మహబూబాబాద్ అర్బన్: ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు.. అందులో 132 మంది బాలురు.. బాలికలు 118 మంది.. కానీ ఉన్నది ఒక్కటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా, బాలికలు ఒకరి తరువాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు.. జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధి ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి.
బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువుకట్టకు వెళ్తుండగా, బాలికలు క్యూలైన్‌లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment