వరద నష్టాల పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృందానికి బాధితుల మొర
రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన బృందం.. పంట, ఆస్తి నష్టాలను పరిశీలించిన ఒక సబ్ టీమ్
రోడ్లు, చెరువులు, కాల్వలు, వంతెనల నష్టంపై ఫోకస్ చేసిన మరో సబ్ టీమ్
సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమైన ముంపు బాధితులు
నిద్ర లేచి చూస్తే నీళ్లలో ఉన్నాం.. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన
నేడు మున్నేరు ముంపు ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: ‘‘అర్ధరాత్రి దాటాక అకస్మాత్తు వరద.. మెలకువ వచ్చి చూస్తే నీళ్లలో ఉన్నాం.. దిక్కుతోచని పరిస్థితిలో ఇంటిపైకి ఎక్కి, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తి ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం.. కానీ సర్వం కోల్పోయాం.. నిత్యావసరాల నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నీ కొట్టుకుపోయాయి.. ఉన్నా పాడైపోయాయి.. మా బతుకులకు ఆధారమైన పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
నిండా మునిగిపోయాం.. ఆదుకోండి’’ అని ముంపు బాధితులు కేంద్ర బృందానికి గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించి, నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది.
రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి..
ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర వరద పరిశీలన బృందం.. తొలిరోజు బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి, హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో.. ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుశ్వంగ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి టి.నియల్ ఖాన్సూన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త శశివర్ధన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఈ బృందం రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తి నష్టాలను పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు వంటివాటిని పరిశీలించింది. ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు వరద నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.
ఖమ్మంలో జిల్లాలో..
కేంద్ర బృందం సభ్యులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్‌వీడ్ తండాలో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, సూర్యాపేట మధ్యలో దెబ్బతిన్న జాతీయ రహదారిని, మల్లాయిగూడెంలో దెబ్బతిన్న రోడ్డును, పాలేరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు పడిన గండిని, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనకంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కస్నాతండాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పాలేరు, మున్నేరు వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కేంద్ర బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రాకాసితండాలో దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. సమీపంలో ఆకేరు వరదతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని చూశారు. ఈ సందర్భంగా తమ ఇళ్లు, పంట పొలాలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని.. తమను ఆదుకోవాలని మహిళలు కేంద్ర బృందం సభ్యులకు దండం పెట్టి వేడుకున్నారు. తమకు మరో ప్రాంతంలో నివాసం కల్పించాలని విన్నవించారు.
మానుకోట జిల్లాలో పరిశీలించి..
కేంద్ర బృందం సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోనూ రెండు సబ్ టీమ్‌లుగా పర్యటించారు. ఒక సబ్ టీమ్ సభ్యులు తొలుత మరిపెడ మండలం ఉల్లెపల్లిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. సీతారాంతండాలో వరదతో సర్వం కోల్పోయిన ఇస్లావత్ మంగీలాల్ కుటుంబంతో మాట్లాడారు. వరద వచ్చినప్పుడు సమయమెంత? మీకు మెలకువ ఎలా వచ్చింది? సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లారు? ఎంత నష్టం జరిగింది అంటూ వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మరో సబ్ టీమ్ సభ్యులు.. మరిపెడ మండలం అబ్యాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కలపల్లి గ్రామాల్లో తెగిన చెరువులు, రోడ్లు, వరద ప్రవాహం తీరును పరిశీలించారు. నష్టం ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు.
నేడు మున్నేరు ముంపు, సూర్యాపేట జిల్లాలో పర్యటన
కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment