చదువులూ వరద పాలు! | Study of thousands of students disrupted in telangana: Heavy rains | Sakshi
Sakshi News home page

చదువులూ వరద పాలు!

Published Sat, Sep 7 2024 6:25 AM | Last Updated on Sat, Sep 7 2024 6:25 AM

Study of thousands of students disrupted in telangana: Heavy rains

భారీ వర్షాలతో మానుకోటలో 188, ఖమ్మంలో 72 పాఠశాలలపై ఎఫెక్ట్‌

స్కూళ్లు, ఇళ్లలో తడిసిన పుస్తకాలు, కొట్టుకుపోయిన బ్యాగ్‌లు

దెబ్బతిన్న కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు

వేలాది మంది విద్యార్థుల చదువులకు ఇబ్బంది

రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బడులకు వెళ్లలేని పరిస్థితి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్‌: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్‌లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్‌ వాల్‌ దెబ్బతినడం, కిచెన్‌ షెడ్‌ కూలిపోవడం, ఫర్నిచర్‌ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఖమ్మం రూరల్‌ మండలం జలగంనగర్‌లోని మండల పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్‌తేజ్, ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.

బడికి వెళ్లాలంటే.. సర్కస్‌ ఫీట్లే..
మహబూబాబాద్‌ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.

భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది
మంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది.  – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement