సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారి.. రాష్ట్రంలో కీలకమైన రోడ్డు. హైదరాబాద్ – రామగుండం వరకు విస్తరించిన 230 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగా గమనిస్తే ఎక్కడా బైపాస్‌లు కనిపించవు. రెండు రోడ్లు కలిసే చోట ప్రత్యామ్నాయ మార్గాలుగా అండర్‌పాస్‌ల ఊసే ఉండదు. వాహనదారులు ఈ రోడ్డు మీదుగా బిక్కుబిక్కుమంటూ సాగాల్సిందే. వేగంగా వాహనాలు దూసుకెళ్లే రోడ్లు ఎలా ఉండకూడదో చక్కటి ఉదాహరణగా నిలిచే రోడ్డు ఇది.
జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ఎదురుగా రోడ్డును ఆనుకునే ఓ ఊరు తారసపడింది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఊరి వైపు కాకుండా ఆ పక్కనే నిర్మించిన అండర్‌పాస్ గుండా దూసుకుపోయాయి. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మరో రోడ్డు దాటుతున్న సమయంలోనూ వాహన వేగం తగ్గలేదు. అక్కడ మరో అండర్‌పాస్‌లోంచి దూసుకుపోయే ఏర్పాటు. చివరకు బైపాస్ ముగిసే చోట కూడా మరో అండర్‌పాస్ ఉండటంతో వాహనాల అదే వేగంతో వెళ్లొచ్చు. రెండు రోడ్ల మీదుగా దూసుకొచ్చే వాహనాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా ఉండదు.
మొదటిది వాస్తవం.. రెండోది కల్పన. అయితే ఇప్పుడు జాతీయ రహదారులపై పరిస్థితి మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వేగంగా దూసుకెళ్లే వాహనాల భద్రతకు భరోసా ఇవ్వనుంది. జాతీయ రహదారులపై ప్రమాదాలను వీలైనంత తగ్గించేందుకు గ్రామాలుండే చోట్ల వాటిపై బైపాస్‌లు, వాటిని అండర్‌పాస్‌లతో జోడించటం అత్యవసరమని కేంద్రం నిర్ణయించింది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మించే రోడ్లపై దీని అమలు ప్రారంభించారు. ఫలితంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించని రోడ్ల డిజైన్లను మారుస్తున్నారు. ఆయా రహదారులన్నింటిలో అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లను నిర్మించేలా కొత్త నమూనాలను రూపొందించారు.
ఎలా ఉంటుంది..?
చాలా రహదారులపై గ్రామాలున్నాయి. వాహనాలు ఆ గ్రామాల మీదుగా దూసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి చోట్ల బైపాస్‌లను నిర్మించి వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వాటి మీదుగా మళ్లించాలి. కానీ భూ సేకరణ, నిర్మాణ వ్యయాల కారణంగా బైపాస్‌లు లేకుండానే రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ రోడ్లపై కచ్చితంగా బైపాస్‌లు నిర్మిస్తారు. రోడ్డును ఆనుకుని 500 మీటర్ల కంటే ఎక్కువ మేర గ్రామం విస్తరించి ఉంటే వీటి నిర్మాణం తప్పనిసరి. తాజా నిర్ణయం మేరకు ఈ బైపాస్‌ల ప్రారంభం, ముగిసే చోట అండర్‌పాస్‌లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. గ్రామాల వైపు వెళ్లే వాహనాలు, ప్రధాన కారిడార్ మీదుగా వెళ్లే వాహనాల మధ్య ఎలాంటి అయోమయం లేకుండా ఈ అండర్‌పాస్‌లు దారులను విడదీస్తాయి. కొన్ని చోట్ల బైపాస్‌ల మీదుగా మరో రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇలాంటి వాటికి రెండో రోడ్డు కలిసే చోట మూడో అండర్‌పాస్ నిర్మించాల్సి ఉంటుంది.
మారిన డిజైన్లు..
ప్రస్తుతం హైదరాబాద్–కొడంగల్ మీదుగా విస్తరించే జాతీయ రహదారిలో హైదరాబాద్–మన్నెగూడ మధ్య రెండు చోట్ల కొత్తగా అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌లలో వీటిని నిర్మిస్తారు. ఖమ్మం–కోదాడ మార్గంలో 11 ప్రధాన అండర్‌పాస్‌లు, ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లగలిగే 9 చిన్న అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. ఖమ్మం–సూర్యాపేట మార్గంలో 12 ప్రధాన అండర్‌పాస్‌లు, 11 చిన్న అండర్‌పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ఖమ్మం–అశ్వారావుపేటలో ఎన్ని అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయంలో సర్వే జరుపుతున్నారు. త్వరలో మిగతా చోట్ల కూడా వీటిని ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారుల విభాగం పనులు చేపట్టే రోడ్లపైనా నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment