చైనాలో ఇద్దరు మహిళల నిర్వాకం
విమానంలో నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది.
దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్‌లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు.
పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్‌లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment