిపుణులు తెలిపారు. జోరుగా వర్షం వస్తే ఫుట్‌పాత్‌ సొరంగమార్గాల్లో నీరు నిలిచిపోతోంది. సీబీఐ జంక్షన్‌ హెబ్బాల లో పాదచారులు రోడ్డు దాటే సొరంగమార్గాలు వర్షం వస్తే జలమయం అవుతాయి. అప్పుడు రోడ్లు దాటడానికి ప్రజలు సొరంగ మార్గం వాడకుండా రోడ్లపైకి వస్తారు. ఇది కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. యశవంతపుర చేపల మార్కెట్‌లో నిర్మించిన సొరంగమార్గం వర్షానికి నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇది కొత్త సమస్య కాదని, పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కరించలేదని ప్రజలు ఆరోపించారు.

నిర్వహణ సక్రమంగా ఉండాలి
వర్షాకాలానికి ముందే అండర్‌పాస్‌ కాలువల నిర్వహణ చేపట్టాలి, అండర్‌పాస్‌లోకి వర్షం నీరు చేరితే సజావుగా ప్రవహిస్తుందా లేదా అనేది పరిశీలించాలి. కాలువలు పూడికతో నిండిపోయి ఉంటే తొలగించాలి, లేదంటే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని బీబీఎంపీ విశ్రాంత చీఫ్‌ ఇంజనీర్‌ కేటీ.నాగరాజ్‌ అభిప్రాయపడ్డారు. కినో థియేటర్‌ వద్ద రైల్వే అండర్‌పాస్‌లో నీరు చేరుకోవడంతో బస్సులు మునిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 20 అడుగుల లోతులో 800 మీటర్లు పొడవు ప్రధాన డ్రైనేజీ నిర్మించారు. అక్కడి నుంచి రాజకాలువకు నీరు సజావుగా ప్రవహిస్తుంది. కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడానికి కారణం కాలువలో చెత్త పేరుకు పోవడమేనని తెలిపారు.

సాంకేతిక సమస్యలపై చిన్నచూపు
ప్రభుత్వ పనులను పర్యవేక్షించే టెక్నికల్‌ పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని ఓ ప్రముఖ సివిల్‌ ఇంజనీరింగ్‌ సంస్థ బెంగళూరు విభాగం అద్యక్షుడు శ్రీకాంత్‌ చన్నాళ్‌ అభిప్రాయపడ్డారు. వంతెనలు నిర్మాణం, నిర్వహణ విషయంలో సివిల్‌ ఇంజనీర్లు పరిజ్ఞానం కలిగిఉంటారు. పనులు కాంట్రాక్టుకు ఇచ్చే ముందు ఆ సంస్థ సాంకేతికంగా బలంగా ఉందాలేదా అనేది గమనించాలి. కానీ అది జరగడంలేదన్నారు. టెక్నికల్‌ బిడ్‌ కు 25 శాతం ప్రాధాన్యత ఇస్తే, డబ్బులకు 75 శాతం ప్రాముఖ్యత ఉంటుంది. దీనికి రాజకీయ ఇతర ఒత్తిడులు కారణమని వాపోయారు.

టోల్‌ తరహాలో బూమ్‌గేట్‌
కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌ ప్రవేశ ద్వారానికి టోల్‌ గేట్లు వద్ద అమర్చిన బూమ్‌ బ్యారియర్‌ గేట్‌లను వేయాలని పాలికే సిద్ధమైంది. సీసీ కెమెరా అమర్చి అండర్‌పాస్‌లో ముంపు ఏర్పడితే ఈ గేట్‌ను మూసివేస్తారు. అప్పుడు వాహనాలు ముందుకు వెళ్లే వీలు ఉండదు. అలాగే వాహనాల సంచారం నిలిపివేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు సహకారం తీసుకోవాలని నివేదికలో ప్రస్తావించారు.

కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌పై నివేదిక
రైల్వే వంతెనలు, ప్రధాన రహదారుల కింద సత్వర ప్రయాణం కోసం అండర్‌పాస్‌లు ఎంత సౌకర్యంగా ఉంటాయో, వర్షాకాలంలో అంత ఇబ్బందిగా మారుతాయి. చిన్న వర్షం వస్తే నిండిపోయి ట్రాఫిక్‌ బంద్‌ అవుతుంది. ఐటీ సిటీలో పదుల సంఖ్యలో ఉన్న అండర్‌పాస్‌లతో ఉన్న సమస్యే ఇది. కుండపోత కురిస్తే కార్లు, బైక్‌లే కాదు బస్‌లు కూడా మునిగిపోయేంతగా నీరు చేరుతుంది.

కొమ్మలు, ఆకులు రాలి అండర్‌పాస్‌ కాలువల్లో చేరడమే ప్రమాదాలకు కారణమని బీబీఎంపీ రాజకాలువల విభాగం ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడానికి కారణాలపై నివేదికను సిద్ధం చేసి బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌కు అందజేశారు. ఈ అండర్‌పాస్‌ని 2011లో నిర్మించారు. నీరు ప్రవహించడానికి డ్రై నేజీ వ్యవస్థను కల్పించి ఇనుప గ్రిల్‌ అమర్చారు. దగ్గరలోనే రాజకాలువ ప్రవహిస్తుంది. ఎప్పటికప్పుడు పూడిక తీస్తుంటారు. ఆదివారం భారీ గాలీవానకు రోడ్డుపై పడిన ఆకులు, చెత్త చెదారం నీటిలో చేరి గ్రిల్‌ నిండిపోయింది. వర్షపునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో అండర్‌పాస్‌ నిండిపోయింది. ఈ కారణంతో ప్రమాదం సంభవించిందని ఇంజనీర్‌ బీఎన్‌ ప్రహ్లాద్‌ నివేదికలో ప్రస్తావించారు. అండర్‌పాస్‌కు అన్ని వైపులా నుంచి వాననీరు పోటెత్తకుండా తప్పించడానికి ప్రత్యేక డ్రైనేజీలు నిర్మించాలన్నారు. 15 రోజుల్లో శాశ్వత పరిష్కార పనులు పూర్తిచేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బెంగళూరు కొడిగేహళ్లి రైల్వే అండర్‌పాస్‌ ఇలా1
1/3

బెంగళూరు కొడిగేహళ్లి రైల్వే అండర్‌పాస్‌ ఇలా

ఓకళిపురం అండర్‌పాస్‌ కింద నిర్వహణ లేని డ్రైనేజీ కాలువ2
2/3

ఓకళిపురం అండర్‌పాస్‌ కింద నిర్వహణ లేని డ్రైనేజీ కాలువ

ఓకళిపురం అండర్‌పాస్‌ కింద వాననీటి ఉప్పెన3
3/3

ఓకళిపురం అండర్‌పాస్‌ కింద వాననీటి ఉప్పెన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement