అడ్డుకున్న పోలీసులు.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చాలంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు శనివారం తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు వేర్వేరుగా ట్రిపుల్ ఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.
రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపు నివ్వగా.. ధర్నాకు అనుమతి లేదని నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించారు. ధర్నా నిర్వహించేందుకు కలెక్టరేట్ వద్దకు బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్ తదితరులు హాజరయ్యారు.
రైతులు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి క్యామ మల్లేశ్‌తోపాటు 10 మంది నిర్వాసితులు వేర్వేరుగా కలెక్టరేట్‌లోకి వెళ్లి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment