
విద్యార్థుల విశిష్ట గుర్తింపునకు ఇక్కట్లు ఎన్నెన్నో..
ఆధార్, స్కూల్ రికార్డు, యూడైస్‌లలో వివరాలు ఒకేలా ఉంటే సరే..
సాక్షి, హైదరాబాద్: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్)(APAAR)’.. ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానం. ఒకటో తరగతి మొదలు పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థి పూర్తి వివరాలను అపార్ వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత.. వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది.. అదే అపార్ ఐడీ. విద్యార్థుల చదువుకు సంబంధించిన అన్నిరకాల వివరాలు, సర్టీఫికెట్లు అందులో నిక్షిప్తమవుతాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. రాష్ట్రంలోని 40 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల పరిధిలో సుమారు 65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది సెపె్టంబర్‌లో అపార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు 60 శాతం కూడా నమోదు పూర్తికాలేదు.
మూడింటిలోనూ సరిపోలితేనే..
విద్యార్థి తొలుత పాఠశాలలో చేరినప్పుడు రాసిన అడ్మిషన్ రిజిస్టర్, అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన యూడైస్ ప్లస్ వివరాలు, ఆధార్‌లోని వివరాలు.. ఇలా మూడింటిలోనూ విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు సరిపోలితేనే అపార్ వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసే వీలుంటుంది. ఏ ఒక్కదానిలో, ఏ వివరాల్లోనైనా తేడా ఉంటే అపార్ ప్రక్రియ పూర్తవడం లేదు. బర్త్ సర్టీఫికెట్‌లో పూర్తిగా వివరాలు లేకపోవడం, ఆధార్‌లో ఇంటిపేరుకు బదులు ఒక్క అక్షరమే ఉండటం, పుట్టినతేదీ తప్పుగా ఉండటం, పేరులో అక్షర దోషాలు వంటి సమస్యలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
వీటిని సవరించుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు తెస్తే అపార్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తామని ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న మధ్యవర్తులు, అధికారులతో చేతులు కలిపి.. అందినకాడికి దండుకుని సర్టీఫికెట్లు ఇప్పిస్తున్నారు.
ఫిర్యాదు చేసేదెలా...?
జనన ధ్రువపత్రాల జారీ, పొరపాట్ల సవరణకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అంతా మీసేవ కేంద్రాల ద్వారానే జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లను మాన్యువల్‌గా తీసుకురావాలనే సాకు చూపుతూ స్థానిక సంస్థల అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఇతర దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై వెంటనే సర్టీఫికెట్లు సిద్ధం చేసి ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ తంతు దరఖాస్తుదారులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎలాగోలా త్వరగా పనికావాలన్న ఉద్దేశంతో దళారులను ఆశ్రయిస్తున్నారు.
నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి
అపార్ ఉద్దేశం మంచిదే అయినా వివరాల నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఆధార్, యూడైస్, స్కూల్ రికార్డుల్లోని వివరాలన్నీ సరిపోలినప్పుడే పోర్టల్‌లో వివరాలను ఎంట్రీ చేయగలిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మెజార్టీ పిల్లల స్కూల్ వివరాలు, ఆధార్ వివరాల్లో చిన్నపాటి పొరపాట్లు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ ఈ సమస్య ఉంది. సరైన వివరాలను నమోదు చేస్తే తప్ప వెబ్‌సైట్‌లో అపార్ వివరాలు జనరేట్ కావు. ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి చేసినప్పటికీ.. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణతో వివరాల నమోదుకు అవకాశం కల్పించాలి. అప్పుడే అపార్ నమోదు ప్రక్రియ నూరుశాతం పూర్తవుతుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించాం. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావడంతో మార్పులు చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారు. – సిద్దగోని గిరిధర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘం
బర్త్ సర్టిఫికెట్‌లో మార్పు కోసం రూ.5 వేలు తీసుకున్నారు
మా ఇద్దరు పిల్లలకు సంబంధించి అపార్ వివరాలు నమోదుకావడం లేదని స్కూల్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. ఆధార్‌లో ఇంటిపేరు పూర్తిగా ఉంటే, జనన ధ్రువీకరణ పత్రంలో షార్ట్ ఫామ్‌లో ఉంది. దీంతో బర్త్ సర్టిఫికెట్‌లో వివరాలు మార్పించాలన్నారు. దీనికోసం స్థానికంగా ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లాను. గెజిటెడ్ సంతకం, అఫిడవిట్‌తోపాటు మున్సిపల్ కార్యాలయంలో పని పూర్తి చేయించేందుకు రూ.5 వేలు వసూలు చేశారు. వారం తర్వాత సర్టీఫికెట్ వచ్చింది. స్కూల్‌లో ఇచ్చి అపార్ వివరాలను నమోదు చేయించాను. – టి.యాకయ్య, జగద్గిరిగుట్ట, మేడ్చల్ జిల్లా
అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా తిరస్కరించారు
మా అబ్బాయి బర్త్ సర్టిఫికెట్‌లో తల్లిదండ్రుల పేర్లు ఇంటిపేరుతో కాకుండా ఒక్క మొదటి అక్షరంతో ఉన్నాయి. వాటిని మార్చి పూర్తి ఇంటిపేరు సరి చేయడానికి మీసేవ కేంద్రంలో దర ఖాస్తు చేశాను. ఆ పత్రాలను ప్రింట్ తీసుకుని ఎల్బీ నగర్ లోని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాను. ఆధారాలను సమర్పించినా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటూ మెలిక పెట్టి రెండు వారాల తర్వాత దరఖాస్తును తిరస్కరించారు. – బందె గిరిజ, ఎల్‌బీ నగర్, రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment