గురుగ్రామ్: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఎన్‌సీఆర్ పరిధిలో భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి, అనేక వీధులు, దారులు జలమయమయ్యాయి. అయితే హర్యానాలో భారీ వర్షానికి ఫరీదాబాద్‌లోని అండర్‌పాస్‌లో వరద నీటిలో కారు చిక్కుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాధితులను గురుగ్రామ్‌లోని పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించారు.
గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో ఫరీదాబాద్‌కు ఇంటికి బయల్దేరారు. అయితే ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు చేరుకోగా.. వరద నీటితో నిండి పోయి ఉంది. అయితే నీటి ఎత్తు ఎక్కువ లేదని భావించిన ఇద్దరు.. కారును నీటిలో ముందుకు పోనిచ్చారు. దీంతో కారు పూర్తిగా మునిగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయారు. కారు ఇరుక్కుపోయిందని సమాచారం అందుకున్న పోలీసులు అండర్‌పాస్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారు వద్ద శర్మ మృతదేహాం బయటకు తీయగా.. అనేక గంటల గాలింపు తర్వాత శనివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ద్విదేది మృతదేహాన్ని వెలికితీశారు.
మరోవైపు ఢిల్లీ, దేశ రాజధాని పరిసర ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment