‘అండర్‌పాస్ నిర్మాణానికి చొరవ చూపాలి’
మేడ్చల్ రూరల్: మండలంలోని గుండ్లపోచంపల్లి నుంచి వెళ్లే వాహనదారులకు కొంపల్లి బ్రిడ్జి వద్ద అండర్‌పాస్ సౌకర్యం కల్పించాలని గుండ్లపోచంపల్లి సర్పంచ్ భేరి ఈశ్వర్ కేంద్ర రహదారులు, ట్రాన్స్‌పోర్టు మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందించారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మంత్రి నివాసానికి వెళ్లి ఈ మేరకు విన్నవించారు. గౌడవెల్లి, బండమాదారం, రాయిలాపూర్, శ్రీరంగవరం, నూతన్‌కల్‌తో పాటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల వారు నగరానికి వెళ్లేందుకు గుండ్లపోచంపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తారని తెలిపారు. ఈ రూట్లో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి.
నగరం వైపు వెళ్లాలంటే కొంపల్లి బ్రిడ్జి నుంచి 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో రాంగ్‌రూట్‌లో దూలపల్లి చౌరస్తా వరకు వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన సమస్యను అధిగమించేందుకు కొంపల్లి బ్రిడ్జి వద్ద అండర్‌పాస్ వసతి కల్పించాలని కోరారు. తమ వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి దీనిపై ప్రిన్సిపల్ సెక్రెటరీకి వెంటనే ఆదేశాలు జారీ చేశారని సర్పంచ్ తెలిపారు. వాహనదారుల సమస్యను పరిశీలించి పనులు చేపట్టాలని సూచించారని అన్నారు. సుమారు రూ.16 కోట్లతో అండర్‌పాస్ పనులు చేపట్టి వాహనదారులు ఇబ్బందులు తొలగించి వారికి వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కొంపల్లి సర్పంచ్ జిమ్మి దేవేందర్, ఫామ్‌మెడోస్ చైర్మన్ రవీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.