గోదావరిఖని – మంథని రోడ్డుపై పురుగు మందు డబ్బాలతో బైఠాయించిన రైతులు
మంథని–గోదావరిఖని ప్రధాన రహదారిపై ధర్నా
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు.
కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment