కాస్త దూరమే ప్రయాణించినా రుసుం వసూలు
త్వరలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో టోల్ వ్యవస్థ అనుసంధానం
టోల్ రోడ్లపై, వాహనాల్లో ఇందుకోసం సాంకేతిక ఏర్పాట్లు
ఇక టోల్ బూత్‌లే ఉండవు.. ఆటోమేటిగ్గా ఖాతాలోని డబ్బులు కట్
కర్ణాటక, హరియాణాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన
ఏడాది తర్వాత దేశవ్యాప్తంగా అమలుకు యోచన
సాక్షి, హైదరాబాద్: హైవే మీద కాస్త దూరమే ప్రయాణించినా ఇకపై సదరు వాహనం సంబంధిత ఖాతా నుంచి టోల్ రుసుము కట్ కానుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లోంచి వాహనం వెళ్తేనే టోల్ చెల్లించాల్సి వస్తోంది. టోల్ బూత్ వచ్చేలోపు రోడ్డు దిగిపోతే చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. ఇకపై అలా కాకుండా హైవే ఎక్కితే చాలు రుసుము చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు.
సెన్సార్లు, ఫాస్టాగ్‌లకు చెల్లు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌తో అనుసంధానమై టోల్ వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న టోల్ ప్లాజాలనే వినియోగించుకుంటున్నారు. అక్కడి సిబ్బందికి నిర్ధారిత రుసుము చెల్లించి రశీదు పొందే పద్ధతి తొలగించి, సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను రీడ్ చేయటం ద్వారా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఖాతాను వాడకాన్ని బట్టి ఎప్పటికప్పుడు టాప్ అప్ చేసుకోవల్సి ఉంటుంది.
కాగా దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో అనుసంధానమయ్యే కొత్త టోల్ వ్యవస్థను తీసుకొస్తోంది. టోల్ బూత్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. వాహనాలు టోల్ రోడ్ల మీద తిరిగిన దూరాన్ని ఉపగ్రహ సాయంతో గుర్తించి, ఆ మేరకు టోల్‌ను లెక్కిస్తుంది. ఆ వ్యవస్థతో అనుసంధానించిన ఖాతా నుంచి అంతమేర టోల్ రుసుము డిడక్ట్ అవుతుంది.
వాహనాల బారులు ఉండవు
గతంలో మాన్యువల్‌గా టోల్ వసూలు చేసినప్పుడు రద్దీ అధికంగా ఉండే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెచి్చంది. వాహనం టోల్ బూత్‌లోకి ప్రవేశిస్తుండగానే సెన్సార్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేసి టోల్‌ను డిడక్ట్ చేస్తాయి. ఈ పద్ధతిలో వాహనాల బారులు ఉండవని భావించారు.
కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాలతో రద్దీ సమయాల్లో ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలోనే క్షణాల్లో టోల్ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. దీంతోపాటు అసలు టోల్‌బూత్‌లే ఉండకపోవడంతో ఎక్కడా వాహనాలు వేచి చూడాల్సిన పరిస్థితి రాదు.
ప్రభుత్వానికి 3 రెట్లు పెరగనున్న ఆదాయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల మేర టోల్ వసూలవుతోంది. ఈ ఆదాయం పెరగనుంది. ఇప్పటివరకు టోల్ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం రావటం లేదు. కొత్త విధానంతో టోల్ రోడ్డుపై వాహనాలు స్వల్ప నిడివిలో ప్రయాణించినా టోల్ వసూలు చేసే అవకాశం ఉండటంతో టోల్ ఆదాయం కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. పైగా టోల్ బూత్‌ల నిర్వహణ భారం ఉండదు.
ఇలా పనిచేస్తుంది..
టోల్ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రోడ్లపై ప్రత్యేక కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. ఇక వాహనాల్లో ఆన్‌బోర్డ్ యూనిట్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ, వాహనం టోల్ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందో కచి్చతంగా నిర్ధారిస్తాయి.
వాహనదారు నిర్ధారించిన బ్యాంకు ఖాతాతో టోల్ వసూలు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్ రోడ్డుపైకి వాహనం చేరింది, ఏ ప్రాంతంలో అది హైవే దిగిందీ అన్న విషయాన్ని క్షణాల్లో నమోదు చేసి టోల్‌ను నిర్ధారించి, సంబంధిత ఖాతా నుంచి వసూలు చేసుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, హర్యానా లోని పానిపట్–హిస్సార్ జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తోంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment