Bathroom
-
విమానం బాత్రూంలో చిన్నారి..
విమానంలో నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్‌లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు. పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్‌లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పల్నాడు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాత్రూమ్లోకి వెళ్లి హెయిర్‌లోషన్ తాగింది. కొంత సేపటికి వాంతులు కావడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఓత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. బాత్రూమ్కు వెళ్లి బయటకు రాని వరుడు!
విశాఖపట్నం: అంతటా సందడి వాతావరణం.. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న ఆ జంటను చూసి ఇరు కుటుంబాల సంతోషానికి అవధుల్లేవు. పాస్టర్లు ప్రార్థనలు చేసి, క్రీస్తు దీవెనలు అందజేశారు. నూతన జంట కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉంగరాలు మార్చుకునే క్షణం రానేవచ్చింది. ఇంతలో బిగ్ ట్విస్ట్. పెళ్లి కొడుకు బాత్రూమ్కు అని చెప్పి వెళ్లాడు. అక్కడి నుంచి ఎంతకీ రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా అతను తెరవలేదు. చివరకు బతిమలాడటంతో బయటకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. ఏవో కుంటిసాకులు చెప్పుకొచ్చాడు. దీంతో బంధువులు, పెళ్లి పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కొడతారేమోనన్న భయంతో వరుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్‌కు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, వారి బంధువులను పిలిపించారు. వరుడు, వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అర్థం పర్థం లేని వరుడి తీరును చూసి వధువు, ఆమె బంధువులు వివాహానికి నిరాకరించారు. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది. ఈ ఘటన బుధవారం పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.3 లక్షలు, తులమున్నర చైన్, ద్విచక్రవాహనం లాంఛనంగా ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు. బుధవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. వరుడు తీరుతో రద్దయింది. పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది. -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్‌లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!. ఇంతకీ ఈ ప్యాలెస్‌ని పోలిన భవనం థాయ్‌లాండ్‌లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు. ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్రూమ్. బంగారు రంగు డిజైన్‌తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం. View this post on Instagram A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia) (చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..) -
ఆ బిడ్డ భద్రం..!
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బాత్రూమ్లో గర్భిణి ప్రసవించి వదిలి వెళ్లిన పసికందుకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈనెల 16వ తేదీ వేకువజామున కడుపు నొప్పితో వచ్చిన ఓ గర్భిణి ఆస్పత్రి బాత్రూంలోనే ప్రసవించి... బిడ్డను వదిలి వెళ్లిన ఘటన విధితమే. ఆపై బిడ్డకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 1.4 కేజీలుండగా..ప్రస్తుతం 1.5 కేజీలుందని వైద్యులు చెబుతున్నారు. 2 కేజీలు దాటేంత వరకు ఎస్ఎన్సీయూలోనే బిడ్డకు చికిత్స అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా బిడ్డకు కాస్త ఇబ్బందులు ఉన్నాయని..మరో రెండు రోజుల్లో ఈ సమస్య కూడా రికవరీ అవుతుందన్నారు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాలుగు వారాల పాటు చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే సంరక్షణకు ఐసీడీఎస్ శిశువిహార్‌కు పంపనున్నారు. ప్రస్తుతం ఆశాఖ సిబ్బంది పర్యవేక్షణలోనే బిడ్డకు వైద్య సేవలు చేస్తున్నారు. కాగా బిడ్డ వదిలి వెళ్లిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఐఓ రవిరాజు విచారణ కూడా పూర్తి చేశారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బిడ్డను మాకు ఇవ్వండయ్యా... ఆడబిడ్డలంటే చులకన చూసే కళ్లు..ఇప్పటికే చాలానే ఉన్నాయి. ఆడబిడ్డ పుట్టిందని ఆమడ దూరంలోనే నిలబడే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తరచూ చూస్తుంటాం. మగ సంతానం లేదని ఆత్మహత్యలు చేసుకున్న కేసులు సైతం చాలానే ఉన్నాయి. అయితే ఈ వదిలి వెళ్లిన బిడ్డ కోసం పలువురు ముందుకు వస్తున్నారు. ఆ బిడ్డను తమకు ప్రసాదించండంటూ ఆస్పత్రి అధికారులకు నివేదించుకుంటున్నారు. అసలు తల్లి లేకుంటే.. తామున్నామంటూ.. క్యూ కడుతున్నారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఇలా ఆ బిడ్డనుకోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు మాత్రం బిడ్డను ఐసీడీఎస్‌కు అప్పగించామని, ఇక చట్ట ప్రకారం వెళ్లాల్సిందేనన్ని స్పష్టం చేస్తున్నారు. బిడ్డను కోరుకునే వారు దతత్త ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్.. ఆకతాయి అరెస్ట్
యశవంతపుర: పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ వీడియో తీయడానికి యత్నించిన యువకుడిని ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపికి సమీపంలోని ముల్కి పక్షికరెకి గ్రామానికి చెందిన సుమంత్ (22)ని అరెస్ట్ చేశారు. నిందితుడు పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్ దాచి పెట్టాడు. అదే సమయంలో యువతి అన్న బాత్రూమ్కు వెళ్లగా మొబైల్‌ను గమనించాడు. విచారించగా మొబైల్ సుమంత్దిగా గుర్తించారు. అతని ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బాత్రూమ్లో బీకేర్‌ఫుల్.. ఇళ్లల్లో రెండో అత్యంత ప్రమాదకర ప్రదేశం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 ఏళ్లు పైబడిన వారిలో 2.35 లక్షల మంది బాత్రూమ్లో గాయపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక చెబుతోంది. ఇంట్లో అతి చిన్న గదే అయినప్పటికీ.. వంటగది తరువాత బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బాత్రూమ్లో సంభవించే ప్రమాదాల కారణంగా ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నిత్యం 370 మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఎముకల చికిత్స కోసం వెళుతున్న వారిలో దాదాపు 35నుంచి 45 శాతం మంది బాత్రూమ్లో జారిపడి గాయాల పాలైనవారే. ప్రముఖ సినీ నటి శ్రీదేవి దగ్గర్నుంచి తాజాగా చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు వరకూ అనేక మంది ప్రముఖుల మరణాలు బాత్రూమ్లోనే సంభవించాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి వదులుగా ఉన్న టాయిలెట్ బౌల్ రిమ్పై కూర్చోవడం వల్ల అది అటూ ఇటూ కదిలి శరీరానికి గాయం చేయవచ్చు. ప్లాస్టిక్ సీట్లు పగిలిపోవడం, వ్యక్తి బరువు వల్ల కూలిపోవడం కూడా గాయాలు కలిగించవచ్చు. టాయిలెట్లలో సిగరెట్లు వంటివి పడేయడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. సాధారణంగా బాత్రూమ్ ప్రమాదాలు మనం టబ్‌లోంచి బయటకు వస్తున్నప్పుడో, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి. ఇలాంటివి ఆపాలంటే బాత్రూమ్ వాడుతున్నప్పుడు లైట్లు, డోర్ మ్యాట్లు వేయాలి. బాత్రూమ్ నేలను పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించాలి. పాశ్చాత్య టాయిలెట్లో కూర్చుని లేచే సమయంలో హ్యాండిల్ పట్టుకుని లేవాలి. బాత్రూమ్కి వెళ్లినప్పుడు లోపల గట్టిగా గడియపెట్టుకోవకపోవడం వృద్ధులకు మంచిది. షవర్ కింద స్నానం చేసే సమయంలో స్టూల్ వాడాలి. చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చరిత్రలో కొన్ని దుర్ఘటనలు ♦ చైనాలోని జిన్ రాష్ట్ర పాలకుడు క్రీస్తు పూర్వం 581లో టాయిలెట్ పిట్లో పడి మరణించాడు. ♦చరిత్రలో మర్చిపోలేని దుర్ఘటన ఒకటి 1184 జూలై 26న సంభవించింది. ‘ఎర్ఫర్ట్ లెట్రిన్ విపత్తు’గా పిలిచే ఈ ప్రమాదం రోమన్ చక్రవర్తి హెన్రీ అనధికార సమావేశం నిర్వహిస్తుండగా.. దానికి హాజరైన వారి బరువు కారణంగా చెక్క భవనం రెండవ అంతస్తు నేల కూలిపోయింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మునిగిపోవడంతో 60 మంది మరణించారు. ♦ 1760లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన కింగ్ జార్జ్ అక్టోబర్ 25న టాయిలెట్లో మరణించాడు. ♦1945లో జర్మన్ జలాంతర్గామి ఒక టాయిలెట్ ప్రమాదంలో మునిగిపోయింది. ♦1983 జూన్ 2న ఎయిర్ కెనడా విమానం–797 వెనుక లావెటరీలో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో 23 మంది మరణించారు. ♦ బ్రిటిష్ వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ షేల్ జూన్ 26, 2011న గ్లాస్టన్బరీ ఫెస్టివల్లో పోర్టబుల్ టాయిలెట్లో గుండెపోటుతో చనిపోయాడు. ♦ టాయ్లెట్ల ఫిట్టింగ్‌లు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా దాదాపు 10 వేల ఓడలు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నాయి. వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్ ఇంట్లో 65 ఏళ్లు పైబడిన పెద్దవారు ఉంటే.. బాత్రూమ్ ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి నలుగురిలో ముగ్గురు వృద్ధులు ఏడాదికి ఒకసారైనా బాత్రూమ్లో జారిపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల్లో 65 శాతం చిన్న గాయాలతో సరిపెట్టినా.. మిగతా 35 శాతం మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 42 శాతం మంది టాయిలెట్లలో 7 నుంచి 10 సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. 58 శాతం మంది 11 నుంచి 15 సార్లు పడిపోతున్నారు. సరైన తలుపులు లేకపోవడం ప్రమాదానికి వంద శాతం కారణమవుతుండగా, జారే ఫ్లోర్ 91.9 శాతం, బాత్రూమ్ పరిమాణం 80.3 శాతం, ఎత్తైన తలుపు థ్రెషోల్డ్ 53.5 శాతం, నాన్–స్కిడ్ మ్యాట్ లేకపోవడం 99.5 శాతం, గ్రాబ్ బార్లు లేకపోవడం 97 శాతం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం 96.6 శాతం, బాత్రూమ్లో వెలుతురు సరిపోకపోవడం వల్ల 94.4 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. వేడి నీటి వినియోగం 89.9 శాతం, సీట్ ఉపరితలం 55.6 శాతం, ప్రవేశ ద్వారం వద్ద లైట్ స్విచ్ లేకపోవడం 53 శాతం, చిందరవందరగా ఉన్న మార్గం వంటివి 39.4 శాతం కారణమవుతున్నాయి. ఎన్సీబీఐ మార్కెటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 11 శాతం హార్ట్ అటాక్‌లు బాత్రూమ్లోనే వస్తున్నాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇవి సంభవిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి బాత్రూమ్లో మరణించే వారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వల్లే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు.. ఆ నీటిని తలపై పోసుకుంటే శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి. దీనివల్ల తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు పక్షవాతం కూడా రావచ్చు. జారి పడిపోయినప్పుడు తల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నుపూస కూడా విరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుధాకర్ కనపర్తి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణుడు, విజయవాడ -
ట్రంప్ దిగజారితే, కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో అతని కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహరిస్తున్నాడనే వార్తలు గుప్పుముంటున్నాయి. తాజాగా అమెరికన్ గాయని ఆబ్రే ఓ డే.. జూనియర్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సుదీర్ఘ కాలంగా జూనియర్ ట్రంప్‌తో తనకు అఫైర్ ఉన్నట్లువస్తున్న ఆరోపణలు ఒక స్వలింగ సంపర్కుల క్లబ్‌లోని బాత్రూమ్లో మొదలయ్యాయన్నారు. పాడ్‌కాస్ట్‌లో వివరాలు వెల్లడి.. మైకేల్ కోహెనెకు చెందిన ‘మేయా కుల్పా’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న 34 ఏళ్ల ఆబ్రే ఓ డే తొలిసారిగా తనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. తనను జూనియర్ ట్రంప్ వేధించి లైంగికంగా సంబంధం ఏర్పరుచుకున్నాడని ఆరోపించింది. మేము మొదటిసారి ఒక గే క్లబ్‌కు వెళ్లాం. అప్పుడు అతను నా వైపు చెడుగా చూశాడు. ఈ రాత్రికి క్లబ్‌లోనే ఉంటానని అన్నాడు. అది న్యూయార్క్‌లో అతి పెద్ద క్లబ్. దాని భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయి. ఆబ్రే ఓ డేకు అప్పుడు మరో మార్గం లేదు అని అనుకుంది. అతని ఇన్‌స్టాగ్రామ్‌లో.. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆబ్రే ఓ తాను అతని ఇన్‌స్టాగ్రామ్‌ని మొదటిసారి చూశానని, దానిలో గే కమ్యూనిటీని కించపరిచే అన్ని రకాల జోక్‌లు ఉన్నాయని తెలిపారు. మేము మొదటిసారిగా గే క్లబ్ బాత్రూమ్లో లైంగిక చర్యలో పాల్గొనడం చాలా సౌకర్యంగా ఉంది అని అతను పేర్కొన్నాడని ఆమె ఆరోపించింది. ఈ జంట శారీరకంగా కలవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, మాజీ డానిటీ కేన్ ఫ్రంట్ వుమన్.. వీరు గతంలోనే బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారని వెల్లడించింది. ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లోనూ.. ఆబ్రే ఓ డే తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట 2011లో ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లో తొలిసారిగా కలుసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు నవ్వుకున్నారు. పార్టీలో ఏదైనా ఫన్నీగా జరిగిప్పుడు మేము ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే సన్నిహితులమయ్యాం అని ఆమె తెలిపింది. తాను ఎప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉంటానని ఆబ్రే ఓ పేర్కొంది. కాగా గత ఏడాది పేజ్ సిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆబ్రే ఓ తనకు జూనియర్ ట్రంప్‌తో ఉన్నసంబంధం గురించి ప్రస్తావించింది.అయితే జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించలేదు. ఇదికూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. -
కాబోయే జంటపై గ్యాస్ గీజర్ పంజా.. బాత్రూమ్లో స్నానం చేస్తూ..
కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఉద్యోగం, సహజీవనం చేస్తూ.. వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్‌చేసి ఇద్దరూ బాత్రూమ్లో స్నానం చేయడానికి వెళ్లి బాత్రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు. డ్యూటీకి రాకపోవడంతో ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్‌కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ఉంచారు. ఆ ఎస్టేట్‌లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్‌లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్‌లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్‌లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్‌పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్‌లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్‌లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్‌ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్‌పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్‌లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాత్రూమ్లో శవమై తేలిన యువనటుడు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ బాత్రూమ్లో శవమై తేలాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. అయితే అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం కారణంగానే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ జర్నీ దిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించాడు. స్ప్లిట్స్ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) View this post on Instagram A post shared by Aditya Singh Rajput OFFICIAL (@adityasinghrajput_official) -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
-
అమానుషం.. ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన మహిళ
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. ఆస్పత్రి బాత్రూమ్లోనే ప్రసవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన భర్త లింగయ్యతో కలిసి నాలుగు రోజుల కిందట రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచి్చంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. అయితే, పార్వతమ్మకు బుధవారం ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమె బాత్రూమ్లోకి వెళ్లింది. నొప్పులు ఎక్కువ కావడంతో పార్వతమ్మ అక్కడే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది శిశువును ఐసీయూకు తరలించి తల్లీబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. నొప్పులు వచ్చిన సమయంలో సరైన విధంగా వైద్యులు స్పందించి చికిత్స చేసి ఉంటే బాత్రూమ్లో ప్రసవించేదికాదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని పార్వతమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నార్మల్ డెలివరీ కోసం ప్రయతి్నస్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ప్రసవించిందని వైద్యులు చెబుతున్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్ డోర్‌లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్‌తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
900 మందికి ఒకే టాయిలెట్టా..!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తొమ్మి ది వందల మంది చదివే ఓ ప్రభుత్వ కళాశాలలో ఒక్క బాత్రూం ఉండటమా? అదీ విద్యా శాఖ మంత్రి ఇలాకాలోనా? ఇలా టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుది దరిద్రపు పాలనని చెప్పేందుకు ఇదొక్కటిచాలని మంగళవారం తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పిల్లలకు కనీసం బాత్ రూంలు కూడా కట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?..విద్యాశాఖ మంత్రి ఊడితే ఎంత అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా టాబ్లె ట్ వేసుకుంటున్నామన్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నామని నిలదీశారు. -
మీది బాత్రూమా? యాక్ రూమా? ఈ జాగ్రత్తలు లేకపోతే అతిథులు పారిపోతారు మరి!
చాలామందికి ఒంటి మీద ఉన్నంత శ్రద్ధ పాదాల మీద ఉండదు. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచి వస్తువులను అందంగా అమర్చుకోవడంలో ఉన్న తీరిక, ఓపిక బాత్రూమ్కి వచ్చేసరికి ఉండవు. అయితే బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, హాలు ఎంత నీట్‌గా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకని ఇంటి శుభ్రత ఎంత ముఖ్యమో, బాత్రూమ్ శుభ్రత కూడా అంతే ముఖ్యం. ఇంతకీ బాత్రూమ్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందామా మరి! సాధారణంగా మనకి ఎన్నో పనులు ఉంటాయి. వాటిలో పడిపోయి మనం బాత్రూమ్ని శుభ్రం చేయడం మరిచిపోతాం. మిగిలిన రూమ్లన్నిటికన్నా బాత్రూమ్ తొందరగా ఖరాబవుతుంది. అందుకని వీలైనప్పుడల్లా బాత్రూంని శుభ్రం చేయడం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఎప్పుడు వీలుంటే అప్పుడు బాత్రూంని శుభ్రం చేయడం ఎంతో అవసరం. కానీ కుదిరినప్పుడు కాస్త ఓపిక చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటే దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది బాత్రూమ్. చెత్తాచెదారం లేకుండా బాత్రూంని శుభ్రంగా ఉంచాలన్నా, దుర్వాసన లేకుండా ఉండాలన్నా, ముందుగా బాత్రూమ్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం అవసరం. బాత్రూమ్లో పేరుకుపోయే చెత్తాచెదారం ఏమిటా అనుకుంటున్నారా... ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, రేజర్ బ్లేడ్లు వంటివి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మరచిపోకండి. ఇలా చేస్తేనే బాత్రూమ్ని నీట్‌గా ఉంచుకునేందుకు వీలవుతుంది. కనుక ఈసారి నుండి తప్పనిసరిగా ఇలా అనుసరించండి. ఎయిర్ ఫ్రెష్నర్/ డిఫ్యూజర్ వాడకం బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే బాత్రూమ్లో ఒక చిన్న డిఫ్యూజర్ ఉంచాలి. దీనివల్ల బాత్రూమ్ నుంచి మంచి వాసన వస్తుంటుంది. ఈ చిన్న డిఫ్యూజర్‌ని సింకు వెనక పెడితే, ఈ డిఫ్యూజర్ మంచి వాసన వెలువడేట్లు చేస్తుంది. డిఫ్యూజర్ పెట్టుకునే వీలు లేనివారు ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను బాత్రూమ్లో పెట్టడం వల్ల కూడా మంచి వాసన వస్తుంది. మీరు మీ బాత్రూంలో మీకు నచ్చిన చోట వీటిని పెట్టొచ్చు. తడిసిన తువ్వాళ్లు వద్దు కొంతమంది ఒళ్లు తుడుచుకుని తడీపొడీ టవల్‌ను బాత్రూమ్లోనే పడేసి వస్తుంటారు. అలాగే అండర్వేర్లు, బనీన్లు కూడా బాత్రూమ్లోనే వదిలేస్తుంటారు. నిజానికి మాసిన బట్టల కన్నా తడిబట్టల నుంచి, తడీపొడి బట్టల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తడి బట్టలు కానీ మాసిన బట్టలు కానీ బాత్రూంలో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంటుంది కాబట్టి వాటిని తొలగిస్తూ ఉండండి. సబ్బులు మంచి సువాసన వచ్చే సబ్బుల్ని బాత్రూంలో పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని బాత్రూంలో పెట్టండి ఇది కూడా మీ బాత్రూమ్ని బాగా ఉంచడానికి సహాయ పడుతుంది. టాయిలెట్ ట్యాంక్‌లో డిటర్జెంట్ లాండ్రీ డిటర్జెంట్‌ని మీరు మీ టాయిలెట్ ట్యాంక్‌లో వేయొచ్చు ఇది కూడా మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఫ్లష్ చేసినప్పుడు సెంటెడ్ వాటర్ వస్తాయి. హెర్బ్స్ వాడకం బాత్రూంలో హెర్బ్స్ ఉపయోగించడం మంచి ఐడియా. పైగా ఇవి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మన బడ్జెట్లోనే వీటిని మనం బాత్రూంలో తెచ్చి పెట్టొచ్చు. లావెండర్ లేదా మింట్ని బాత్రూంలో పెట్టవచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. లేదంటే ఎండిపోయిన యూకలిప్టస్‌ని బాత్రూమ్లో హ్యాంగ్ చేసి ఉంచితే చాలు... దుర్గంధాన్ని వదలగొట్టి మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు మీ బాత్రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. హాయిగా కూనిరాగాలు తీసుకోవచ్చు. లేదంటే అతిథులు ఎవరైనా వస్తే యాక్ అని వాంతి చేసుకుని పారిపోతారు జాగ్రత్త! చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే ఆ వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడి వరకు వచ్చి పనిచేసుకుంటున్న ఆ మనిషి చనిపోయిన సంగతి ఐదు రోజుల తర్వాత అందరికీ తెలిసింది. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి స్థానిక పాతజాతీయ రహదారి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఇంటిలో ఐదు రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతుడు తమిళనాడుకి చెందిన గోవిందన్ వేణుగోపాల్ (54)గా గుర్తించారు. అతను హడ్డుబంగి గ్రామ సమీపంలో గల మార్గర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీ ఇన్చార్జిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ క్వారీ కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి వేణుగోపాల్ రూమ్‌లోనే ఉండేవారు. అప్పుడప్పుడు క్వారీకి వెళ్లి వచ్చేవారు. అయితే ఐదు రోజులుగా క్వారీకి రావడం లేదని అక్కడి వాచ్మెన్ తెలిపారు. వినాయక చవితి రోజున ఆరోగ్యం సరిగా లేదు రానని వాచ్‌మెన్‌కు వేణుగోపాల్ చెప్పారు. ఈ నెల 2న ఇంటి అద్దెను కూడా చెల్లించారు. అప్పటి నుంచి ఆయన కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని ఇంటి యజమాని అనుకున్నారు. శనివారం వేణుగోపాల్ ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని వెళ్లి చూశారు. బాత్రూమ్లో వేణుగోపాల్ మృతదేహం కనిపించడంతో నిశ్చేష్టుడైపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అతను మరణించి ఐదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. మృతుడు ఒక్కడే ఇంటిలో ఉండడంతో అతను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదని చెప్పారు. చదవండి: మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య -
మహిళ బాత్రూమ్లో భారీ పైథాన్.. ఆ తర్వాత ఏమైందంటే?
అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్రూమ్లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్ ఘటనే థాయ్‌లాండ్‌కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్రూమ్లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్రూమ్ మొత్తం గ్లాస్‌తో కవర్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ టబ్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్రూమ్లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) -
Crime News: బాత్రూంలో కెమెరాలు! మంచోడు అనుకుంటే..
బంజారాహిల్స్: మంచోడు అనుకుని ఓ ఆఫీస్ బాయ్‌తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లోని ఓ బొటిక్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్ రావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్‌కు గురైంది. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్‌రూమ్‌లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్ దాస్ అనే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆఫీస్ బాయ్ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్‌గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్రూమ్లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్‌దాస్ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అమానుషం: ఎవరిదీ పాపం.. మరుగుదొడ్డి వద్ద శిశువు మృతదేహం
తిరువళ్లూరు(చెన్నై): ఓ ప్రైవేటు వైద్యశాల ఆవరణలో ఆడశిశువు మృతదేహం మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. చోళవరం అత్తిపట్టులో ఎంఎంఆర్వీ వైద్యశాల ఉంది. ఇక్కడ సాధారణ, అత్యవసర సేవలకు చిక్సిత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాల ఆవరణలోని ఓ మరుగుదొడ్డి వద్ద ఆడశిశువు మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్టు గుర్తించి చెన్నై వైద్యశాలకు తరలించారు. కాగా నవజాత శిశువును మరుగుదొడ్డికి సమీపంలో పడేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మరో ఘటనలో.. కూలిన విద్యుత్ స్తంభం తిరుత్తణి: తిరుత్తణి శివారులోని కాశినాధ పురం దళితవాడలో హై ఓల్టేజీ విద్యుత్ స్తంభంపై పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పడి విద్యుత్‌స్తంభం కూలింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో ఇళ్ల ముందు ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభం కూలిన సమయంలో వీధిలో ప్రజలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం కూలిన విద్యుత్ స్తంభం తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దుస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. చదవండి: తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష -
ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం
రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్రూమ్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్‌లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు శనివారం కాన్బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది.