తూర్పుఢిల్లీలో అండర్‌పాస్
* పనులను చేపట్టనున్న ప్రజాపనుల శాఖ
* ఐదు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం
న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీవాసులకు శుభవార్త. మదర్‌డెయిరీ నుంచి లక్ష్మీనగర్ మీదుగా షకర్‌పూర్ వెళ్లేవారికి త్వరలో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించనుంది. ఈ మార్గంలోగల రైల్వే ఓవర్‌బ్రిడ్జిల కింద రెండు అండర్‌పాస్‌లను త్వరలో నిర్మించనున్నారు.వచ్చే నెలలో రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఇందుకు సంబంధించిన పనులను చేపట్టనుంది. దీని అంచనా వ్యయం రూ. 1.5 కోట్లు. ఏప్రిల్‌నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండర్‌పాస్ నిర్మాణ పనులు పూర్తయితే ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం 2013లోనే ఆమోదముద్ర వేసింది. అయితే అప్పటినుంచి అనేక కారణాల వల్ల ఇది వాయిదాపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజాపనుల శాఖ నిర్ణయించింది.
ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మదర్ డెయిరీ ప్రాంతం వద్దనుంచి ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. పిల్లర్లను ఆధారంగా చేసుకుని అండర్‌పాస్ నిర్మించడం అంత కష్టమైన పనేమీ కాదు. రైల్వే మార్గాన్ని గట్టుగా చేసుకుని ఈ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం బాక్స్ పుషింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి వస్తుంది. చెట్ల నరికివేత పనులను అనుమతి పొందేందుకు దరఖాస్తు చేయడంవల్ల తొలుత ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను వచ్చే నెలలో మొదలుపెడతామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఒకసారి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాండవ్‌నగర్ నుంచి గణేశ్‌నగర్‌కు దీన్ని వినియోగించుకోవచ్చన్నారు.